పొత్తుల సంగతి ఆజాద్ టూర్‌లో తేలుతుందా?

కాంగ్రెస్ ట్ర‌బుల్ షూట‌ర్ గులాం న‌బీ ఆజాద్ హైద‌రాబాద్ వ‌స్తున్నారు. తెలంగాణ ఎన్నిక‌ల వేళ ఆజాద్ ప‌ర్య‌ట‌న ఇప్పుడు ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. పొత్తులు కుద‌ర్చ‌డంలో.. ప్ర‌భుత్వాలు ఏర్పాటు చేయ‌డంలో ఆజాద్ స్టైల్ వేరు. రాజ‌కీయాల్లో ప‌ట్టువిడుపులు తెలిసిన నేత‌. తెలంగాణ‌లో 2004లో పొత్తులు కుద‌ర్చ‌డంలో ఆజాద్ జాదూ ప‌నిచేసింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జ్‌గా కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీల‌క పాత్ర పోషించారు. తెలంగాణ‌లో మ‌ళ్లీ ఎన్నిక‌ల వేళ ఆజాద్ రానుండ‌డంతో కొంద‌రు కాంగ్రెస్ నేత‌ల్లో ఆశ‌లు మొద‌ల‌య్యాయి. పొత్తులు, ఇత‌ర స‌మ‌స్య‌లను ఆజాద్ తీర్చివెళ‌తార‌ని వీరంతా న‌మ్ముతున్నారు.

ఇంత‌కుముందు మూడు సార్లు ఆజాద్ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. కేసీఆర్ కోవ‌ర్టుల వల్లే ఆయ‌న‌ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింద‌ని కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు అప్ప‌ట్లో కామెంట్లు చేశారు. ఎట్ట‌కేలకు ఆజాద్ ప‌ర్య‌ట‌న ఖాయం కావ‌డంతో ఇప్పుడు మ‌ళ్లీ ఆనేత‌లు కొంద‌రు ఆశ‌లు పెంచుకున్నారు. యూత్ కాంగ్రెస్ నేత‌గా ఎంట్రీయైన ఆజాద్‌కు చంద్ర‌బాబుతో ప‌రిచ‌యం ఉంది. అంతేగాక తెలంగాణ కాంగ్రెస్ ప‌రిస్థితి తెలుసు. ఇక్క‌డి నేత‌ల సైకాల‌జీ అర్ధం చేసుకోగ‌ల‌రు. చంద్ర‌బాబుతో ప‌రిచ‌యం,గ్రౌండ్ రియాల్టీ తెలిసిన ఆజాద్ పొత్తుల సంగ‌తి తేల్చి వెళ‌తార‌ని కాంగ్రెస్ నేత‌లు గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. దీంతో ఆజాద్ ప‌ర్య‌ట‌న‌పై వారంతా ఆశ‌లు పెట్టుకున్నారు.