విరాళాల గుట్టు…. పవన్ ఎందుకు సైలెంటయ్యారు….

నాడు చిరంజీవిపై అదే కుట్ర.. నేడు ఆయన తమ్ముడు జనసేనాని పవన్ కళ్యాణ్ పై అదే ఫార్ములా.. టికెట్లు అమ్ముకున్నాడని అన్నను.. పార్టీ కోసం పైసలు వసూలు చేశాడని తమ్ముడిని అభాసుపాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోన్ని కొన్ని సామాజికవర్గాలకు అనుకూలమైన మీడియా ఇలా కక్ష కట్టి చిరంజీవి-పవన్ కళ్యాణ్ లతో ఆడుకుంటోంది.

కొద్దిరోజుల క్రితమే జనసేన పార్టీ అత్యంత రహస్యంగా కాపు సామాజిక వర్గ బడా పారిశ్రామికవేత్తలను సమావేశ పరిచి విరాళాలు సేకరించింది. దీన్ని తెలుసుకున్న మహామూర్తి తన చానెల్ ద్వారా స్టింగ్ ఆపరేషన్ అంటూ సంచలన కథనాన్ని ప్రసారం చేశాడు. పవన్ తనకు కుల పిచ్చి లేదని అంటాడని… ఇలా కులపోళ్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని నానా యాగీ చేశాడు. దీనికి ఆయన పని చేస్తున్న యాజమాన్యం కూడా ఆగ్రహించి ప్రసారాలు ఆపేసింది. నొచ్చుకున్న మూర్తి ఆ చానెల్ కు రాజీనామా చేసి బయటకు వచ్చాడు. అనంతరం మాట్లాడుతూ పవన్ అక్రమ వసూళ్లు అంటూ మండిపడ్డాడు. సోషల్ ద్వారా అన్ని విషయాలపై వివరణ ఇస్తూ ఆధారాలున్నాయని పవన్ పై దుమ్మెత్తి పోశారు.

అయితే ఇంత పెద్ద రచ్చ జరుగుతున్నా జనసేనాని పవన్ మాత్రం ఇప్పటి వరకూ దీనిపై స్పందించింది లేదు. అప్పట్లో శ్రీరెడ్డి సహా ఎవరూ ఏం తిట్టినా రియాక్ట్ అయ్యి వారి బండారం బయటపెట్టిన పవన్.. ఇప్పుడు తన విరాళాల వసూళ్లపై జర్నలిస్టు మూర్తి లేవనెత్తిన తాజా ప్రశ్నలపై స్పందించకపోవడం.. తన జనసేన నాయకులను కూడా దీనిపై స్పందించవద్దని ఆదేశాలు జారీ చేయడం తాజాగా హాట్ టాపిక్ అయ్యింది.

తాజాగా పవన్ కళ్యాణ్ తన పార్టీ ముఖ్యనేతలతో అంతర్గత సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. ఇందులో మూర్తి స్టింగ్ ఆపరేషన్.. అనంతరం విమర్శలపై ఎవ్వరూ ఎక్కడా మాట్లాడవద్దని అల్టిమేటం జారీ చేసినట్టు తెలిసింది. ఈ విషయంలో అనవసరంగా నోరు జారీ మరింత వివాదాస్పదం చేయవద్దని సూచించినట్టు సమాచారం. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిస్తే ప్రజలు మనల్ని, మన నిజాయితీని అర్థం చేసుకుంటారు అని పవన్ పేర్కొన్నట్టు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇంతటి కాంట్రవర్సీని టచ్ చేస్తే తనకు తన పార్టీకి నష్టమనే పవన్ సైలెంట్ అయ్యారని దీన్ని బట్టి అర్థమవుతోంది.