Telugu Global
NEWS

వృద్ధనేతలపై కోమటిరెడ్డి ఫైర్

తనకు కాంగ్రెస్‌ పెద్దలు షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్‌ నేతలపై ఫైర్ అయ్యారు.  తెలంగాణ మిగిలిన జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా నేతలు భయపడ్డారని…. ఆ సమయంలో నల్లగొండలో టీఆర్‌ఎస్‌ ను చాలెంజ్‌ చేసి తాను ఎమ్మెల్సీగా గెలిచానని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఎవరిని ధూషించాలన్నది తన ఉద్దేశం కాదన్నారు. సీనియర్లను పట్టించుకోకుండా కమిటీలు వేయడంపైనే తమ ఆవేదన అని […]

వృద్ధనేతలపై కోమటిరెడ్డి ఫైర్
X

తనకు కాంగ్రెస్‌ పెద్దలు షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్‌ నేతలపై ఫైర్ అయ్యారు. తెలంగాణ మిగిలిన జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా నేతలు భయపడ్డారని…. ఆ సమయంలో నల్లగొండలో టీఆర్‌ఎస్‌ ను చాలెంజ్‌ చేసి తాను ఎమ్మెల్సీగా గెలిచానని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఎవరిని ధూషించాలన్నది తన ఉద్దేశం కాదన్నారు. సీనియర్లను పట్టించుకోకుండా కమిటీలు వేయడంపైనే తమ ఆవేదన అని చెప్పారు. తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. తాము సుధీర్ఘంగా కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న వ్యక్తులమని చెప్పారు.

షోకాజ్‌ నోటీసుకు రెండు రోజుల సమయం అవసరం లేదని.. తాను రెండు గంటల్లోనే సమాధానం చెబుతానని.. వెంటనే హైకమాండ్ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. సీఎం కావాలి.. మంత్రులు కావాలన్న తపనే గానీ పార్టీని గెలిపించాలన్న ఆలోచన నేతల్లో కనిపించడం లేదన్నారు. కమిటీల జాబితాలో పార్టీని వీడివెళ్లిపోయిన కేఆర్ సురేష్‌ రెడ్డి పేరు ఉండడం చూసి జనం నవ్వుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ వీడి టీఆర్‌ఎస్ లో చేరిన నేత పేరు కమిటీల్లో ఉందంటే దీన్ని బట్టే పార్టీ నాయకత్వం నిద్రపోతోంది అన్నది స్పష్టంగా అర్థమవుతోందన్నారు.

జాబితాను విడుదల చేసే ముందు కనీసం పేర్లను సరిచూసుకోవాల్సిన బాధ్యత పీసీసీ చీఫ్‌పై లేదా అని ప్రశ్నించారు. ఏనాడు తెలంగాణ గురించి పోరాటం చేయని వారికి, నిన్న మొన్న పార్టీలో చేరిన వారికి కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 20, 30 ఏళ్ల నుంచి కాంగ్రెస్‌ కోసం పనిచేస్తున్న తమలాంటి వారంతా పనికి రారా అని నిలదీశారు. కేసీఆర్‌ను బూతులు తిడితేనే పదవులు వస్తాయా అని ప్రశ్నించారు.

తెలంగాణ కాంగ్రెస్‌ కార్యకర్తలు తమలాంటి వారిని నాయకులుగా కోరుకుంటున్నారని చెప్పారు. 70 ఏళ్లకు పైబడిన వారు కూడా ఇంకా పోటీ పడడం ఎంతవరకు కరెక్ట్ అని వ్యాఖ్యానించారు. కొందరు స్వార్థపరులు గాంధీ భవన్‌లో కూర్చుని పదవులు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పార్టీ కోసం పనిచేసిన వారిని మాత్రం పక్కన పెట్టేశారని మండిపడ్డారు. ఒక్కో కమిటీలో 40మంది, 50 మందిని వేయడం ఏమిటని ప్రశ్నించారు.

పార్టీ ఆఫీస్‌లో కూర్చుని పార్టీ పోస్టులు, ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకునే వారా తనకు నోటీసులు ఇచ్చేది అని రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. కార్యకర్తల మీటింగ్‌లో ఆవేదనతో తాను చేసిన వ్యాఖ్యలు పట్టుకుని నోటీసులు ఇస్తారా అని నిలదీశారు. పార్టీ కోసం సైనికుడిగా పనిచేస్తున్న తమలాంటి వారిని పార్టీకి దూరం చేసుకోవాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. తమకు పదవులు అవసరం లేదని.. కానీ గెలిచే అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాల్సిందిగా మాత్రమే కోరుతున్నామన్నారు.

తనను పార్టీ నుంచి బయటకు పంపించాలన్న ఆలోచన హైకమాండ్‌కు ఉండదని.. కానీ ఇక్కడ ఉండే వారికే ఆ ఆలోచన ఉండవచ్చన్నారు. కేసీఆర్‌ను ఎదురించి ఎమ్మెల్సీగా గెలిచిన తానే.. నియోజకవర్గంలో తనకు నచ్చిన ఒక వ్యక్తిని కూడా మండల కాంగ్రెస్ కమిటీలో కూడా వేయించుకోలేకపోయానని ఆవేదన చెందారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తనకు వ్యతిరేకంగా గ్రూపులను తయారు చేశారన్నారు.

First Published:  21 Sep 2018 9:42 AM GMT
Next Story