నన్ను దోచుకుందువటే రివ్యూ

రివ్యూ: నన్ను దోచుకుందువటే
రేటింగ్‌: 2.5/5
తారాగణం: సుధీర్ బాబు, నభా నటేష్, నాజర్, చలపతి రావు, జీవా, రాజ్ ముదిరాజ్, సత్య తదితరులు
సంగీతం:  అజనీష్ లోకనాథ్
నిర్మాత: సుధీర్ బాబు
దర్శకత్వం: ఆరెస్ నాయుడు

హీరోగా ఋజువు చేసుకున్నప్పటికీ స్టార్ గా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న సుధీర్ బాబు సమ్మోహనం సక్సెస్ ఇచ్చిన కిక్ తో తనే స్వయంగా నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం నన్ను దోచుకుందువటే. యూత్ ని టార్గెట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ దశ నుంచే కొంత ఆసక్తిని రేపడంలో సక్సెస్ అయ్యింది. దానికి తోడు సుధీర్ నిర్మాతగా మారి ఇది తీయడంతో కంటెంట్ మీద ఎంతో నమ్మకం ఉండబట్టే అంత సాహసం చేసాడనే అభిప్రాయంతో అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూసారు. మరి ఇది ప్రేక్షకుల మదిని దోచుకుందా లేదా అని రివ్యూలో చూద్దాం.

కార్తీక్(సుధీర్ బాబు)ఓ కంపెనీకి మేనేజర్ గా ఉంటూ పని తప్ప ఇంకే ప్రపంచం తెలియకుండా మెకానికల్ గా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. చనిపోయిన అమ్మ వైపు నుంచి మేనరికం సంబంధం ఉండటంతో అది తప్పించడం కోసం నాన్న తో సిరి అనే అమ్మాయి ని ప్రేమించానని అబద్దం చెబుతాడు. సిరిని చూడడానికి హైదరాబాద్ వస్తున్నానని ఆయన చెప్పడంతో షార్ట్ ఫిలిమ్స్ లో నటించే మేఘన(నభా నటేష్)ను తీసుకొచ్చి లవర్ గా పరిచయం చేస్తాడు. ఒక్క రోజులోనే కార్తీక్ నాన్నకు నచ్చేస్తుంది సిరి. ఆ తర్వాత ఇద్దరూ విడిపోవడం, అనుకోని సంఘటనల వల్ల మళ్ళీ ఇద్దరూ కలుసుకునే అవకాశం రావడం ఇదే కథలో మిగిలిన భాగం

సుధీర్ బాబు నటనపరంగా పరిణితి చెందుతున్నాడు. అది ఇందులో గమనించవచ్చు. కాకపోతే సమ్మోహనంలో అదితి రావు హైదరి ఎలాగైతే ఓవర్ టేక్ చేసిందో ఇందులో నభా నటేష్ కూడా అదే పని చేసింది. దాంతో సుధీర్ చాలా నార్మల్ గా కనిపిస్తాడు. ఎక్స్ ప్రెషన్స్ పరంగా ఇంకా హోమ్ వర్క్ చేసుకోవాల్సి ఉంది. బరువైనఎమోషన్స్ ని తక్కువ టైంలో ఎక్కువ వేరియేషన్స్ ని చూపడంలో సుధీర్ కు కొన్ని బలహీనతలు ఉన్నాయి. అవి దాటేసుకుంటే ఇంకా బాగా ముద్ర వేయొచ్చు. ఇంకా దూకుడుగా ఉండే మేఘన కం సిరి పాత్రలో నభా నటేష్ చెలరేగిపోయింది. అచ్చం బొమ్మరిల్లులో హాసిని తరహాలో అనిపించే సిరిగా చక్కగా ఒదిగిపోయింది. గ్లామర్ పరంగా కొన్ని మైనస్ లు ఉన్నాయి కాబట్టి ఇలాంటి పెరఫార్మన్స్ బేస్డ్ పాత్రలు అయితేనే తనకు బాగా సూట్ అవుతాయి. ఈ ఇద్దరి తర్వాత ఎక్కువ స్కోప్ దక్కింది నాజర్ కే. రొటీన్ పాత్రే అయినప్పటికీ కొడుకు కోసం తపించే పాత్రలో జీవించేసారు. చలపతి రావు, జీవా, రాజ్ ముదిరాజ్, సత్య ఇలా క్యారెక్టర్ ఆర్టిసులు ఉన్నారు కానీ అందరికి ఎక్కువ స్కోప్ దొరకలేదు

దర్శకుడు ఆరెస్ నాయుడు కథలో క్లిష్టత లేకుండా సింపుల్ గా రాసుకున్నాడు. కథలో కొత్తదనం లేదు. గతంలో చాలా సార్లు చూసిందే. హీరో హీరోయిన్ భిన్న ధ్రువాలు, ప్రేమికుల్లా నటించడం, హీరో నాన్నకు తెలియకపోవడం, తర్వాత నడిచే డ్రామా ఇవన్నీ వెరైటీ ఏమి కాదు. కానీ నాయుడు ప్రేక్షకులను ఎంగేజ్ చేయటం టార్గెట్ గా పెట్టుకుని సాధ్యమైనంత కూల్ ఎంటర్ టైన్మెంట్ తో నడిపించిన తీరు ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న కామెడీ సెకండ్ హాఫ్ లో సగానికి పైగా తగ్గిపోతుంది. కథ పెద్దగా లేకపోవడంతో చాలా సన్నివేశాలు మొక్కుబడిగా సాగిపోతాయి. అయినా ఎమోషనల్ గా రాసుకున్న కొన్ని సన్నివేశాలతో ఆ లోపాలన్నీ కవర్ చేసే ప్రయత్నం చేసాడు నాయుడు. ఇది ఇంకాస్త బిగిగా రాసుకుని ఉంటే సినిమా ఇంకో లెవెల్ లో ఉండేది. అజనీష్ లోకనాథ్ సంగీతం బ్యాక్ గ్రౌండ్ పరంగా చాలా బాగుంది కానీ పాటల విషయంలో మాత్రం మెప్పించలేకపోయాడు. సురేష్ కెమరా పనితనం చాలా ప్లెజెంట్ గా ఉంది. సెకండ్ హాఫ్ లో సన్నివేశాలకు కొంత కోత పడితే బాగుండేది. నిర్మాణ పరంగా బడ్జెట్ తక్కువ డిమాండ్ చేసిన సబ్జెక్టు కావడంతో సుధీర్ బాబుకు మరీ ఎక్కువ రిస్క్ లేకుండా పోయింది. ఒక్క రెండు మూడు సీన్లు తప్ప మొత్తం హైదరాబాద్ లోనే చుట్టేశారు

చివరిగా చెప్పాలంటే నన్ను దోచుకుందువటే పూర్తిగా కాదు కానీ ఎంతో కొంత దోచుకుంది నిజం. సింపుల్ లవ్ స్టోరీని ఎంగేజ్ చేసేలా చూపడంలో దర్శకుడు ఆరెస్ నాయుడు చూపిన పనితనం ఓసారి చూసే క్యాటగిరీలో దీన్ని వేసేలా చేసింది. కమర్షియల్ అంశాలు లేకపోయినా యూత్ కి ఫామిలీస్ కి కావాల్సిన ఎమోషన్స్ ని సరైన రీతిలో మిక్స్ చేసిన నాయుడు సెకండ్ హాఫ్ ని ఇంకాస్త బెటర్ గా ట్రై చేసుంటే సుధీర్ కి సమ్మోహనంని మించిన మూవీ అయ్యుండేది. అయినా కూడా నన్ను దోచుకుందువటే నిరాశ పరచదు. సాఫీగా సాగిపోయే ఎంటర్ టైనర్ ఒక్కసారి ప్రయత్నించవచ్చు

నన్ను దోచుకుందువటే – పాత సీసాలో కొత్త ప్రేమ