Telugu Global
Family

శర్మిష్ఠ

రాక్షసరాజు వృషపర్వుడు. వృషపర్వుని కూతురు శర్మిష్ఠ. వారి రాజగురువు శుక్రుని కూతురు దేవయాని. శర్మిష్ఠ ఒకరోజు వన విహారానికి చెలికత్తెలతో వెళ్తూ వెళ్తూ గురుపుత్రిక అని, తన ఈడుదేనని దేవయానిని కూడా రమ్మని పిలిచింది. అంతా అడవిలో ఆడిపాడారు. ఊయలలూగారు. పూలూ పళ్ళూ కోసుకున్నారు. ఆడి ఆడి అలసిపోయి సేదదీరాలని నదిలో స్నానానికి దిగారు. ఈదారు. జలక్రీడలాడారు. ఇంతలో గాలి చెలరేగింది. ఒడ్డున ఉన్న బట్టలు గాలికి దొర్లుతూ ఉండడంతో అంతా ఒడ్డెక్కారు. కాని అప్పటికీ బట్టలన్నీ […]

రాక్షసరాజు వృషపర్వుడు. వృషపర్వుని కూతురు శర్మిష్ఠ. వారి రాజగురువు శుక్రుని కూతురు దేవయాని. శర్మిష్ఠ ఒకరోజు వన విహారానికి చెలికత్తెలతో వెళ్తూ వెళ్తూ గురుపుత్రిక అని, తన ఈడుదేనని దేవయానిని కూడా రమ్మని పిలిచింది. అంతా అడవిలో ఆడిపాడారు. ఊయలలూగారు. పూలూ పళ్ళూ కోసుకున్నారు. ఆడి ఆడి అలసిపోయి సేదదీరాలని నదిలో స్నానానికి దిగారు. ఈదారు. జలక్రీడలాడారు.

ఇంతలో గాలి చెలరేగింది. ఒడ్డున ఉన్న బట్టలు గాలికి దొర్లుతూ ఉండడంతో అంతా ఒడ్డెక్కారు. కాని అప్పటికీ బట్టలన్నీ కలిసిపోయాయి. తొందరలో చేతికి దొరికిన బట్టలు కట్టుకుంది శర్మిష్ఠ. ఆ బట్టలు నావి అంది దేవయాని. సరే నావి కట్టుకో అంది. శర్మిష్ఠ. దేవయాని అందుకు ఇష్టపడలేదు. విప్పి తన బట్టలు తనకిమ్మంది. ఇపుడేమయింది ఏబట్టలయితే ఏముంది? అంది శర్మిష్ఠ. కాదంటే ఇంటికి వెళ్ళిపంపుతానంది. వినలేదు. పైగా నేను బ్రాహ్మణ కన్యనంది. మీ తండ్రి మా తండ్రి దగ్గర సేవకుడు, నీకు ఇంత కావరం పనికిరాదంది. ఆ కోపంలో దేవయానిని నూతిలోకి తోసి చెలికత్తెలతో వెళ్ళిపోయింది. పర్యవసానం శర్మిష్ఠ ఊహించలేదు.

దేవయానికి దాసిగా శర్మిష్ఠను తండ్రి వెళ్ళమన్నాడు. లేదంటే దేవయాని రాజ్యంలో అడుగుపెట్టదని, ఆమె అడుగు పెట్టకపోతే తండ్రి శుక్రుడు అడుగు పెట్టనన్నాడనీ చెప్పాడు. దేవ దానవుల యుద్ధంలో శుక్రుడు లేకుంటే మన జాతి అంతమయిపోతుందని ఆవేదన చెందాడు. శర్మిష్ఠ తండ్రి బాధని అర్థం చేసుకుంది. త్యాగానికి సిద్ధమయింది. దేవయానికి దాసిగా వెళ్ళింది. దేవయానికి ఎన్నో సేవలు చేసింది. రాచకన్యనని మరిచింది.

యయాతితో దేవయాని పెళ్ళి జరిగి కాపురానికి వెళ్తుంటే ఆజ్ఞమేరకు తనూ వెళ్ళింది. తనను విడిగా భవంతిలో పెడితే ఉన్నది. సేవలెన్నో చేస్తూనే ఉన్నది. సంతానం మీద ఆశ కలిగి కోరిక తీర్చమని యయాతిని ప్రార్థించింది. శుక్రుని హెచ్చరిక వల్ల శర్మిష్ఠ కోరికను నెరవేర్చడానికి సందేహించాడు. ఇష్ట సంగమంలో అసత్యదోషముండదని పాపమంటదని శర్మిష్ఠ చెప్పి తన కార్యం నెరవేర్చుకుంది. ద్రుహ్వి, అనువు, వూరుడు అని ముగ్గురు కొడుకుల్ని కన్నది. అయితే మొదటి బిడ్డ పుట్టినప్పుడే దేవయాని అడిగింది. నీకు పెళ్ళి జరగలేదు కదా… అని. దేవ పురుషుని దయవల్ల సంతానం కలిగినట్లుగా శర్మిష్ఠ చెప్పుకుంది. అయితే పుట్టిన పిల్లలు పెరుగుతూ వచ్చారు. వారిలో యయాతి పోలికలు కొట్టొచ్చినట్టు కనబడ్డాయి. నిజం తెలిసి నిలదీసినప్పుడు, నిందించినప్పుడు నిరత్తరురాలయింది.

దేవయాని ఆగ్రహం… ఆమె తండ్రి శాపం వల్ల యయాతి ముసలివాడవగా – తన చిన్నకొడుకు వూరుడు తన యవ్వనాన్ని యిచ్చినందుకు అటువంటి బిడ్డను కన్నందుకు ఒక కంట కన్నీరు, యవ్వనంలోనే కన్నకొడుకు ముసలివాడయినందుకు మరోకంట కన్నీరు కార్చింది. దీనంతటికీ తనే కారణంగా భావించింది శర్మిష్ఠ. అన్యులను పల్లెత్తి మాట అనలేదు. ముసలి తనం మోస్తున్న కొడుకు పూరుని పోషణ, బాగోగులూ చూసింది. తన బిడ్డకు తాను బిడ్డయి సేవలెన్నో చేసింది.

రాజ కన్య అయి కూడా దాసిగా మసలింది. దాస్యం చేసింది. కొడుకు త్యాగం వల్ల కలిగిన దుఃఖానికి తనే మూలమనుకుంది. కష్టాల కోర్చింది. కనుకనే పూరుడు యయాతి తర్వాత ఆ రాజ్యానికి రాజయ్యేలా చేసింది!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  21 Sep 2018 1:02 PM GMT
Next Story