Telugu Global
Cinema & Entertainment

ఆస్కార్‌ బరిలో అస్సామీ చిత్రం ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’

అస్సామీ చిత్రం ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’ 2019 ఆస్కార్‌ అవార్డులకు భారతదేశం తరఫున అధికారికంగా పోటీకి ఎంపికైంది. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఈ చిత్రం అవార్డుల బరిలో నిలిచింది. ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎఫ్‌ఐ) ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ చిత్రం 65వ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డులలో ఉత్తమ చిత్రంగా కూడా ఎంపికైన విషయం తెలిసిందే. రాజి, పద్మావత్, హిచ్కి, అక్టోబర్, లవ్‌ సోనియా, గులాబ్‌జామ్, మహానటి, పిహు, కద్వి హవా, భోగ్డా, రేవా, బిస్కోప్‌ […]

ఆస్కార్‌ బరిలో అస్సామీ చిత్రం ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’
X

అస్సామీ చిత్రం ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’ 2019 ఆస్కార్‌ అవార్డులకు భారతదేశం తరఫున అధికారికంగా పోటీకి ఎంపికైంది. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఈ చిత్రం అవార్డుల బరిలో నిలిచింది. ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎఫ్‌ఐ) ఈ విషయాన్ని ధృవీకరించింది.

ఈ చిత్రం 65వ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డులలో ఉత్తమ చిత్రంగా కూడా ఎంపికైన విషయం తెలిసిందే. రాజి, పద్మావత్, హిచ్కి, అక్టోబర్, లవ్‌ సోనియా, గులాబ్‌జామ్, మహానటి, పిహు, కద్వి హవా, భోగ్డా, రేవా, బిస్కోప్‌ వాలా, మంటో, 102 నాటౌట్, పద్మన్, భయానకం, న్యూడ్‌ అండ్‌ గలి గులియాన్‌ వంటి చిత్రాలు ఆస్కార్‌ ఎంట్రీకి పోటీ పడ్డాయి. అయితే వాటన్నిటినీ దాటుకుని విలేజ్‌ రాక్‌స్టార్‌ ఎంపికయ్యింది.

ప్రముఖ నిర్మాత రాజేంద్ర సింగ్‌ బాబు అధ్యక్షతన ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పాటు చేసిన జ్యూరీ ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌ సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. ఈ చిత్రాన్ని ఆస్కార్‌ పోటీలకు పంపించడం మనందరికీ గర్వకారణం’ అని జ్యూరీ సభ్యుడు అనంత మహదేవన్‌ వ్యాఖ్యానించారు.

గిటారిస్ట్‌ కావాలనుకున్న ఓ బాలిక కధే విలేజ్‌ రాక్‌స్టార్స్‌ సినిమా. ఆడపిల్ల అడుగు కదిపితే చాలు అనేక ప్రశ్నలు వేసే సమాజంలో అన్ని కట్టుబాట్లనూ దాటుకుని 10 ఏళ్ల ధును (భంతియా దాస్‌) సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలని కలలు కంటుంది. అస్సాంలోని ఓ మారుమూల కుగ్రామంలో ఈ కథ ప్రారంభమౌతుంది.

ఈ ఏడాది ఆస్కార్‌ అవార్డులకు భారత్‌ తరఫున అధికారిక ఎంట్రీగా దర్శకుడు అమిత్‌ వి మాసూర్కర్‌ తీసిన న్యూటన్‌ సినిమా పోటీ పడిన సంగతి తెల్సిందే. అయితే ఫైనల్‌ నామినేషన్స్‌కు అది ఎంపిక కాలేకపోయింది. ఈ విభాగంలో మొత్తం 92 సినిమాలు పోటీ పడ్డాయి. తుది పోరుకు 9 సినిమాలు మాత్రమే ఎంపికయ్యాయి. మరి వచ్చే ఏడాది పోటీలలో విలేజ్‌ రాక్‌స్టార్స్‌ ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే. 2019 ఆస్కార్‌ అవార్డుల వేడుక ఫిబ్రవరి 24 న జరగనుంది.

First Published:  22 Sep 2018 10:08 PM GMT
Next Story