విరాట్ కొహ్లీ, చాను ఇద్దరూ ఇద్దరే…!

  • 2018 క్రీడారత్నాలు విరాట్ కొహ్లీ, మీరాబాయి చాను
  • మహిళా వెయిట్ లిఫ్టింగ్ సంచలనం చాను
  • ప్రపంచ జూనియర్ విజేత మీరాబాయి

భారత అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్నను… టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, మహిళా వెయిట్ లిఫ్టింగ్ విశ్వవిజేత మీరాబాయి చాను… సంయుక్తంగా గెలుచుకొన్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు అందుకొన్నారు.

కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ కొద్దిరోజుల క్రితమే ఖరారు చేసిన జాతీయ క్రీడా అవార్డుల ప్రధాన కార్యక్రమాన్ని… ఢిల్లీలో అట్టహాసంగా నిర్వహించారు.

దేశ అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ ఖేల్ రత్నను టీమిండియా కెప్టెన్, ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు విరాట్ కొహ్లీ, మహిళల వెయిట్ లిఫ్టింగ్ లో భారత మణిపూస మీరాబాయి చాను …. స్వీకరించారు.

7లక్షల 50 వేల నగదు పురస్కారం….

అంతర్జాతీయస్థాయిలో గత మూడేళ్లుగా నిలకడగా రాణించిన క్రీడాకారులకు మాత్రమే రాజీవ్ ఖేల్ రత్న ప్రదానం చేస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే భారత అత్యున్నత క్రీడాపురస్కారమే రాజీవ్ ఖేల్ రత్న అవార్డు. ఈ అవార్డుకు ఎంపికైన క్రీడాకారులకు  ఓ పతకం, ప్రశంసా పత్రంతో పాటు 7 లక్షల 50 వేల రూపాయల చెక్ ను బహుకరిస్తారు.

మూడో క్రికెటర్ విరాట్ కొహ్లీ….

అంతర్జాతీయ క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ…గత రెండేళ్లుగా…అసాధారణంగా రాణిస్తున్న విరాట్ కొహ్లీ…మూడో ప్రయత్నంలో సఫలమయ్యాడు. 29 ఏళ్ల విరాట్ కొహ్లీ… ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ బ్యాట్స్ మన్ గా ఉన్నాడు.

ఇటీవలి ఇంగ్లండ్ సిరీస్ వరకూ ఆడిన 71 టెస్టుల్లో కొహ్లీ 23 శతకాలతో 6వేల 147 పరుగులు, 211 వన్డేల్లో 35 సెంచరీలతో సహా 9వేల779 పరుగులు సాధించి… మాస్టర్ సచిన్ టెండుల్కర్ కు తానే అసలు సిసలు వారసుడనని నిరూపించుకొన్నాడు.

మాస్టర్ సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోనీల తర్వాత…రాజీవ్ ఖేల్ రత్న పురస్కారానికి ఎంపికైన మూడో క్రికెటర్ గా కొహ్లీ… రికార్డుల్లో చేరాడు.

కొహ్లీతో పాటు…ఖేల్ రత్న పురస్కారానికి ఎంపికైన…మణిపూర్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను గురించి ఎంత చెప్పుకొన్నా అది తక్కువే అవుతుంది.

ఐరన్ లేడీ చాను…

ప్రపంచ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ 48 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించిన భారత తొలి మహిళగా మీరాబాయి చాను చరిత్ర సృష్టించింది.

అంతేకాదు…ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా ముగిసిన 2018 కామెన్వెల్త్ గేమ్స్  విభాగంలో సైతం చాను బంగారు కొండగా నిలిచింది.

ప్రపంచ, కామన్వెల్త్ గేమ్స్ స్థాయిలో రాణించడం ద్వారా దేశానికే గర్వకారణంగా నిలిచిన మీరాబాయి చానును.. రాజీవ్ ఖేల్ రత్న అతిచిన్న వయసులోనే వరించడం విశేషం.

నీరజ్, సిక్కీలకు అర్జున అవార్డులు…

అంతేకాదు…వివిధ క్రీడల్లో అత్యుత్తమంగా రాణించిన క్రీడాకారులకు ఇచ్చే అర్జున అవార్డుల కోసం 20మందిని ఎంపిక చేశారు.

పురుషుల జావలిన్ త్రోలో ప్రపంచ జూనియర్ చాంపియన్, ఆసియాక్రీడల స్వర్ణవిజేత నీరజ్ చోప్రాకు అర్జున అవార్డు దక్కింది.

జకార్తా స్వర్ణ విజేతలు హిమ దాస్, జిన్సన్ జాన్సన్ లకు సైతం అర్జున పురస్కారాలు దక్కాయి.

టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ లో భారత సంచలనం మనీకా బాత్రా, భారత మహిళా క్రికెట్ ఓపెనర్ స్మృతి మంథానా, బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ సిక్కీ రెడ్డి సైతం అర్జున విజేతలుగా నిలిచారు.

అర్జున అవార్డు విజేతలకు అర్జున శిలాప్రతిమతో పాటు 5 లక్షల రూపాయల నగదు బహుమతిని ఇస్తారు. మొత్తం మీద… రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాల జాబితాలో విరాట్ కొహ్లీ, మీరాబాయి చాను చేరిపోయారు.