Telugu Global
Family

అసమానత

Inequality: మహా పురుషులెవరయినా ఏవో కథలు చెబుతారు. కథల ద్వారా చెబితే పిల్లలకయినా పెద్దలకైనా మనసుని హత్తుకుంటుంది. జీసెస్‌ ఈ పిట్టకథని పదే పదే చెప్పేవాడు.

అసమానత (Inequality)
X

అసమానత (Inequality)

మహా పురుషులెవరయినా ఏవో కథలు చెబుతారు. కథల ద్వారా చెబితే పిల్లలకయినా పెద్దలకైనా మనసుని హత్తుకుంటుంది.

జీసెస్‌ ఈ పిట్టకథని పదే పదే చెప్పేవాడు.

ఒక సంపన్నుడికి ఒక పండ్లతోట వుంది. చాలా పెద్దది. విరగ బండింది. ఎన్నో రకాలైన పళ్ళతో తోట కళకళలాడుతోంది. పళ్ళు కోయడానికి పదిమంది మనుషుల్ని మాట్లాడాడు. కూలి ఎంతో ముందుగానే మాట్లాడాడు. వాళ్ళు అడిగిన దానికన్నాఉదారంగా రెండింతలు ఇస్తానన్నాడు. వాళ్ళు ఎంతో సంతోషించారు. ఉత్సాహంగా వచ్చారు. ఉత్సాహంగా పని మొదలు పెట్టారు. ఆ పళ్ళతోట దాదాపు రెండు ఎకరాలు విస్తరించి ఉంది. కూలీలు పళ్ళు కోస్తున్నారు. సూర్యుడు నడి నెత్తికి వచ్చాడు. ఎండమండిపోతోంది. పనివాళ్ళు పని ఆపి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు.

యజమాని వాళ్ళకు చల్లటి నీళ్ళు, చక్కటి భోజన వసతులు కల్పించాడు. వాళ్ళు భోజనం చేస్తూవుండగానే ఇంకో పదిమంది కూలీలు తోటలోకి వచ్చారు. వాళ్ళు కూడా పని ప్రారంభించారు. ఇంకో వేపుకు వెళ్ళి చెట్లనుండీ పళ్ళుకోసి కుప్పలు వేయడం మొదలు పెట్టారు.

మొదట వచ్చిన పదిమంది భోజనం ముగించి మళ్ళీ పళ్ళుకోసే పనిలో పడ్డారు. మధ్యాహ్నం మూడు గంటలయింది. ఇంతమంది చేసినా చీకటి పడేలోగా తోటలోని చెట్లలో పళ్ళన్నీ కొయ్యడం వీలు కాని పని అని యజమాని గ్రహించాడు. వెంటనే ఊళ్ళోకి వెళ్ళి అరగంటలో ఇంకో పదిమందిని తీసుకొచ్చాడు.

మొత్తానికి ముప్పయి మంది కలిసి చీకటి పడేలోగా తోటలో పళ్ళన్నీ తెంపి కుప్పవేశారు. వాటిని సంచుల్లో నింపి బళ్ళకెత్తారు. బళ్ళు వెళ్ళిపోయాయి.

యజమాని ముప్పయి మందిని సమావేశపరిచి అందరికీ సమంగా కూలీయిచ్చాడు. మొదటి పదిమంది "ఇది అన్యాయం. మాకు ఎంత కూలీ ఇచ్చారో మా తరువాత వచ్చిన వాళ్ళకు, ఆ తరువాత వచ్చినవాళ్ళకూ కూడా అంతే కూలీ ఇవ్వడం అన్యాయం" అన్నారు.

యజమాని నవ్వి "మొదట మీరు ఎంత కూలీ అడిగారు? మీరు ఎంత అడిగితే దానికి రెట్టింపు నేను ఇస్తానని మీతో అన్నాను కదా! మీరు తీసుకున్న కూలీతో మీరు సంతృప్తి పడ్డారా? లేదా?" అని అడిగాడు. వాళ్ళు "మీరు మాకు ఎక్కువ ఇచ్చారు. కానీ" అన్నారు. యజమాని "కానీ" అన్నది మీకు సంబంధించింది కాదు, అది నాకు సంబంధించిన విషయం. నేను వాళ్ళకు ఇవ్వదలుచుకున్నంత ఇస్తాను. దానికి మీరు ఈర్ష్యపడడం దేనికి? అన్నాడు.

సంస్కారమున్న వాళ్ళు, శీలవంతులు, ధర్మబద్ధులు వాళ్ళ శ్రమకు ఫలితం పొందుతారు. కానీ ఆనందంగా వున్న వాళ్ళు, ప్రేమించే వాళ్ళు అవసరానికి సాయ పడ్డవాళ్ళు, కావాల్సినప్పుడు సాయపడ్డవాళ్ళు ఎక్కువ ఫలితాన్ని పొందుతారు అని జీసెస్‌ భావన.

– సౌభాగ్య

First Published:  26 Sep 2018 8:01 PM GMT
Next Story