మురికి కూపాల్లో మరణాలు మామూలేనా?

దిల్లీలో రెండు వేర్వేరు చోట్ల మురికి కాలువలు శుభ్రం చేసే క్రమంలో ఆరుగురు మరణించారు. ఇలాంటి మరణాలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. స్వచ్ఛ భారత్ సాధించడానికి జనం ప్రాణాలు అర్పించవలసి వస్తున్నా ఏలినవారికి చీమ కుట్టినట్టయినా లేదు. ఇది మామూలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

కుళ్లు, మానవ విసర్జిత పదార్థాలు ఉన్న కాలవలను శుభ్రం చేయడానికి సాధారణంగా నిరుపేదలు సిద్ధపడక తప్పని పరిస్థితి ఉంది. ఈ గోతుల్లోని విష వాయువులు ప్రాణాంతకమైనవి. ఈ మరణాలు కిరాతకమైనవి. అయితే యంత్రాలతో మురికి కాలవలను శుభ్రం చేసే సదుపాయం ఉన్నప్పుడు మనుషులు ఆ పని చేయవలసిన అవసరం ఏమిటి? యంత్రాలనే ఈ పనికి వినియోగించాలని చట్టం కూడా ఉంది.

ఈ పని చేసే వారి ప్రాణాలకు భద్రత ఉండాలని, వారి జీవన పరిస్థితి మెరుగుపడాలని ఉద్యమిస్తున్నవారు వీరి గురించి సమగ్ర సమాచారం లేకపోవడంపట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఇలాంటి పని చేసే వారు ఎంతమంది ఉన్నారన్న సమాచారం ఎక్కడా లేదు. వీరి సంఖ్య గురించి మీడియాలో వచ్చే సమాచారం, శాసనసభల్లో, పార్లమెంటులో ప్రభుత్వాలు ఇచ్చే సమాధానాలు పరిశీలిస్తే అసలు ఇలాంటి పని చేసే వారు ఎందరు అన్న విషయంలో మరింత గందరగోళమే కనిపిస్తోంది. 1993నాటి మనుషులు మురికి కాలవలను, పాకీ దొడ్లను శుభ్రం చేయడానికి (నిరోధక) చట్టం ప్రకారం మనుషుల చేత స్థానిక సంస్థలు ఎవరినీ నియమించకూడదు.

ఈ పని చేసేది కచ్చితంగా సమాజంలో నిమ్న జాతి వారే. వీధులు ఊడ్చేవారు, ఇళ్ల మధ్య మురికి ప్రవహించే కాలవలు శుభ్రం చేసేవారు నామమాత్రమైన వేతనానికి పని చేస్తుంటారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత వీరి గురించి పట్టించుకోవడమే లేదు. వారికి అందే మొత్తం కూడా నామమాత్రమైంది. ముంబై లోని పారిశుధ్య కార్మిక సంఘం చీపుర్లు పట్టుకుని శుభ్రం చేసే వారు శుభ్రత కోసం నానా యాతన పడవలసి వస్తోంది అంటోంది.

ఈ పని చేసే వారు నిమ్న జాతులకు చెందిన వారైనందువల్ల ఈ పని చేయడానికి వినూత్నమైన యంత్ర పరికరాలను రూపొందించడంపై శ్రద్ధ కొరవడుతోంది. నగరాలు త్వరితగతిన విస్తరిస్తున్నందువల్ల వాటిని పరిశుభ్రంగా ఉంచడానికి నిమ్న జాతులవారు తమ ప్రాణాలే అర్పించవలసి వస్తోంది.

బెంగళూరులో బహుళ అంతస్తుల భవనాలున్న చోట మురికి కాలవలు శుభ్రం చేయించడం, నిర్వహించడానికి పురపాలక సంస్థలతో సంబంధం లేకుండానే ఈ పనులన్నీ చేయించవచ్చు. అంటే ఈ పని చేయించడానికి ప్రైవేటు సంస్థలు, కాంట్రాక్టర్లు వెలవడానికి అవకాశం ఉందన్న మాట. రోజు కూలీలను నియమించి ఈ పనులు చేయిస్తూ ఉంటారు. భద్రత గురించి పట్టించుకునే వారు మాత్రం ఉండరు. ఈ కారణంగానే ఇటీవల దిల్లీలో ఆరుగురు మృతి చెందారు.

మన దేశంలో ఉపగ్రహాలు ప్రయోగించడానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానం ఉంది కాని మురికి కాలవలు శుభ్రం చేయడానికి ఆధునిక పరిజ్ఞానం మాత్రం లేదు అని పారిశుధ్య కార్మికుల నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. భూమి అడుగున పదిహేను ఇరవై అడుగుల లోతున మురికి కూపాల్లోకి దిగి మనుషులే శుభ్రం చేయాల్సిన దుస్థితి. కొన్ని నగరాల్లో ఈ పనికి యంత్రాలను వినియోగిస్తున్న సందర్భం ఉంది.

హైదరాబాద్ మెట్రోపాలిటన్ నగర సంస్థ ఈ పరికరాలను వినియోగిస్తోంది. ఈ యంత్రాలను “బాండీకూట్” యంత్రాలు అంటున్నారు. కేరళలోని తిరువనంతపురంలో కూడా శాస్త్రవేత్తలు ఈ యంత్ర పరికరాలు ఉపయోగిస్తున్నారు. మిగతా కొన్ని నగరాలలోనూ ఇలాంటి ఏర్పాట్లు ఉండి ఉండవచ్చు. బహుశా మీడియాలో వీటికి సంబంధించిన వార్తలు రావడం లేదేమో. ఇలాంటి యంత్ర పరికరాలను వినియోగించడాన్ని పురపాలక వ్యవస్థలు ప్రోత్సహించాలి.

దిల్లీ ప్రభుత్వానికి కూడా ఈ పరికరాలు వినియోగించాలన్న ప్రతిపాదనలు అందాయి. పారిశుధ్య కార్మికులు ఈ యంత్ర పరికరాలు కొనడానికి రుణాలు మంజూరు చేయాలన్న ప్రతిపాదనలూ వచ్చాయి. కానీ ఈ పని చేసే వారికి అది ఆర్థికంగా భారం కనక ప్రభుత్వమే ఈ యంత్ర పరికరాలు కొనాలి. వాటిని నడపడానికి సిబ్బందిని నియమించుకోవాలి.

మురికి కూపాల్లో దిగే వారికి భద్రత కోసం కొన్ని తొడుగులు సరఫరా చేసిన సందర్భాలూ ఉన్నప్పటికీ అవి మోయలేనంత భారంగా ఉన్నందున కార్మికులు వాటిని వాడకుండానే శుభ్రం చేస్తున్నారు. మరిన్ని ప్రయోగాలు చేసి తేలికైన తొడుగులు అందించే ఏర్పాటు చేయాల్సింది ప్రభుత్వమే. మనుషుల ప్రాణాల కన్నా నిధులు విలువైనవి కావు గదా! పురపాలక సంస్థలు, రైల్వేలు మురికి కాలవలు శుభ్రం చేయించడానికి ప్రైవేటు కాంట్రాక్టర్లను భారీగా ఉపయోగిస్తున్నాయి.

వినూత్నత, సాంకేతిక పరిజ్ఞానం అని నిరంతరం ప్రచారం చేసుకునే ఈ ప్రభుత్వం అనవసరంగా బలవుతున్న వారి ప్రాణాలు కాపాడే ఆలోచన చేయాల్సిందే.

(ఎకనామిక అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)