Telugu Global
Others

పెట్రోల్ ధరల విషవలయంలో బీజేపీ ప్రభుత్వం 

దేశవ్యాప్తంగా పెట్రోల్ డీసెల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ ధరలు మండిపోతున్నందువల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఉదాసీన వైఖరితో మాత్రమే చూస్తోంది. చమురు ధరలు నిరంతరం పెరుగుతున్నందువల్ల ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీసెల్ ధరలను ఎప్పటికప్పుడు సవరించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు బదలాయించింది. రాజస్థాన్ లో రెండున్నర రూపాయలు తగ్గించారు. కానీ మిగతా రాష్ట్రాలలో ఇలాంటి ప్రయత్నమేదీ లేదు. వివిధ రాష్ట్రాల రాజధాని నగరాల్లో లీటర్ […]

పెట్రోల్ ధరల విషవలయంలో బీజేపీ ప్రభుత్వం 
X

దేశవ్యాప్తంగా పెట్రోల్ డీసెల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ ధరలు మండిపోతున్నందువల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఉదాసీన వైఖరితో మాత్రమే చూస్తోంది. చమురు ధరలు నిరంతరం పెరుగుతున్నందువల్ల ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీసెల్ ధరలను ఎప్పటికప్పుడు సవరించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు బదలాయించింది.

రాజస్థాన్ లో రెండున్నర రూపాయలు తగ్గించారు. కానీ మిగతా రాష్ట్రాలలో ఇలాంటి ప్రయత్నమేదీ లేదు. వివిధ రాష్ట్రాల రాజధాని నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 81 నుంచి రూ. 83 వరకు, కొన్ని చోట్ల రూ. 85 నుంచి రూ. 87 మధ్య ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90 కి చేరింది. అక్కడ విలువ ఆధారిత పన్ను (వాట్) అత్యధికంగా ఉంది.

2010, 2014లో పెట్రోల్, డీసెల్ ధరలను ప్రభుత్వం నిర్ధారించే విధానానికి స్వస్తి చెప్పారు. అంతర్జాతీయంగా చమురు ధర తగ్గితే ఆ ఫలితం వినియోగదారులకు అందితే ఈ విధానంవల్ల ప్రయోజనం ఉండేది. కానీ అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పుడు మన దేశంలో పెంచుతున్నారు కానీ తగ్గినప్పుడు తగ్గించడం లేదు. ఇది వాస్తవ విరుద్ధమైన విధానం.

ఎక్సైజ్, వాట్ సుంకాలు చమురు అమ్మకం ధరలో 50 శాతం దాకా ఉంటున్నాయి. వ్యాపారుల కమిషన్ 9 శాతం అదనం. ప్రభుత్వం పన్నులు, సుంకాలు భారీగా వడ్డించడంవల్ల అంతర్జాతీయంగా ధర పెరిగినప్పుడల్లా వినియోగదారుల దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. 2014 నుంచి చూస్తే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర పీపాకు 80 డాలర్లు ఉంది. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంవల్ల అంతర్జాతీయంగా ధర తగ్గినప్పుడూ వినియోగదారుల దగ్గరకు వచ్చేటప్పటికి ధర తగ్గడం లేదు.

2014 నవంబర్ నుంచి 2016 జనవరి వరకు అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర పీపాకు 60 డాలర్లకన్నా మించలేదు. ఈ కాలంలో ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తొమ్మిది సార్లు పెంచింది. దీనివల్ల పెట్రోల్ పై సుంకం 150 శాతం పెరిగింది. అంటే లీటర్ పెట్రోల్ పై రూ. 19.48 ఎక్సైజ్ సుంకం పెరిగింది. డీసెల్ పై ఈ సుంకం 330 శాతం పెరిగి రూ. 15.33 కి చేరింది.

ఈ సుంకం పెరగడంవల్ల 2016-17లో ప్రభుత్వ ఖజానాకు అదనంగా రూ. 2, 42, 000 కొట్ల రాబడి సమకూరింది. 2014-15లో ఈ రాబడి కేవలం రూ. 99,000 కోట్లు మాత్రమే ఉండేది. ప్రభుత్వమే చమురు ధరలను నియంత్రించే విధానానికి స్వస్తి చెప్పడంతో ప్రయోజనం కలిగిందల్లా ప్రభుత్వ ఖజానాకే.

ప్రభుత్వానికి సులభ మార్గంలో రాబడి పెరుగుతోంది కనక ఈ విధానాన్ని మార్చే అవకాశం కనిపించడం లేదు. 2019లో ఎన్నికలు జరగనున్నాయి కనక ఆ ఆశ అసలే ఉండదు. రూపాయి విలువ అదే పనిగా పతనం అవుతున్నందున చమురు దిగుమతుల భారం పెరుగుతూ పోతోంది. వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి.) అమలులో ఇంకా బాలారిష్టాల దశ దాటనందువల్ల పన్నుల ద్వారా రాబడి స్థిమితపడలేదు.

ఈ దశలో సుంకాలు తగ్గిస్తే ప్రభుత్వ రాబడిలో కొంత వదులుకుని ద్రవ్యపరమైన సర్దుబాట్లు అవసరమవుతాయి. బీజేపీ అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాలలో రైతుల రుణాలు రద్దు చేసి జనాకర్షక విధానాలు అనుసరించారు. ప్రభుత్వాలకు ప్రీతి పాత్రమైన జనాకర్షక సంక్షేమ కార్యక్రమాలను కొన సాగించాలంటే మరో మార్గం ద్వారా రాబడి సమకూరాలి.

అయితే ఎన్నికలు సమీపిస్తున్నందువల్ల పెట్రోల్, డీసెల్ ధరల పెరుగుదలవల్ల ప్రభుత్వానికి ఆందోళన కలుగుతోందన్నది వాస్తవం. 2018 ఏప్రిల్, మే నెలల్లో కర్నాటక ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకట్టుకోవడానికి రోజువారీ చమురు ధరల సవరణ నిలిపి వేశారు. ఈ పాచిక భవిష్యత్తులో పని చేసేట్టు లేదు.

ఎందుకంటే ఎన్నికలు ముగిసిన వెంటనే చమురు ధరలు అమాంతం పెరగక తప్పదు. ప్రభుత్వం అనేక చిట్కాలు ప్రయోగిస్తోంది. దేశంలో పెట్రోల్, డీసెల్ ధరలు రోజువారీగా ఎలా నిర్ణయిస్తారు? పెట్రోల్, డీసెల్ ధరలను చమురు కంపెనీలు ఎలా నిర్ణయిస్తాయో రికార్డులను వెల్లడించాలని దాఖలైన పిటిషన్లను దిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.

చమురు ధరలను గోప్యంగా నిర్ణయిస్తున్నందువల్ల చమురు కంపెనీలకు రూ. 500 కోట్ల మేర నష్టం ఎందుకు కలిగిందో చెప్పడం కుదరదు. ఎన్నికల తర్వాత చమురు ధరలను ఏ పద్ధతి ప్రకారం నిర్ణయించారన్నదీ రహస్యమే.

మన దేశంలో చమురు ధరలు చమురు దిగుమతి చేసుకునే పరిస్థితి మీద ఆధారపడి నిర్ణయిస్తున్నట్టు కనిపించదు. అయితే మనం నికరంగా చమురు ఎగుమతి కూడా చేస్తున్నాం. 2017-18లో రూ. 23.858 మిలియన్ల విలువగల చమురు ఎగుమతి చేశాం. మనం చమురు దిగుమతి చేసుకోవడానికి వెచ్చించిన మొత్తం రూ. 744 మిలియన్లే. అంటే దిగుమతులకన్నా ఎగుమతులు 32 శాతం అధికం. చమురు శుద్ధి కర్మాగారాలను విస్తరించినందువల్ల చమురు ఎగుమతులు పెరిగాయి. చమురు శుద్ధి చేయడానికి ఎక్కువ డబ్బు ఖర్చు అవుతోందన్న తప్పుడు అంచనాతో దిగుమతులకు ఎక్కువ ఖర్చవుతోందని చెప్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినప్పుడల్లా చమురు కంపెనీల పంట పండుతోంది. కానీ వినియోగదారులు మాత్రం ఎక్కువ మొత్తం చెల్లించవలసి వస్తోంది. ముడి చమురు కాకుండా చమురే దిగుమతి చేసుకున్నా వినియోగదారులకు ఈ మోయలేని భారం తగ్గేది. అంటే చమురు శుద్ధి కర్మాగారాలు తమకు వస్తున్నాయంటున్న నష్టాలు నికరమైన నష్టాలకన్నా తక్కువే. నిజానికి అవి లాభాలే మూటగట్టుకుంటున్నాయి. చాలా సందర్భాలలో లాభాలను నష్టాలుగా చూపుతున్నారు.

మన దేశంలో చమురు ధరల నిర్ణయం ఆర్థిక వ్యవహారం కాదు. అది రాజకీయ క్రీడ. బీజేపీ నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యాపార వర్గాలకు మేలు చేసే విధానాలలో భాగంగా చమురు ధరలు ప్రభుత్వం నియంత్రించే విధానం విడనాడింది.

చమురు కంపెనీలు సంపాదించే లాభాలపై పన్నులు విధించి ప్రభుత్వ రాబడి పెంచుకుంటోంది. ద్రవ్య లోటు తగ్గించామని ఎన్నికల సమయంలో చెప్పుకోవడానికి వీలుగా రాబడి మీదే దృష్టి కేంద్రీకరించింది. ఇదంతా రాబోయే ఎన్నికలలో లబ్ధి కోసమే. పీపా చమురుకు 70 డాలర్లకన్నా ఎక్కువ ఉంటే చమురు కంపెనీలపై ప్రభుత్వం పన్నులు విధిస్తోంది.

అయితే ఈ పన్నులు పెంచడానికి ప్రభుత్వం కొలమానం ఏమిటో తెలియదు. చమురు కంపెనీల రాబడిలో ప్రభుత్వానికి ఎటూ వాటా ఉంది కనక లాభాలపై పన్నులు విధించడంపై పెట్రోలియం మంత్రిత్వ శాఖలోనే అసంతృప్తి ఉంది. దీనివల్ల స్వేదేశీ, విదేశీ పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈ పెట్టుబడులు చమురు అన్వేషణకు అత్యవసరం. చమురు ధరల విషయంలో ప్రభుత్వ భంగపాటు పర్షియన్ సింధు శాఖలో చమురు తెట్టె కట్టినప్పుడు పెలికన్ పక్షులు దిక్కు తోచని స్థితిలో పడిపోయిన చందంగానే ఉంది.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

First Published:  29 Sep 2018 12:40 AM GMT
Next Story