Telugu Global
NEWS

మరో అదిరే డీల్ కుదిర్చిన చంద్రబాబు

రాజకీయ అధిపత్యం కోసం ఫ్యాక్షన్‌ను నడిపి ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారణమైన ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిని తన పార్టీలో ఉంచుకున్న చంద్రబాబు వారి ద్వారా కడప జిల్లాలో పట్టు కోసం పావులు కదుపుతున్నారు. ఆదినారాయణరెడ్డి పార్టీలో చేరడాన్ని తొలుత తీవ్రంగా వ్యతిరేకించిన రామసుబ్బారెడ్డి ఆ తర్వాత చంద్రబాబు చేసిన 50-50 పంచాయతీతో శాంతరూపం దాల్చారు. నియోజకవర్గంలో నిధులను సగం సగం పంచుకోవాల్సిందిగా ఇద్దరు ఐఏఎస్‌ల సమక్షంలోనే చంద్రబాబు పంచాయతీ చేశారని ఆ మధ్య ఆదినారాయణరెడ్డే స్వయంగా చెప్పారు. […]

మరో అదిరే డీల్ కుదిర్చిన చంద్రబాబు
X

రాజకీయ అధిపత్యం కోసం ఫ్యాక్షన్‌ను నడిపి ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారణమైన ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిని తన పార్టీలో ఉంచుకున్న చంద్రబాబు వారి ద్వారా కడప జిల్లాలో పట్టు కోసం పావులు కదుపుతున్నారు.

ఆదినారాయణరెడ్డి పార్టీలో చేరడాన్ని తొలుత తీవ్రంగా వ్యతిరేకించిన రామసుబ్బారెడ్డి ఆ తర్వాత చంద్రబాబు చేసిన 50-50 పంచాయతీతో శాంతరూపం దాల్చారు. నియోజకవర్గంలో నిధులను సగం సగం పంచుకోవాల్సిందిగా ఇద్దరు ఐఏఎస్‌ల సమక్షంలోనే చంద్రబాబు పంచాయతీ చేశారని ఆ మధ్య ఆదినారాయణరెడ్డే స్వయంగా చెప్పారు.

ఎంతగా అంటే ఇటీవల మైలవరం ప్రాజెక్టులో ఒకే బోటులో ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి విహరించారు. వీరు ఇంతగా కలిసిపోవడం వెనుక తాజాగా చంద్రబాబు చేసిన పంచాయతీయే కారణమని టీడీపీ వారే చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒకరిని జమ్మలమడుగు అసెంబ్లీ నుంచి, మరొకరిని కడప పార్లమెంట్‌ నుంచి పోటీ చేయించేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారు.

ఇద్దరూ జమ్మలమడుగు నుంచే పోటీకి సుముఖత చూపగా…. చంద్రబాబు కొత్త ప్రతిపాదన పెట్టారు. కడప పార్లమెంట్‌ నుంచి పోటీ చేసి ఒకవేళ ఓడిపోయిన వారికి మరో రూపంలో పదవులు అప్పగిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఇద్దరి మధ్య ఉన్న కేసులను మాఫీ చేయిస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం.

ఒకరిపై ఒకరు పెట్టుకున్న కేసులన్నీ వాపస్‌ తీసుకునేలా చంద్రబాబు ప్రతిపాదించారు. అన్నింటికంటే ముఖ్యంగా షాద్‌ నగర్ జంట హత్యల కేసులో రామసుబ్బారెడ్డికి పెద్ద సాయం చేయబోతున్నారు. 1990లో మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్ నగర్‌ బస్టాండ్‌ వద్ద ఆదినారాయణరెడ్డి వర్గానికి చెందిన దేవగుడి శివశంకర్‌ రెడ్డి, లక్కిరెడ్డి గోపాల్ రెడ్డిని ప్రత్యర్థులు హత్య చేశారు.

ఆ జంట హత్యల కేసును బదిలీ మీద విచారణ జరిపిన నాంపల్లి కోర్టు రామసుబ్బారెడ్డిని దోషిగా తేల్చి 2004 డిసెంబర్‌లో జీవిత ఖైదు విధించింది. అనంతరం రామసుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించగా నిర్ధోషిగా కోర్టు ప్రకటించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 2008లో పిటిషన్‌ దాఖలు అయింది. అయితే ఆ కేసు అప్పటి నుంచి వాయిదాలు పడుతోంది గానీ తుది తీర్పు రావడం లేదు.

ఈనెలాఖరులో జంట హత్యల కేసులో సుప్రీం తీర్పు వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి మధ్య జంట హత్యల కేసు విషయంలోనూ చంద్రబాబు పంచాయతీ చేసినట్టు ప్రముఖ టీడీపీ అనుకూల పత్రికే కథనాన్ని రాసింది.

అయితే హత్య కేసుల్లో ఇరువర్గాల రాజీని కోర్టు అంగీకరించబోదని… అయినప్పటికీ ఈ కేసు నుంచి బయట పడేయడం అంటే అది ఏమార్గంలోనో చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

First Published:  1 Oct 2018 11:50 AM GMT
Next Story