Telugu Global
Family

ఎవర్నీతక్కువగా చూడకు

         సృష్టిలో ప్రతిదీ ప్రత్యేకత సంతరించుకున్నదే. కొన్నిటికి గుర్తింపు వుంటుంది. కొన్నిటికి వుండదు. ప్రపంచంలో ప్రతి మనిషీ ప్రత్యేకత వున్నవాడే. ప్రత్యేకత వున్నది ప్రదర్శన కోసం కాదు.             ఒక వ్యక్తికి కొన్ని అభిరుచులుంటాయి, రుచులుంటాయి. ఇంకొకరికి మరి కొన్ని ఉంటాయి. వారికి అవి వున్నాయంటే ఎందుకున్నాయని అంటే సమాధానం చెప్పలేం. కొమ్మలోని ఆకుల్లో ఒకదాన్ని పోలింది ఒకటి వుండదు. మనుషులంతా అంతే… పోల్చడానికి వీలులేని అసాధారణ లక్షణాలు ప్రతి మనిషిలోనూ వుంటాయి. […]

సృష్టిలో ప్రతిదీ ప్రత్యేకత సంతరించుకున్నదే. కొన్నిటికి గుర్తింపు వుంటుంది. కొన్నిటికి వుండదు. ప్రపంచంలో ప్రతి మనిషీ ప్రత్యేకత వున్నవాడే. ప్రత్యేకత వున్నది ప్రదర్శన కోసం కాదు.

ఒక వ్యక్తికి కొన్ని అభిరుచులుంటాయి, రుచులుంటాయి. ఇంకొకరికి మరి కొన్ని ఉంటాయి. వారికి అవి వున్నాయంటే ఎందుకున్నాయని అంటే సమాధానం చెప్పలేం. కొమ్మలోని ఆకుల్లో ఒకదాన్ని పోలింది ఒకటి వుండదు. మనుషులంతా అంతే… పోల్చడానికి వీలులేని అసాధారణ లక్షణాలు ప్రతి మనిషిలోనూ వుంటాయి.

మనం చెయ్యాల్సిందల్లా వాటిని ఆమోదించడమే. వాటిని అంగీకరించి వ్యక్తిని గౌరవించడమే.

అన్నీ నాకే తెలుసునన్న అహంభావం పనికి రాదు. ఇతరులకు ఏమీ తెలీదని అనుకోకూడదు. మనుషుల్ని తక్కువగా చూడకూడదు.

ఒక పండితుడు అన్ని శాస్త్రాల్లో గొప్ప పాండిత్యమున్నవాడు. తన మేథస్సుతో ఎందర్నో ప్రభావితం చేశాడు. వాదనలో ఎందరినో ఓడించాడు. తన ప్రతిభా పాటవాల మీద అతనికి అంతులేని నమ్మకం.

పండితుడు తీర్థయాత్రలకు బయల్దేరాడు. ఎప్పుడూ తన వెంట గ్రంథాల్ని తీసుకుపోయేవాడు. సమయం దొరికినపుడు అధ్యయనం చేసేవాడు. అతనిది గొప్ప జ్ఞాపకశక్తి.

ఒక తీర్థయాత్రలో అతను ఒక నదిని దాటాల్సి వచ్చింది. ప్రవాహం ఉధృతంగా వుంది. తీరం ఒడ్డున పడవవుంది. పడవ నడిపే వాడు వున్నాడు. అతను పేదవాడు. గోచీ పెట్టుకున్నాడు. జనాల్ని తీరం దాటించి వాళ్ళిచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకునేవాడు.

పండితుడు ఒక్కడే వున్నాడు. ఇతర ప్రయాణికులెవరూ లేరు. పడవ నడిపేవాడు “స్వామీ! ఇంకా ఎవరయినా ఒకరిద్దరు వచ్చాకా బయల్దేరుదాం” అన్నాడు.

పండితుడు “లేదు నేను వెంటనే తీరం దాటాలి” అన్నాడు. అతను పండితుని మాట కాదనలేక పడవను నీళ్ళలోకి మళ్ళించాడు.

పండితుడు పడవనడిపే వాణ్ణి పామరుడనుకున్నాడు. చులకనగా చూశాడు. ఆ పేదవాణ్ణి ఆటపట్టించాలని పించింది.

పేదవాడు జాగ్రత్తగా తెడ్డువేస్తూ పడవనడిపే పనిలో వున్నాడు.

పండితుడు “ఒరే! నీకు గణితం వచ్చా?” అన్నాడు. పండితులు పేదవాళ్ళని అలాగే పిలిచేవాళ్ళు. పేదవాడు “అదేంటి సామీ!” అన్నాడు. పండితుడు “జీవితానికి గణితం చాలా ముఖ్యం. పోనీ తర్కశాస్త్రం గురించి నీకు తెలుసా?” అన్నాడు.

పేదవాడు “నేనామాటే వినలేదు స్వామీ!” అన్నాడు.

“పోనీ మీమాంస శాస్త్రం గురించి విన్నావా!” అన్నాడు. పేదవాడు లేదన్నాడు.

“పోనీ పురాణాలు, కావ్యాలు, అలంకార శాస్త్రం వీటి గురించి విన్నావా?” అన్నాడు.

పేదవాడు “అక్షరం ముక్క రాని వాణ్ణి. ఇవన్నీ మీ లాంటివాళ్ళు చదువుకునేవి నాకెలా తెలుస్తాయి స్వామీ!” అన్నాడు.

పండితుడు పేదవాడి పట్ల జాలి ప్రకటించి “నువ్వు ఇవన్నీ తెలుసుకోలేక పోతే జీవితంలో చాలా కోల్పొతావు” అన్నాడు.

పేదవాడు “కూలీనాలీ చేసుకుని, పడవనడుపుకుని బతికే నాలాంటి వాడికి ఇవన్నీ ఎలా వస్తాయి స్వామీ” అన్నాడు.

పండితుడు “నువ్వు ఎన్నయినా చెప్పు. ఇవన్నీ నీకు తెలియకపోవడం వల్ల నీ సగం జన్మ వ్యర్థమయింది” అన్నాడు.

ఆ మాటలకు పేదవాడు కొద్దిగా నొచ్చుకున్నాడు. మౌనంగా ఉండిపోయాడు.

అంతలో నదీ ప్రవాహం ఎక్కువయింది. నీళ్ళు ఉధృతంగా ప్రవహించసాగాయి. పడవ ఇటూ అటూ కదిలిపోయింది. పండితుడు హడలిపోయాడు.

పేదవాడు ప్రవాహం ప్రమాదస్థాయికి చేరుకుందని గుర్తించాడు. త్వరగా నదిలోకి దూకి తీరాన్ని చేరుకోకుంటే పడవతోపాటు నదిలో పడి కొట్టుకుపోతామని గ్రహించాడు.

పండితుడితో “స్వామీ! ప్రవాహం బలంగా వుంది. పడవ కొట్టుకుపోతోంది. వెంటనే మనం నీటిలోకి దూకి అవతలి గట్టుకు ఈదాలి. మీకు ఈత వచ్చా?” అన్నాడు.

పండితుడు ఏడుస్తూ “అయ్యో! నాకు ఈతరాదే” అన్నాడు.

పేదవాడు “మీ శాస్త్రాలు నాకు రాకపోవడంతో నా సగం జీవితం వ్యర్థమయిందని అన్నారు. ఈత రాకపోవడంతో మీ పూర్తి జీవితమే మునిగిపోతోంది” అని నదిలోకి దూకాడు. ఈతాడుకుంటూ అవతలి గట్టుకు చేరాడు.

పండితుడు పడవతో బాటు నదిలో మునిగి కొట్టుకుపోయాడు.

– సౌభాగ్య

First Published:  30 Sep 2018 8:01 PM GMT
Next Story