పైలట్ శిక్షణ కోసం 21 ఏళ్లకే  క్రికెట్ కు గుడ్ బై

  • హాంకాంగ్ క్రికెటర్ క్రిస్టోఫర్ కార్టర్ నిర్ణయం
  • ఆసియాకప్ తో కెరియర్ ముగిసిన క్రిస్టోఫర్ కార్టర్
  • 11 వన్డేలు, 10 టీ-20లతోనే ముగిసిన కెరియర్

క్రికెట్…ఆసియాఖండ దేశాల యువతను కుదిపేస్తున్న క్రీడ. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ , శ్రీలంక, అప్ఘనిస్థాన్, యూఏఈ దేశాల నుంచి….హాంకాంగ్, మలేసియా లాంటి దేశాలకు సైతం క్రికెట్ విస్తరించింది.

ఫుట్ బాల్, మార్షల్ ఆర్ట్స్ లాంటి క్రీడలకు విశేష ఆదరణ కలిగిన హాంకాంగ్ లో సైతం….క్రికెట్ జోరందుకొంది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఇటీవలే ముగిసిన 2018 ఆసియాకప్ క్రికెట్ గ్రూప్ లీగ్ దశలో….టీమిండియా, పాకిస్థాన్ జట్లతో కలసి పసికూన హాంకాంగ్ సైతం పోటీకి దిగింది. హాంకాంగ్ జట్టుకు వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా సేవలు అందించిన క్రిస్టోఫర్ కార్టర్…కేవలం 21 సంవత్సరాల వయసుకే రిటైర్మెంట్ ప్రకటించాడు.

2015 నవంబర్ లో హాంకాంగ్ జట్టు సభ్యుడిగా అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిన కార్టర్…ఇటీవలి ఆసియాకప్ వరకూ 11 వన్డేలు, 10 టీ-20 మ్యాచ్ ల్లో పాల్గొన్నాడు.వన్డేల్లో 117 పరుగులు, టీ-20ల్లో 43 పరుగులు సాధించిన కార్టర్….క్రికెట్ కోసం చదువును సైతం గత రెండేళ్లుగా వాయిదా వేసుకొంటూ వచ్చాడు.

ఆసియాకప్ ముగియడంతోనే….క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకొని….తన జీవితలక్ష్యం…పైలట్ కావడం పైన దృష్టి కేంద్రీకరించాడు.

హాంకాంగ్ లో పుట్టి…ఆస్ట్రేలియాలోని పెర్త్ లో పెరిగిన కార్టర్…55వారాల పైలట్ కోర్సులో చేరాలని నిర్ణయించాడు. హాంకాంగ్ ఎయిర్ లైన్స్ లో…సెకెండ్ ఆఫీసర్ కావాలన్న పట్టుదలతో ఉన్నట్లు ప్రకటించాడు.