ఓటుకు నోటు కేసు నీరుగార్చిన వారే….

(ఎస్. విశ్వేశ్వర రావు)

ఓటుకు నోటు కేసు నీరుగార్చి రెండేళ్ళపాటు నిద్రాణదశలో ఉంచిన ఫైళ్లను ఇప్పుడు తిరగతోడడం వెనుక ఉద్దేశ్యం ఏమిటి? తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు ముఖ్యంగా కాంగ్రెస్-తెలుగుదేశం పొత్తుపెట్టుకుని మహాకూటమి ఏర్పాటు చేసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం ముఖ్యంగా పోలీసులు ఈ కేసును తిరగతోడడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఐటీ శాఖ కూడా రంగంలోకి దిగి దర్యాప్తు వేగవంతం చేయటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

2016 నుంచి కేసు దర్యాప్తులో ఎటువంటి ప్రగతి నోచుకోక దాదాపు మూసివేత దిశగా మూలనపడిన కేసును ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని తన శక్తియుక్తులను వినియోగిస్తోంది. మొత్తం కేసునే నీరుగార్చే విధంగా వ్యవహరించిన తెలంగాణ ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు ఎందుకు వేగిరం చేయటం వెనుక కారణాలేమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే దాదాపు మూసివేసిన కేసును ఇప్పుడు తిరగతోడడం వల్ల ప్రధాన సూత్రధారులు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటి దేశం నేత ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ తదితరులు చట్టం ముందు చిక్కుతారో లేదో గాని కాంగ్రెస్ నాయకుల్లోనే కాకుండా కాంగ్రెస్-తెలుగుదేశంల మధ్య ఐక్యత మరింత పెంచే విధంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

2015 మే లో ఓటుకు నోటు కేసు వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. దీనికి పొలిటికల్ స్కాండల్‌గా ప్రాధాన్యత లభించింది. దేశంలో గతంలో ఉత్తర భారతంలో జార్ఖండ్ రాష్ట్రంలో ఈ తరహా స్కాండల్ వెలుగులోకి రాగా ఆ తర్వాత 2015లో దక్షిణభారతంలో ”ఓటు ఫర్ నోట్” రికార్డులకెక్కింది.

జాతీయ స్థాయిలో పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఎంపీల కొనుగోలు వ్యవహారం కూడా పొలిటికల్ స్కాండల్ గా ప్రసిద్ధి చెందింది. తెలంగాణ శాసనమండలి ఎన్నికల సందర్భంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ ను లోబరుచుకునేందుకు 50లక్షల రూపాయలు ఇచ్చేందుకు ప్రయత్నించిన నాటి టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పాటు ఆయనతో ఫోన్లో మాట్లాడిన ఏపి సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ వివాదంలో కూరుకుపోయారు. అప్పట్లో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయి…. జూడిషియల్ రిమాండ్ కు కూడా వెళ్లి…. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. తెలంగాణ ఏసీబి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

ఈ కేసులో చంద్రబాబు, రేవంత్ అడ్డంగా దొరికిపోయే (ప్రస్తుతానికి నిందితులుగా) ఆధారాలు ఉన్నాయని అధికారులు చేబుతూ వస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వంలోని పెద్దలు కేసును నీరుగార్చేవిధంగా వ్యవహరించారు. ఫలితంగా ఏసిబి, ఐటి, ఈడీ దర్యాప్తులో ఎటువంటి ప్రగతి లేకుండా పోయింది.

2016 అక్టోబర్ లో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మొత్తం ప్రభుత్వ యంత్రాంగమంతా అమరావతికి తరలిపోయింది. తెలంగాణ, ఏపి ముఖ్యమంత్రుల మధ్య అవగాహనలో భాగంగానే ఆ ప్రభుత్వం అక్కడికి వెళ్లిపోయింది. ఏపి ప్రభుత్వం విభజన చట్ట ప్రకారం 10ఏళ్ళపాటు హైదరాబాద్ నుంచి పరిపాలన సాగించే అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి ఒత్తిడికి తలొగ్గి అక్కడికి వెళ్ళిపోయారనేది అప్పట్లో గుప్పుమంది.

హైదరాబాద్ నుంచి ఏపి పరిపాలన సాగిస్తే…. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు అండగా ఉండటం వల్ల పార్టీ పట్టుతోనే ఉంటుందని…. దానివల్ల తెలుగుదేశం శ్రేణులను, ఆ పార్టీ ఓటర్లను టీఆర్ఎస్ వైపు తిప్పుకోవడం సాధ్యం కాదని కెసిఆర్ భావించడం వల్ల…. ఓటుకు నోటు కేసు చూపించి ఏపి ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి పంపించి వేశారనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. అందులో భాగంగానే ఓటుకు నోటు కేసు వీగిపోయింది.

దర్యాప్తు జరిపిన ఏసిబితో పాటు ఫోరెన్సిక్ విభాగం కూడా ఇందులో చంద్రబాబు ప్రమేయం ప్రత్యక్షంగా ఉన్నట్లు గుర్తించారు. స్టీఫెన్‌సన్‌ తో చంద్రబాబు మాట్లాడినట్లు ఆయన స్వరం ఆధారంగా ఫోరెన్సిక్ గుర్తించింది. అయినప్పటికీ దర్యాప్తులో ఎటువంటి ప్రగతి కనిపించలేదు. ఇందుకు సంబంధించి చంద్రబాబుపై విచారణ జరపాలని హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు కూడా దాఖలయ్యాయి. అదే సమయంలో ముత్తయ్య జెరూసలెం ఈ కేసులో తాను అప్రూవర్ గా మారతానని సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రిపై అభియోగాలకు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఫైళ్ళను దాదాపు అటకెక్కించింది. అప్పట్లో ఐటి, ఈడి అధికారులు అసలు పట్టించుకోలేదు.

ఇప్పుడు తాజాగా ఐటి అధికారులు, తెలంగాణ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళుతున్న నేపథ్యంలో టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా బిజెపియేతర పక్షాలన్నీ మహాకూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ప్రధాన రాజకీయ పక్షాలైన తెలుగుదేశం-కాంగ్రెస్ మధ్య జాతీయస్థాయిలోనే అంగీకారం కుదిరింది.

ఏపికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందంటూ ఎన్డీయే నుంచి టిడిపి బయటకు వచ్చిన తరువాత బిజెపిపై రోజూ ఆరోపణలు చేస్తూ…. జాతీయ, తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో అవగాహన రాజకీయాలకు…. చంద్రబాబు నాయుడు కర్నాటక ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం సందర్భంగా బీజం వేశారు. అప్పటి నుంచి ఏపి సీఎంపై కేంద్ర ప్రభుత్వం వివిధ విభాగాలతో అవినీతిపై దర్యాప్తు చేయిస్తుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ (సానుభూతికోసం టిడిపినే ఎక్కువగా చెబుతోంది) ఆ వైపుగా కేంద్రం చేసిందయితే ఏమీలేదు.

ఆయన అనేక కేసుల్లో కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకున్నారు. రాజ్యాంగ వ్యవస్థలను తనకు అనుగుణంగా ఉపయోగించుకోవడంలో చంద్రబాబు దిట్ట అనేది అందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో 2015 మే లో నమోదయిన ఓటుకు నోటు కేసు కీలకమైనదయినప్పటికీ కెసిఆర్ సహకారంతో ఆయన దాదాపు బయటపడిపోయారు.

ఇప్పుడు తెలంగాణ పోలీసులు బహిరంగంగానే ప్రభుత్వానికి అనుకూలంగా కాంగ్రెస్ నేతలపై పాతకేసులను తిరగదోడుతున్నారు. ఇది బహిరంగ రహస్యం. వాళ్లు నేరస్థులే కావచ్చు (ఇంకా రుజువు కాలేదు). కానీ వారిపై కేసులు తిరగదోడుతున్న సమయం, సందర్భం మాత్రం ఆక్షేపనీయమే.

జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు…. ఇలా పలువురిపై పాతకేసులు తెరమీదకు వచ్చాయి. అందులో భాగంగానే ప్రధానమైన ఓటుకు నోటు కేసులో ఐటి యంత్రాంగం ఉత్సాహంగా, చురుగ్గా పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఈ యంత్రాంగానికి ఢిల్లీ స్థాయి నుంచి ఒత్తిడి రావడం వల్లనే మూడేళ్ళ తర్వాత ఇప్పుడు దర్యాప్తు చేపట్టారని అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది.

దాదాపు రెండు రోజుల పాటు రేవంత్ ఇంటిని జల్లెడ పట్టినప్పటికీ ఆధారాలు దొరకలేదు. ఇక్కడ విచిత్రం ఏమంటే చంద్రబాబుకు రక్షణగా నిలబడే పచ్చమీడియా సైతం గులాబీ గుబాళింపునకు తలొగ్గి రేవంత్ పై చిలవలు పలవలుగా ప్రసారాలు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. కెసిఆర్ తో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడికి సన్నిహిత సంబంధాలు ఉండటం వల్లనే ఐటి యంత్రాంగం అంత చురుగ్గా పనిచేసింది. మొత్తానికి కేసును నీరుగార్చి మూసివేసిన వారే ఇప్పుడు మళ్లీ పట్టుబిగించేందుకు ప్రయత్నిస్తున్నా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదట.

అయితే దీనివల్ల కాంగ్రెస్ లో ఐక్యత పెరిగింది. అదే సమయంలో బిజెపి, టీఆర్ఎసేతర పక్షాల మధ్య సాన్నిహిత్యం బలపడుతోంది. టీఆర్ఎస్ ముఖ్యంగా కెసిఆర్ ముందు బలహీనంగా ఉన్న తాము విడివిడిగా పోటీ చేస్తే మరింత బలహీనపడతామని ఆలోచిస్తున్న దశలో పాతకేసులను తిరగదోడుతున్నతీరు వారి మధ్య మరింత ఐక్యతను పెంచింది.

కాంగ్రెస్ లో రేవంత్ కు అంతగా ప్రాధాన్యత లభించేది కాదు. ఇటీవల సరూర్ నగర్ లో రాహుల్ గాంధీ బహిరంగ సభ సందర్భంగా రేవంత్ అనుచరులు చేసిన హంగామాతో ఆయనపై పార్టీ అధిష్టానం సీరియస్ అయ్యింది. కానీ ఆ తర్వాత పరిణామాలు…. కాంగ్రెస్ నేతలపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదుచేస్తుండడం వల్ల పార్టీలోనూ ముఖ్యంగా హైకమాండ్ లో ప్రాధాన్యత పెరిగింది. అదే సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ ను నియమించారు.

నేతలంతా ఒక్కటిగా ముందుకు సాగాలంటూ ప్రతిజ్ఞ చేసి ఎలాగైనా ఎన్నికల ఒప్పందం కుదుర్చుకుని మహాకూటమి విజయవంతం కావాలని అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా పార్టీ అధిష్టానం కూడా ఢిల్లీ నుంచి నేరుగా ఏపి సీఎంతోపాటు ఇతర పార్టీల నాయకులతోనూ చర్చలు సాగిస్తోంది. ఓటుకు నోటు కేసు దర్యాప్తు ఏమవుతుందో గానీ…. బిజెపియేతర పక్షాల మధ్య ఐక్యత పెంచేందుకు మాత్రం ప్రస్తుతానికి దోహదపడుతుంది.