తాగి విమానాలు నడుపుతున్నారు…. తస్మాత్‌ జాగ్రత!

చిన్న మోపెడ్‌లను కూడా ఆపి తనిఖీలు చేస్తున్నారు. తాగినట్లు తేలితే జరిమానాలు విధిస్తున్నారు. కానీ తాగి విమానాలు కూడా నడుపుతున్నారట పైలెట్లు.. వినడానికే భయం వేయడం లేదూ.. ఈ ఏడాది 10 మంది పైలెట్లు ఇలా తాగి విమానాలు నడుపుతూ దొరికిపోయారట. మన దేశంలోని వివిధ విమానాశ్రయాలలో గత ఎనిమిదేళ్ల లెక్కలు చూస్తే ఇలా తాగి విమానాలు నడుపుతూ దొరికిపోయిన పైలెట్ల సంఖ్య 58 అని తేలింది.

ప్రభుత్వాధీనంలోని ఎయిర్‌ ఇండియా సంస్థకు చెందిన లెక్కలే ఇవి. తాగి నడుపుతున్న పైలెట్లకు సంబంధించి ఢిల్లీ, ముంబై విమానాశ్రయాలు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ విమానాశ్రయాలలో 18 మంది తాగుబోతు పైలెట్లు దొరికిపోయారు. రెండోస్థానంలో చెన్నై ఉంది. అక్కడ 8 కేసులు నమోదయ్యాయి. ఇక బెంగళూరుది మూడో స్థానం. 6గురు పైలెట్లు దొరికారు.

ఒక పరిమితి వరకు పైలెట్లకు అనుమతి ఉంది. రక్తనమూనాలను పరిశీలించి ఆల్కహాల్‌ శాతం ఎంత ఉంది అనేది పరిశీలిస్తారు. ఇలా దొరికిపోయిన వారంతా ఎక్కువ మొత్తంలో మద్యం సేవించినవారన్నమాట. అయితే డీజీసీఏ (డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌) నిబంధనల ప్రకారం విమాన సిబ్బంది ఎవరూ ప్రయాణానికి 12 గంటల ముందు నుంచి మద్యం సేవించకూడదు. మద్యం సేవించినట్లు తేలితే వారిపై నిషేధం విధించే అవకాశం ఉంది. అయితే ఆ నిబంధనను ఎవరూ ఖాతరు చేయడం లేదు. ఏ ఏడాదికాయేడు మద్యం సేవించిన పైలెట్ల సంఖ్య పెరుగుతూనే ఉంది.