Telugu Global
International

భారత గడ్డపై మరో మినీ టెస్ట్ సిరీస్

టాప్ ర్యాంక్ టీమిండియాకు 8వ ర్యాంక్ విండీస్ సవాల్ రాజ్ కోట స్టేడియంలో రెండుజట్ల సిరీస్ షురూ ఆసీస్ టూర్ కు సన్నాహకంగా విండీస్ తో సిరీస్ టీమిండియా, వెస్టిండీస్ జట్ల రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు…. రాజ్ కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఆస్ట్రేలియాటూర్ కు సన్నాహకంగా నిర్వహిస్తున్న ఈ సిరీస్ లో… టాప్ ర్యాంకర్ టీమిండియా, 8వ ర్యాంకర్ వెస్టిండీస్ ఎక్కువమంది యువఆటగాళ్లతో పోటీకి దిగుతున్నాయి. ప్రత్యేకంగా తయారు […]

భారత గడ్డపై మరో మినీ టెస్ట్ సిరీస్
X
  • టాప్ ర్యాంక్ టీమిండియాకు 8వ ర్యాంక్ విండీస్ సవాల్
  • రాజ్ కోట స్టేడియంలో రెండుజట్ల సిరీస్ షురూ
  • ఆసీస్ టూర్ కు సన్నాహకంగా విండీస్ తో సిరీస్

టీమిండియా, వెస్టిండీస్ జట్ల రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు…. రాజ్ కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

ఆస్ట్రేలియాటూర్ కు సన్నాహకంగా నిర్వహిస్తున్న ఈ సిరీస్ లో… టాప్ ర్యాంకర్ టీమిండియా, 8వ ర్యాంకర్ వెస్టిండీస్ ఎక్కువమంది యువఆటగాళ్లతో పోటీకి దిగుతున్నాయి. ప్రత్యేకంగా తయారు చేసిన బౌన్సీ పిచ్ ల పైన జరిగే ఈ సిరీస్ బ్యాట్స్ మన్ సత్తాకు సవాల్ కానుంది.

యువఆటగాళ్ల సత్తాకు సవాల్….

ఇటీవలే ముగిసిన ఇంగ్లండ్ టూర్ లో దారుణంగా విఫలమైన …టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ టీమిండియా….స్వదేశంలో మరో మినీ టెస్ట్ సిరీస్ కు సిద్ధమయ్యింది. 8వ ర్యాంకర్ వెస్టిండీస్ తో అక్టోబర్ 4 న ప్రారంభమయ్యే ఈ రెండుమ్యాచ్ ల సిరీస్ …రెండుజట్ల యువఆటగాళ్ల సత్తాకు… అసలు సిసలు పరీక్షేకానుంది.

టీమిండియాతో రెండుమ్యాచ్ ల టెస్ట్, ఐదుమ్యాచ్ ల వన్డే, మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ ల్లో పాల్గొనటానికి… జెయింట్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ నాయకత్వంలోని కరీబియన్ ఆర్మీ… ఇప్పటికే భారత్ చేరుకొని ప్రాక్టీస్ మ్యాచ్ తో సన్నాహాలు ప్రారంభించింది. తొలిటెస్ట్ వేదికగా… రాజ్ కోట్… సౌరాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియంలో కసరత్తులు సైతం చేసింది.

ఆసీస్ టూర్ కు సన్నాహకంగా….

మరోవైపు…ప్రపంచ నంబర్ వన్ టీమిండియా మాత్రం…వచ్చేనెలలో జరిపే ఆస్ట్రేలియా పర్యటనకు సన్నాహాలలో భాగంగా…ఈ సిరీస్ ను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగానే.. బౌన్సీ పిచ్ ను సిద్ధం చేయాలని రాజ్ కోట స్టేడియం క్యూరేటర్ ను కోరింది.

హోల్టర్, ఖేమర్ రోచ్, గేబ్రియల్ లాంటి మెరుపు ఫాస్ట్ బౌలర్లతో కూడిన విండీస్ జట్టును దీటుగా ఎదుర్కొనడం ద్వారా… కంగారూ సవాల్ కు సిద్ధంకావాలని భారత టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది.

సీనియర్లకు రెస్ట్, జూనియర్లకు చాన్స్

ఇక…విరాట్ కొహ్లీ నాయకత్వంలోని 15 మంది సభ్యుల భారతజట్టులో సైతం…యువఆటగాళ్లు మయాంక్ అగర్వాల్, మహ్మద్ సిరాజ్, పృథ్వీ షాలకు తొలిసారిగా చోటు కల్పించడమే కాదు… శిఖర్ ధావన్, మురళీ విజయ్, రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్, ఇశాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్ లాంటి సీనియర్లను పక్కన పెట్టారు.

రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా స్పిన్ విభాగంలోనూ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్ ఫాస్ట్ బౌలింగ్ విభాగంలోనూ కీలకపాత్ర పోషించబోతున్నారు.

తుదిజట్టులో పృథ్వీ షా….

బ్యాటింగ్ లో మాత్రం…రాహుల్, పృథ్వీ షా జోడీ…. భారత ఇన్నింగ్స్ ను ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. అయితే…ఆంధ్ర ఆటగాడు హనుమ విహారీ తుదిజట్టులో చోటు నిలుపుకోలేకపోయాడు. హైదరాబాద్ యువఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ను సైతం పక్కన పెట్టారు.

కెప్టెన్ విరాట్ కొహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పూజారా, రిషభ్ పంత్ లాంటి ఆటగాళ్లతో టీమిండియా టాపార్డర్ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది.

బౌన్సీ పిచ్ పైనే సమరం…

మ్యాచ్ కు వేదికగా ఉన్న సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియం…గతంలో ఇంగ్లండ్ తో టెస్ట్ కు ఆతిథ్యమిచ్చింది. అయితే …ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ప్రస్తుత సిరీస్ లోని తొలిటెస్ట్ కు వేదికగా నిలిచిన రాజ్ కోట్ లో… ఫలితం రావడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

బౌన్స్ తో కూడిన ఈ వికెట్ ఆట చివరి రెండురోజులూ… స్పిన్ బౌలింగ్ కు అనువుగా మారే అవకాశం కూడా ఉంది.

విండీస్ తురుపుముక్క బిషు…

వెస్టిండీస్ జట్టు మాత్రం లెగ్ స్పిన్నర్ దేవేంద్ర బిషూను… టీమిండియాపై తన ప్రధాన అస్త్రంగా ఉపయోగించబోతోంది. హోల్డర్ ఇప్పటి వరకూ ఆడిన మొత్తం 34 టెస్టుల్లో 26 మ్యాచ్ ల్లో కెప్టెన్ గా వ్యవహరించాడు.

కరీబియన్ ఆర్మీదే పైచేయి….

1948 నుంచే ఈ రెండుజట్లూ టెస్ట్ సిరీస్ ల్లో పోటీపడుతూ వస్తున్నాయి. గత ఏడుదశాబ్దాల కాలంలో విండీస్ తో టీమిండియా మొత్తం 94 టెస్టుల్లో ఢీ కొంటే…18 విజయాలు మాత్రమే సాధించగలిగింది. అదే కరీబియన్ టీమ్ మాత్రం 30 విజయాలతో పైచేయి సాధించింది.

మరో 46 టెస్టులు డ్రాల పద్దులో చేరాయి. భారతగడ్డపై ఈ రెండుజట్ల మధ్య జరిగిన మొత్తం 45 మ్యాచ్ ల్లో టీమిండియా 11, వెస్టిండీస్ 14 విజయాలు సాధిస్తే… మరో 20 టెస్టులు డ్రాగా ముగిశాయి.

గత మూడు సిరీస్ ల్లో భారత్ జోరు….

1948- 49 నుంచి రెండుజట్లూ ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్ లు ఆడుతూ వస్తున్నాయి. భారత్ వేదికగా రెండుజట్లూ ఇప్పటి వరకూ 11సార్లు సిరీస్ ల్లో పోటీపడితే… విండీస్ 5 సిరీస్ లు, టీమిండియా నాలుగు సిరీస్ లు నెగ్గాయి.

మరో రెండు సిరీస్ లు డ్రాగా ముగిశాయి. విండీస్ ప్రత్యర్థిగా స్వదేశంలో ఆడిన గత మూడు సిరీస్ ల్లో టీమిండియానే విజేతగా నిలిచింది. 2002-03, 2011-12, 2013-14 సిరీస్ లను టీమిండియా 2-0 స్కోర్లతో నెగ్గుతూ ఆధిపత్యం చాటుకొంది. ఏవిధంగా చూసినా… కరీబియన్ టీమ్ దే పైచేయిగా కనిపిస్తోంది.

ఏదిఏమైనా… విండీస్ పేస్ కు…టీమిండియా స్పిన్ కు మథ్య జరిగే ఈ తొలిటెస్ట్ లో నెగ్గినజట్టే… సిరీస్ ను గెలుచుకొనే అవకాశాలున్నాయి.

First Published:  3 Oct 2018 10:55 PM GMT
Next Story