Telugu Global
Family

సిరియాళుడు

సిరియాళుడు “భక్త సిరియాళుడు”గా ప్రసిద్ధుడు. భక్తి సిరియాళుని ఇంటి పేరయింది. ఆ భక్తి యెవరి పట్ల? తల్లి పట్లా? తండ్రి పట్లా? దేవుని పట్లా? అతిథి దేవుని పట్లా? ఎవరిపట్ల? చిరుతొండడను వైశ్యునికి పుట్టినవాడే సరియాళుడు. తల్లి తిరువెంగనాంచి. తల్లిదండ్రులిద్దరూ శివభక్తులే! సిరియాళుడూ తన తలిదండ్రులవల్ల శివ భక్తుడే! అంతకన్నా ముందు అమ్మనాన్నలకు భక్తుడు! తల్లిదండ్రి గురువూ తరువాతి స్థానమే దైవం! సిరియాళునికీ అంతే! తిరువెంగనాంచి చిరుతొండ దంపతులకు తమపైగల భక్తి గురించి శివపార్వతులు విన్నారు. స్వయంగా […]

సిరియాళుడు “భక్త సిరియాళుడు”గా ప్రసిద్ధుడు. భక్తి సిరియాళుని ఇంటి పేరయింది. ఆ భక్తి యెవరి పట్ల? తల్లి పట్లా? తండ్రి పట్లా? దేవుని పట్లా? అతిథి దేవుని పట్లా? ఎవరిపట్ల?

చిరుతొండడను వైశ్యునికి పుట్టినవాడే సరియాళుడు. తల్లి తిరువెంగనాంచి. తల్లిదండ్రులిద్దరూ శివభక్తులే!

సిరియాళుడూ తన తలిదండ్రులవల్ల శివ భక్తుడే! అంతకన్నా ముందు అమ్మనాన్నలకు భక్తుడు! తల్లిదండ్రి గురువూ తరువాతి స్థానమే దైవం! సిరియాళునికీ అంతే!

తిరువెంగనాంచి చిరుతొండ దంపతులకు తమపైగల భక్తి గురించి శివపార్వతులు విన్నారు. స్వయంగా తెలుసుకోదలచుకున్నారు. అందుకే వృద్ధులైన అతిధుల్లా ఆ ఇంట అడుగు పెట్టారు!

అతిధి దేవోభవ కదా?! వచ్చిన అతిధి దైవంతో సమానం! ప్రత్యక్ష దైవమే! కోరిన నైవేధ్యం పెట్టవలసిందే. పెట్టి తీరవలసిందే. వచ్చిన అతిధి దేవుళ్ళు సంతుష్ఠి చెందాల్సిందే!

మాంసమంటే తమకు ప్రీతి అన్నారు. మాంసాహారం కోరారు. తమ మాయతో మాంసం యెక్కడా దొరక్కుండా చేసారు. ఆటకు వెళ్ళి వచ్చిన సిరియాళున్ని చూసారు. చూసి మార్గం దొరికిందన్నారు. సిరియాళున్ని చంపి తమకు వండిపెట్టమన్నారు. ఒక్కగానొక్క బిడ్డ. ఒక్క క్షణం ఊపిరి ఆగింది. మరుక్షణం ఊపిరి ఆడింది. అంగీకరించారు. సిరియాలునికి ఈ విషయం తెలియదు.

శివుడు రూపం మార్చి సిరియాలుని చెంతకు వెళ్ళాడు. మీ ఇంటికి అతిధులు వచ్చారుకదా… వారికోసం నీ తలిదండ్రులు నిన్ను చంపివండి వడ్డించనున్నారని చెప్పాడు. తనతో రమ్మన్నాడు. ప్రాణాలు కాపాడుకోమన్నాడు. సిరియాళుడు వినలేదు సరి కదా. నా శరీరం వచ్చిన అతిధులకు తృప్తినిస్తే నేను ధన్యుడనే కదా… అని అడిగాడు. అంతకన్నా జీవితానికి సార్థకము లేదు కదా… అని అన్నాడు. నా తల్లిదండ్రుల ఇష్టమే నాయిష్టము… అని చెప్పాడు. శివుడు ఇంకా చెప్పబోతే – వద్దన్నాడు. నీతో రానన్నాడు. తల్లిదండ్రుల దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళాడు. స్నానం చేసి శుభ్రతతో వచ్చానన్నాడు. మీకోరిక నెరవేర్చడానికి సిద్ధమన్నాడు. తల్లిదండ్రులు అటువంటి బిడ్డకు జన్మనిచ్చినందుకు కరిగి నీరై పోయారు. అవతల వృద్ధ అతిధులు ఆకలంటూ వేరే ఆలోచనలకు అవకాశమివ్వలేదు!

సిరియాళుని తండ్రి చంపాడు. తల్లి వండి వడ్డించింది. అయినా ఆ అతిధి దేవుళ్ళు తినలేదు. నీ కొడుకు లేకుండా మేం తినలేమని చెప్పారు. పిలవమన్నారు. పిలిస్తే వస్తాడన్నారు. అతిధి దేవుని ఆన. చిరుతొండడు “సిరియాళ్… ఓ సిరియాళ్” అని కొడుకుని దుఃఖపు గొంతుతో గొంతెత్తి పిలిచాడు. తల్లి గుండె కొట్లాడింది. పిలుపు విన్నట్టు నిజంగానే సిరియాళుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. శివపార్వతుల మాయగా, మహిమగా నమ్మలేనట్టు సిరియాళుడు… తలిదండ్రులు బిడ్డను చేతులారా తడిమి – అతిధులకు చెయ్యెత్తి మొక్కారు!

శివపార్వతులు సిరియాళుని భక్తికి మెచ్చి చిరంజీవిగా జీవించమని దీవెనలిచ్చారు!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  3 Oct 2018 1:02 PM GMT
Next Story