Telugu Global
CRIME

ఆధార్ పై అరకొర తీర్పు

ఆధార్ కార్డు మీద గత ఆరేళ్లుగా న్యాయస్థానంలో వివాదం కొనసాగింది. చివరకు ఏక బిగిన 38 రోజులు విచారణ జరిపి, రెండు రాజ్యాంగ ధర్మాసనాలకు ఈ వ్యవహారం నివేదించి, ముగ్గురు న్యాయమూర్తులు విడివిడిగా తీర్పులు వెలువరించారు. ఈ తీర్పు చాలా సుదీర్ఘమైంది. ఈ మూడు తీర్పులు కలిసి 8,700 పేజీలకు పైగా ఉన్నాయి. అంటే ఇందులో 3.5 లక్షల పదాలున్నాయి. అయినా ఆధార్ చెల్లుతుందా లేదా అన్న విషయంలో అన్ని సందేహాలు నివృతి కానే లేదు. తాజా […]

ఆధార్ పై అరకొర తీర్పు
X

ఆధార్ కార్డు మీద గత ఆరేళ్లుగా న్యాయస్థానంలో వివాదం కొనసాగింది. చివరకు ఏక బిగిన 38 రోజులు విచారణ జరిపి, రెండు రాజ్యాంగ ధర్మాసనాలకు ఈ వ్యవహారం నివేదించి, ముగ్గురు న్యాయమూర్తులు విడివిడిగా తీర్పులు వెలువరించారు. ఈ తీర్పు చాలా సుదీర్ఘమైంది. ఈ మూడు తీర్పులు కలిసి 8,700 పేజీలకు పైగా ఉన్నాయి. అంటే ఇందులో 3.5 లక్షల పదాలున్నాయి. అయినా ఆధార్ చెల్లుతుందా లేదా అన్న విషయంలో అన్ని సందేహాలు నివృతి కానే లేదు.

తాజా కేసు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, న్యాయమూర్తి ఎ.కె.సిక్రి, న్యాయమూర్తి ఎ.ఎం. ఖన్విల్కర్ విచారించారు. దీపక్ మిశ్రా తరఫున, తన తరఫున సిక్రీ ఒక తీర్పు రాస్తే ఖన్విల్కర్ మరో తీర్పు రాశారు. అయినా తీర్పు అసంపూర్ణంగానే మిగిలి పోయింది. ప్రధాన న్యాయమూర్తి మిశ్రా పదవీ విరమణ చేయవలసి ఉన్నందువల్ల హడావిడిగా తీర్పు ఖరారు చేసినందువల్లనేమో కొన్ని చోట్ల ఖాళీలు మిగిలిపోయాయనిపిస్తోంది. అదీ కాక న్యాయమూర్తులు చేసిన నిర్ధారణల్లో కొన్ని నిశిత పరిశీలనకు నిలబడేవిగా లేవు. ముందే ఒక నిర్ణయానికి వచ్చి తదనుగుణంగా తీర్పులు రాశారన్న అనుమానం కలుగుతోంది.

పరిమిత పరిపాలన అన్న రాజ్యాంగ భావనను పరిశీలించడంలో తుది తీర్పులు ఈ అంశాన్ని సాకల్యంగా పరిశీలించినట్టు కనిపించడం లేదు. ఈ భావనను ఆధార్ ఎలా ప్రభావితం చేస్తుంది అన్న విషయాన్ని కూలంకషంగా పరిశీలించినట్టు లేదు. వినయ్ విశ్వం కు కేంద్ర ప్రభుత్వానికి మధ్య గత కేసులో ఇచ్చిన తీర్పులో అర్జీ పెట్టుకున్న వారి తరఫు న్యాయవాది లేవనెత్తిన అనేక అంశాలను క్షుణ్నంగా పరిశీలించకుండానే రాజ్యాంగ భావన గురించి సమాధానాలు చెప్పకుండానే వదిలేశారు. వినయ్ విశ్వం కేసులో ఆదాయపు పన్ను విషయంలో ఆధార్ వినియోగం అన్న ఒకే అంశం చర్చకు వచ్చింది.

కానీ తాజా కేసులో అనేక అంశాలు లేవనెత్తారు. 2016నాటి ఆర్థిక, ఇతర సబ్సిడీలు అందజేయడానికి ఆధార్ తప్పని సరి చేసే చట్టం, పరిమిత ప్రభుత్వం అన్న భావనను ధ్వంసం చేసే ఇతర అంశాలకు ఆధార్ ను వినియోగించడం మొదలైన విషయాలను సవ్యంగా పరిశీలించినట్టు లేదు. మెజారిటీ తీర్పు ఈ అంశాన్ని పట్టించుకున్నట్టు లేదు. గత తీర్పు ఒకటి రెండు అంశాలను ఇదివరకే కొట్టి వేసింది అని చెప్పి ఊరుకున్నారు.

చరిత్రాత్మకమైన తీర్పు వెలువరిస్తారనుకుంటే రెండు వేపుల వాదనలను సాకల్యంగా పరిశీలించినట్టు లేదు. తాజా కేసు ప్రజల జీవితాలను ప్రభావితం చేసేది. ఈ విషయంలో అనేక వాదనలు తలెత్తాయి. పరిపాలన మీద తీవ్రమైన ప్రభావం ఉన్న అంశం. కానీ తమ ఎదుట లేవనెత్తిన అనేక ముఖ్యమైన ప్రశ్నలకు మెజారిటీ తీర్పు నిర్దిష్టమైన సమాధానాలు చెప్పనే లేదు. ఇద్దరు న్యాయమూర్తులు ఒక అభిప్రాయం, మరో న్యాయమూర్తి భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినా భిన్నాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. మూడు తీర్పులూ సమాంతరంగా రాసినట్టు ఉంది.

ఆధార్ కు సంబంధించిన మరో కేసులోనే తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన బెంచి ఆరుగురు న్యాయమూర్తులు ఏకాభిప్రాయంతో వ్యక్తులకు గోప్యతా హక్కు ఉందని, ఇందులో ప్రభుత్వం గానీ ప్రైవేటు వ్యక్తులు కానీ జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అని తీర్పు చెప్పింది. ఈ విషయంలో తాజా తీర్పు నిరాశే మిగిల్చింది. గోప్యతా హక్కు గురించి కె.ఎస్. పుట్టస్వామికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య కేసులో సుప్రీం కోర్టే పదే పదే గోప్యతా హక్కు గురించి ప్రస్తావించింది. రెండు భిన్నమైన కేసుల్లో భారత శిక్షా స్మృతిలోని 377వ సెక్షన్ ను, 497వ సెక్షన్ ను కొట్టి వేశారు.

అయితే ఆధార్ విషయంలో గోప్యత అంశానికి వచ్చే సరికి మెజారిటీ తీర్పు వెలువరించిన న్యాయమూర్తులు ఈ అంశాన్ని గమనంలోకి తీసుకున్నట్టు లేదు. “బలవంత పెట్టడంలో రాజ్య ప్రయోజనం”, “చట్టబద్ధమైన రాజ్య ప్రయోజనం”, “ప్రజా ప్రయోజనం” లాంటి మాటల మధ్య ఉన్న తేడా పుట్టస్వామి కేసులో వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తం అయినాయి. తాజా కేసులో న్యాయమూర్తులు ఈ విషయంలో ముందుగా ఏర్పరచుకున్న అభిప్రాయలకు అనుగుణంగానే తీర్పు చెప్పినట్టుంది.

ఈ నేపథ్యంలో న్యాయమూర్తి చంద్రచూడ్ వ్యక్తం చేసిన మైనారిటీ అభిప్రాయం కొంత ఆశాజనకంగా ఉంది. అది సవివరంగా, అత్యంత హేతుబద్ధంగా, నిర్భీతితో నిర్ధారణకు వచ్చినట్టు ఉంది. ఆధార్ వివాదంలో మూలభూతమైన గోప్యత మీద దాడి, సకల విషయాల్లో రాజ్యం నియంత్రణ, కొందరిని మినహాయించడం వంటి అంశాలను ఆయన వ్యక్తం చేసిన భిన్నాభిప్రాయం ప్రస్తావించింది. ఆధార్ బిల్లును “ద్రవ్య బిల్లు” రూపంలో దొడ్డి దారిన ప్రవేశపెట్టడం “రాజ్యాంగంపట్ల అపచారం” తలపెట్టడమే అని ఆయన స్పష్టంగా చెప్పారు.

ఈ ఒక్క కారణం చేత ఆయన మొత్తం చట్టాన్ని కొట్టివేయాల్సింది. కానీ ఆయన ఈ చట్టంలోని ఇతర అంశాలను లోతుగా పరిశీలించి భవిష్యత్తులో చేసే చట్టాలు రాజ్యాంగానికి కట్టుబడి ఉండేలా రూపొందించాలన్న నిర్ధారణకు వచ్చారు. చంద్రచూడ్ తీర్పు ఆధార్ చట్టంలోని అనేక నిబంధనలను తోసిపుచ్చింది. ఇవి గోప్యతా హక్కుకు, ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన తేల్చారు.

అత్యంత ప్రధానమైన ప్రాథమిక హక్కుల కేసుల్లో మైనారిటీ తీర్పులు వెలువరించడం సుప్రీంకోర్టు చరిత్రలో కొత్త కాదు. ఈ మైనారిటీ అభిప్రాయాలే ఆ తర్వాత తుది అభిప్రాయాలయ్యాయి. ఎ.కె.గోపాలన్ కు మద్రాస్ రాష్ట్రానికి మధ్య కేసులో న్యాయమూర్తి ఫజల్ అలీ, ఖడక్ సింగ్ కు పంజాబ్ కు మధ్య కేసులో న్యామూర్తి కోకా సుబ్బా రావు, ఎ.డి.ఎం. జబల్పూర్ కు శివకాంత్ శుక్లా మధ్య కేసులో న్యాయమూర్తి హెచ్.ఆర్. ఖన్నా అసమ్మతి తీర్పులు వెలువరించిన వారే. ఈ ముగ్గురు గొప్ప భిన్నాభిప్రాయాలుగల వారు అని న్యాయమూర్తి రోహింటన్ ఫాలీ నారిమన్ వ్యాఖ్యానించారు. న్యాయమూర్తి చంద్రచూడ్ భిన్నాభిప్రాయం కూడా ఈ అగ్రశ్రేణి భిన్నాభిప్రాయాల్లో చేరుతుందా? తాజాగా ఆధార్ కేసులో అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పనే లేదు కనక ఆ అవకాశం లేకపోలేదు.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

First Published:  4 Oct 2018 8:15 PM GMT
Next Story