తన లొసుగులు బయటకు రాకుండా…. కృత్రిమ సానుభూతే లక్ష్యంగా…. బాబు?

(ఎస్. విశ్వేశ్వర రావు)

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు విచిత్రంగా మారిపోయాయి. జగన్‌ అవినీతి పరుడంటూ ఆరోపించిన తెలుగుదేశం అతనిపై మాత్రం సీబీఐ, ఐటి, ఈడి తదితర దర్యాప్తు సంస్థలు నేరుగా రంగంలోకి దిగిపోయి అతన్ని నిందితునిగా ఖరారు చేసి శిక్షలు వేసేయ్యాలి. ఇది టిడిపి వారి డిమాండ్‌. ఆ విధంగా జరగటం చట్టం తన పని తాను చేసుకోవటం క్రింద వారి ఉవాచ.

అదే పరిస్థితి తమ వారికి (టిడిపి) ఎదురు కాకూడదు. టిడిపి వారిపై ఆరోపణలు వచ్చినా, నిజంగానే వారు అక్రమాలకు పాల్పడినా దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకోకూడదు. అక్రమ సంపాదనపై దర్యాప్తు అలా ఉంచితే కనీసం ఐటి సంస్థ ఆదాయానికి మించిన ఆస్తులపై తనఖీలు చేసినా, నోటీసులు ఇచ్చినా అది వేధింపుల కిందకు వస్తుంది వాళ్ళ లెక్కలో. కోట్లలో వ్యాపారాలు చేస్తున్న సంస్థలు ప్రతిఏటా వ్యాపారం- పన్ను చెల్లింపులకు సంబంధించి రిటన్స్‌ దాఖలు చేయలేకపోతే అటువంటి సందర్భాల్లో తనిఖీలు చేయటం కూడా చట్ట విరుద్ధం అవుతుంది వాళ్ళ దృష్టిలో.

జగన్‌ లేదా తమకు నచ్చని వారి పట్ల ఓ విధమైన వైఖరి, తాము, తమ వారి పట్ల మరోవైఖరి ప్రదర్శించాలనేది తెలుగుదేశం ప్రత్యేక మార్కుగా కనిపిస్తోంది. ఇందులో ప్రభుత్వ యంత్రాంగం సైతం ఇమిడిపోవడం మరో విచిత్రం. ఐటి యంత్రాంగం తనిఖీలు నిర్వహించినప్పుడు (జర్నలిజం భాషలో దాడులుగా చెప్పుకుంటారు) అధికారులకు రక్షణ కోసం స్థానిక పోలీసులను వినియోగించుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఐటి అధికారులు తనిఖీలు చేస్తే ఆ సమయంలో రక్షణగా పోలీసులు ఉండాల్సిన పనిలేదని క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయించడం అందుకు అధికార యంత్రాంగం కూడా తలూపడం చూస్తుంటే పార్టీకి, ప్రభుత్వానికి సున్నితమైన గీత చెరిగిపోయి ప్రభుత్వ యంత్రాంగమే పార్టీ యంత్రాంగంగా మారిపోయిన తీరు విస్తు కలిగిస్తోంది.

చంద్రబాబు, ఆయన మంత్రులు, పార్టీ నాయకులు ప్రభుత్వానికి, పార్టీకి మధ్య ఎప్పుడో తేడాలేకుండా చేసేశారు. మరీ ముఖ్యంగా పోలీసు వ్యవస్థను పార్టీ వ్యవస్థలాగా వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వమే తమ పార్టీదన్నట్లు వ్యవహరించడం ఏ స్థాయికి వెళ్ళిందంటే…. నిన్న మంత్రి వర్గ సమావేశంలో మంత్రులు…. మన పోలీసులను భద్రతకోసం ఉపయోగించుకుంటూ మనవారికి చెందిన సంస్థలపై దాడులు చేయడం ఏమిటని మంత్రులే ప్రశ్నించడం చూస్తుంటే…. ప్రభుత్వమంటే మన పార్టీదే అనే నమ్మకం ఎంత బలంగా వాళ్ళలో ఉందో తెలుస్తోంది. మంత్రులే ఇలా ఉంటే ముఖ్యమంత్రి మరో రెండు ఆకులు ఎక్కువ చదివినట్లు ఉన్నాడు. వాళ్ళు మనవాళ్ళమీద దాడులు చేస్తున్నట్లే…. మన ఏసీబీ చేత కేంద్రప్రభుత్వ సంస్థలు, అధికారులపై దాడిచేసే వీలు ఉందా? అని అడగడం చూస్తుంటే చంద్రబాబు అధికార అహం ఏ స్థాయికి చేరిందో తెలుస్తోంది.

గత మూడు రోజులుగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఐటి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని ఈ కసరత్తు సాగుతోంది. అందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు కూడా ఉన్నారు. కానీ అత్యధికులు రియల్‌ఎస్టేట్‌, బిల్డర్లు కావడం తెలిసిందే.

గురువారం నెల్లూరులో తనిఖీలు ప్రారంభమైనప్పటి నుంచి తెలుగుదేశం మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు హడావుడి చేయడం ప్రారంభించారు. శుక్రవారం అది తారాస్థాయికి చేరుకుంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాని మోడి ఆంధ్రప్రదేశ్‌పై కక్షగట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించినవారిపై ఐటి దాడులు చేయిస్తున్నారని ఆరోపణలకు దిగారు.

దీనిని బట్టి తెలుగుదేశం పార్టీ వారంతా ఆ విధమైన అక్రమ వ్యాపారాలను అధికారం అండతో సాగిస్తున్నారని పరోక్షంగా టిడిపి అంగీకరించినట్లయింది. బిల్డర్లు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులందరూ ఏపిలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారేనా? దేశం నాయకులే వారి ముసుగులో బినామీ వ్యాపారాలు చేస్తున్నారా? ఇలాంటి అనుమానాలన్ని చంద్రబాబు స్పందనను బట్టి వ్యక్తమవుతున్నాయి.

రాజ్యాంగ హోదాలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు చట్టం తన పని తాను చేసుకుపోనివ్వాలి. కానీ ఏపిలో అందుకు విరుద్ధమైన పరిస్థితి ఉంది. గతంలో చంద్రబాబుపై అనేక ఆరోపణలు వచ్చినప్పుడు, దర్యాప్తు సాగినప్పుడు చాలా కేసుల్లో కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకున్నారు.

ఓటుకు నోటు కేసులో ఆయన ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వ సహకారం వల్ల ఆ కేసు నీరుగారిపోయేట్లు చేసుకోగలిగారు. పోలవరం, అమరావతి నిర్మాణ పనులు మొదలైన వాటిలో చంద్రబాబు, తెలుగుదేశం పరివారంపై అనేక ఆరోపణలు వచ్చాయి. కానీ వాటిపై ఎక్కడా దర్యాప్తు ఎప్పుడూ జరగలేదు. నాలుగేళ్ళపాటు కేంద్రంలోని ఎన్డీయే, ప్రధాని మోడితో కలిసి ఉన్నంత కాలం ఆయనకు అంతా సజావుగానే సాగింది.

ఎన్డీయే నుంచి తెలుగుదేశం బయటకు వచ్చిన తర్వాత ఏపిపై కేంద్రం కక్ష గట్టిందనేది ఆయన ఆరోపణ. నిజానికి చంద్రబాబుపై మోడి కక్షగట్టి ఉంటే అనేక అంశాల్లో కేంద్రం సులభంగానే జోక్యం చేసుకొని ఇరకాటంలో పెట్టవచ్చు. పోలవరం ప్రాజెక్ట్‌ కేంద్రం నిధులతో అమలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ పనుల్లో ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అవసరమైతే దర్యాప్తునకు ఆదేశించే అధికారం కేంద్రానికి ఉంటుంది. కానీ ఎక్కడా అటువంటి వాసనే లేదు. అంటే చంద్రబాబును మోడి ఏమాత్రం పట్టించుకోవడం లేదో, లేదా తీవ్రంగా పరిగణించడం లేదో లేక లోపాయికారిగా అనుబంధం కొనసాగుతుందోగానీ అందుకే ఏ విషయంలోనూ చంద్రబాబు పై విచారణ జరగడం లేదు. ఇలా ఆరోపణలు ఉన్న అంశాలు, కోర్టుల్లో ఉన్న ఆరోపణలు ఆఖరికి ఓటుకు నోటు కేసులోనూ ఎటువంటి కదలికా లేదు.

పరిస్థితి ఇలా ఉంటే ప్రతి చిన్న అంశంలోనూ కేంద్రం ఏపిపై కక్షగట్టి వేదిస్తోందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. రెండురోజుల పాటు జరిగిన ఐటి తనిఖీల్లో ఎక్కడా కూడా తెలుగుదేశం ముఖ్యనేతల ఇళ్లల్లోకి లేదా వారి వ్యాపార కార్యకలాపాల్లో ఐటీ తనిఖీలు చేయనే లేదు.

కర్నాటకలో కాంగ్రెస్‌ నేతలు ముఖ్యంగా శివకుమార్‌ ను, అదే విధంగా ఇతర రాష్ట్రాల్లోనూ ప్రత్యర్థులను వేధించటానికి ఐటి, ఈడి తదిరత దర్యాప్తు సంస్థలను కేంద్రం ఏ విధంగా ఉపయోగించుకుంటుందో చూస్తూనే ఉన్నాం. కానీ ఏపిలో అటువంటి ప్రయత్నమే లేదు. అయినా చంద్రబాబు వ్యతిరేక ఆపరేషన్‌ జరుగుతోందంటూ ఆయనపై ఈగ వాలనివ్వని మీడియా యాగి చేస్తోంది. అదే సమయంలో చంద్రబాబు బయపడుతున్నట్లున్నారు. ప్రతీ చిన్న అంశాన్ని తన మీద కాకుండా ఏపి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా కక్ష గట్టి దాడిచేస్తోందని ప్రచారం సాగిస్తున్నారు.

ఏపిలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ వైఫల్యాల వల్ల ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురుకాకుండా తప్పించుకునేందుకు సానుభూతి ప్రచారాన్ని రంగంలోకి దింపి లబ్ధిపొందాలనే వ్యూహం కనిపిస్తోంది. ఎన్డీయే ఎటువంటి అస్త్రాలు ప్రయోగించకపోయినప్పటికీ తననే లక్ష్యంగా చేసుకుని ఏపి ప్రతిష్టతను దెబ్బతీసేవిధంగా ప్రజలపై కుట్ర సాగుతుందంటూ సానుభూతి సాధించుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.

ఎన్నికలప్పుడు తప్ప ఇంకెప్పుడూ రాజకీయాలు మాట్లాడరాదంటూ చెప్పే ఆయన ప్రతిరోజూ రాజకీయాలే మాట్లాడుతూ కేంద్రం మరీ ముఖ్యంగా మోడీపై రాష్ట్ర ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకుని రాజకీయంగా లబ్ధిపొందటానికి సానుభూతి ఎత్తుగడలే ప్రధానంగా పరిపాలన సాగిస్తున్నారు.