Telugu Global
NEWS

కేసీఆర్ ఓకే.... కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులు వేస్ట్‌.... నిరసన సెగలు

కారు రివర్స్ అవుతోంది. కేసీఆర్ ఆశించిన దానికి వ్యతిరేకంగా జరుగుతోంది. క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ అభ్యర్థులకు నిరసన సెగ తగులుతోంది. గడిచిన నాలుగున్నరేళ్ళలో ఏం చేయలేదంటూ ఆయా గ్రామాలు, పట్టణాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను నిలదీస్తున్నారు. ఒక్క చోట కాదు.. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో తాజాగా గులాబీ అభ్యర్థులకు మీకు ఓటు అడిగే హక్కు లేదంటూ స్థానికులు నిలదీస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి మొత్తం 105 మంది అభ్యర్థులను ప్రకటించేశారు. ఇందులో అంతా తాజా మాజీలే…. […]

కేసీఆర్ ఓకే.... కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులు వేస్ట్‌.... నిరసన సెగలు
X

కారు రివర్స్ అవుతోంది. కేసీఆర్ ఆశించిన దానికి వ్యతిరేకంగా జరుగుతోంది. క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ అభ్యర్థులకు నిరసన సెగ తగులుతోంది. గడిచిన నాలుగున్నరేళ్ళలో ఏం చేయలేదంటూ ఆయా గ్రామాలు, పట్టణాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను నిలదీస్తున్నారు. ఒక్క చోట కాదు.. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో తాజాగా గులాబీ అభ్యర్థులకు మీకు ఓటు అడిగే హక్కు లేదంటూ స్థానికులు నిలదీస్తున్నారు.

కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి మొత్తం 105 మంది అభ్యర్థులను ప్రకటించేశారు. ఇందులో అంతా తాజా మాజీలే…. ఇద్దరు సిట్టింగ్ లకు మాత్రమే టికెట్ నిరాకరించారు. ఎంతో మంది వివాదాస్పద ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఇచ్చారు. నియోజకవర్గంలో సరిగ్గా పనిచేయలేదని…. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కూడా కొనసాగించారు. ఇప్పుడిదే టీఆర్ఎస్ పార్టీకి గుదిబండగా మారింది.

తాజాగా వరంగల్ అర్భన్ జిల్లాలోని వర్ధన్నపేట టీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్ కు నిరసన సెగ తగిలింది. నాలుగున్నరేళ్లలో మా ఊరుకు ఏం చేశావంటూ బాలాజీ నగర్ వాసులు ఆయన్ను నిలదీశారు. అంతేకాదు ‘గోబ్యాక్’ అనే ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ పెద్దసంఖ్యలో ప్రదర్శనగా ర్యాలీ తీశారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పాఠశాల అభివృద్ధి, ఫ్లోరైడ్ సమస్య ఉన్నా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. దీంతో ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ ఆర్థాంతరంగా వెళ్లిపోయారు.

ఇక పెద్దపల్లి తాజామాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ నేత దాసరి మనోహర్ రెడ్డిని సైతం జూలపల్లి మండల వాసులు అడ్డుకున్నారు. అభివృద్ధి చేయలేదని నిలదీశారు. హుస్నాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సతీష్ కుమార్ ను ఏకంగా ఆయన జీపును ఆపి మరీ మీరు మా ఊరుకు ఏం చేయలేదంటూ హుస్నాబాద్ మండలంలోని మారుమూల తెనుగుపల్లి వాసులు నిలదీశారు. ఇక జనగాం, పాలకుర్తి, మానకొండూర్, రామగుండం , ఆదిలాబాద్, నిర్మల్ నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులను ఆయా గ్రామాల వాసులు నిలదీస్తున్నారు.

ఇలా తాజా మాజీ ఎమ్మెల్యేల్లో పనులు చేయని వారికి టికెట్లు ఇచ్చి కేసీఆర్ ఇప్పుడు ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులను ఎక్కడికక్కడ నిలదీస్తూ స్థానికులు హడలెత్తిస్తున్నారు. కేసీఆర్ బొమ్మ చూసి ఓట్లు పడుతాయని భావిస్తుంటే… స్థానిక అభ్యర్థుల వల్లే టీఆర్ఎస్ కు ఎక్కువ మైనస్ అయ్యేలా కనిపిస్తోందని టీఆర్ఎస్ పెద్దలు ఆందోళన చెందుతున్నారు.

First Published:  8 Oct 2018 12:41 AM GMT
Next Story