Telugu Global
Family

అహం

బొఖారా ప్రాంత రాజయిన షాయిబ్రహీం విలాసవంతమయిన జీవితం గడిపేవాడు. మెత్తటి పరుపుపై పరిమళాలు వెదజల్లే పూలు చల్లి వాటిపై నిద్రించేవాడు. కానీ అతను సత్యాన్వేషి. దైవం గురించి చింతించేవాడు. సాథు సన్యాసుల్ని ఆహ్వానించేవాడు.           ఒకరోజు పడుకోబోతూవుంటే తన మేడపై ఎవరో తిరుగుతున్నట్లు తెలిసి వాళ్ళను పిలిపించాడు. ఎందుకిక్కడ తిరుగుతున్నారన్నాడు. “మా ఒంటెలు తప్పిపోయాయి. అందుకని వెతుకుతున్నా”మన్నారు. “మీ ఒంటెలు తప్పిపోతే అవి నా మేడపైకి ఎలావస్తాయి?” అన్నాడు రాజు. “మీరు  పూల పాన్పు మీద పడుకుంటే […]

బొఖారా ప్రాంత రాజయిన షాయిబ్రహీం విలాసవంతమయిన జీవితం గడిపేవాడు. మెత్తటి పరుపుపై పరిమళాలు వెదజల్లే పూలు చల్లి వాటిపై నిద్రించేవాడు. కానీ అతను సత్యాన్వేషి. దైవం గురించి చింతించేవాడు. సాథు సన్యాసుల్ని ఆహ్వానించేవాడు.

ఒకరోజు పడుకోబోతూవుంటే తన మేడపై ఎవరో తిరుగుతున్నట్లు తెలిసి వాళ్ళను పిలిపించాడు. ఎందుకిక్కడ తిరుగుతున్నారన్నాడు. “మా ఒంటెలు తప్పిపోయాయి. అందుకని వెతుకుతున్నా”మన్నారు. “మీ ఒంటెలు తప్పిపోతే అవి నా మేడపైకి ఎలావస్తాయి?” అన్నాడు రాజు. “మీరు పూల పాన్పు మీద పడుకుంటే సత్యం మీకు అవగాహన కాదు” అన్నారు వాళ్ళు.

ఆ మాటల్తో ఆశ్చర్యపడిన రాజు “మరి మార్గమేమిటి?” అన్నాడు. వాళ్ళు “కాశీలో కభీరన్న సాథువు వుంటాడు. ఆయన జ్ఞాని. ఆయన శిష్యరికం చేస్తే మీకు సత్యమంటే ఏమిటో బోథ పడుతుంది” అన్నాడు.

ఇబ్రహీం రాజ్యం వదిలి కాశీ చేరాడు. కబీర్‌ దగ్గరికి వెళ్ళి తనని శిష్యుడిగా స్వీకరించి జ్ఞానబోథ చెయ్యమన్నాడు. కబీరు “నేను మగ్గం నేసుకుని బతికే మామూలు మనిషిని. ఐశ్వర్య వంతుడయిన రాజు నీవు. నీకూ నాకూ పొసగదు” అన్నాడు.

రాజు “అయ్యా! నేను అన్నీ త్యజించి మీకు సేవచేసి తరించడానికి వచ్చాను. దయచేసి నన్ను శిష్యుడిగా స్వీకరించండి” అన్నాడు.

కబీరు ఆలోచించి “సరే” నన్నాడు. రాజు సేవకుడయ్యాడు. కబీరు చెప్పిన పనులు చేస్తూ ఐదేళ్ళు గడిపాడు. పెదవి విప్పి వ్యతి రేకమయిన పని కూడా చేస్తానన లేదు. గురు శుశ్రూషలో గడిపాడు. కబీరు భార్య “ఐదేళ్ళుగా రాజు మీ సేవలో వున్నాడు. ఆయనకు మీరు జ్ఞానబోధ చెయ్యండి” అంది. కబీరు “కానీ దానికి తగిన పరిణితి అతనికి యింకా రాలేదు” అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయి “మీరు ఎట్లా చెప్పగలరు?” అంది. కబీరు “కావాలంటే పరీక్షిద్దాం. నువ్వు మేడమీదకు వెళ్ళి చెత్తవూడ్చి అతను ఇంట్లో నించి బయటకు వెళ్ళేటప్పుడు అతనిమీద పడేట్లు వేసి చూడు” అన్నాడు.

కబీరు భార్య భర్త చెప్పినట్లే రాజు ఇంటి నించీ బయటకు వెళుతూవుంటే చెత్త అతనిపై వేసింది. రాజు తలెత్తి చూసి “నా తలపై కిరీటముంటే ఇలా జరిగేదా?” అన్నాడు. కబీరు భార్య జరిగిన సంగతి భర్తతో చెప్పింది. కబీరు “చూశావా? నేను అన్నఅహం అతనిలో ఇంకావుంది” అన్నాడు.

రాజు కబీరు సేవలో మరో ఐదేళ్ళు గడిపాడు. మొత్తానికి పది సంవత్సరాలు గడిచిపోయాయి. కబీరు భార్యతో “ఇప్పుడు అతన్ని పరీక్షించే సమయం వచ్చింది. ఇప్పుడు కూడా నువ్వు మేడపై నించీ అతనిపై చెత్తపడేటట్లు చేసి చూడు” అన్నాడు.

భర్త చెప్పినట్లే ఆమె మేడపై నించీ రాజుపై పడేటట్లు చెత్త వేసింది. రాజు తలెత్తి చూసి చేతులు జోడించి “అమ్మా! సరయిన పని చేశావు. నా శరీరం, మనసు చెత్తలాంటివే. దానిలో భాగాలే” అన్నాడు.

జరిగిన సంగతి భర్తకు చెప్పింది. కబీరు ఎంతో సంతోషంతో “అతనిలో అహం సంపూర్తిగా అంతరించింది. పరిణితి ఏర్పడింది” అని రాజును పిలిచి “ఇన్నేళ్ళ శ్రమ ఫలించింది. ఇప్పుడు వెళ్ళి రాజ్యాన్ని పాలించు. కిరీటం ధరించినా, కుటీరంలో వున్నా అహం నిన్నేమీ అంటదు” అని రాజును పంపేశాడు.

-సౌభాగ్య

First Published:  8 Oct 2018 7:16 PM GMT
Next Story