టికెట్‌ దొరికినప్పటి నుంచి కార్యకర్తలు పీల్చేస్తున్నారు

టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రచార ఖర్చు కుంగదీస్తోంది. ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉండటంతో అంత భారాన్ని మోసేదెలా అంటూ తెగ మదనపడిపోతున్నారు. ఒకవైపు భారీగా ప్రచారం నిర్వహిస్తూనే, మరోవైపు భారీ ఎత్తున ఖర్చు మీద పడుతోందని లబోదిబోమంటున్నారు. ఖర్చులను భరించలేక గెలిచిన తరువాత ఏ పనైనా చేయించుకోమని ఆఫర్లు, హామీలు ఇచ్చేస్తున్నారట.

గులాబీ బాస్ కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు అసెంబ్లీని సెప్టెంబరు 6న రద్దు చేశారు. అంతా అనుకున్నట్లు జరిగితే అక్టోబరు చివరిలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వస్తుందని, నవంబరులో ఎన్నికలు జరుగుతాయని భావించారు. కానీ, ఆ ఆశలకు ఎన్నికల కమిషన్ నీళ్లు చల్లింది. అనూహ్యంగా తేదీలను మార్పు చేస్తూ ప్రకటన చేసింది. డిసెంబర్‌లో ఎన్నికలు ఉంటాయని అంది. దాంతో ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది.

ఎన్నికల ప్రచారం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. రోజువారీ ఖర్చు లక్షల్లో ఉంటుంది. భోజనాలు, మందు, డబ్బు పంపకం తప్పనిసరిగా మారింది. ఈ లెక్కన చూసుకుంటే రెండు నెలలకు అయ్యే ప్రచార ఖర్చు కోట్లకు చేరుతుంది. ఆ మేరకు నిధులను రాబట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు టీఆర్ఎస్ అభ్యర్థులు. అసెంబ్లీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన రోజే కేసీఆర్ 105 మందిని ప్రకటించేశారు. అంటే వారు గత నెల నుంచే ప్రచారంలో ఉన్నారు.

మరోవైపు మహా కూటమి అభ్యర్థుల ప్రకటన ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఎన్నికలకు బాగా సమయం ఇవ్వడంతో ఎన్నికల కమిషన్ ప్రకటనపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలకు ఖర్చుల విషయంలో కొంత వెసులుబాటు లభించింది. ప్రస్తుతం ఆయా పార్టీల నుంచి టిక్కెట్లు ఆశిస్తున్న నేతలకు టిక్కెట్ల కేటాయింపు జరగలేదు. అందుకే ఇంకా వీళ్ళకు ఖర్చులు మొదలవ్వలేదు.

మరోవైపు ఎలక్షన్ కమిషన్ అభ్యర్థుల ఖర్చుపై దృష్టి సారించింది. ఏది ఏమైనా ముందస్తు ఎన్నికలు టీఆర్ఎస్ కు పెద్ద తలనొప్పులు తెచ్చి పెట్టేలా ఉన్నాయి. అనుకున్నది ఒక్కటైతే మరొకటి జరుగుతుండటంతో ఆ పార్టీ నేతలు కూడా అయోమయంలో పడిపోయారు.