పత్తి చేనులో మృతదేహం… ప్రేమ వ్యవహారమే కారణమా?

మిర్యాల గూడ ప్రణయ్ పరువు హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. అనంతరం ఎర్రగడ్డలో తక్కువ కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందని సొంత కూతురి మీదే కత్తితో దాడి చేశాడో తండ్రి. ఈ ఘటనలను మరువకముందే కరీంనగర్ లో ఈ మధ్యాహ్నం మరో పరువు హత్య కలకలం రేపింది.

కరీంనగర్ జిల్లా తాడికల్ కు చెందిన గడ్డి కుమార్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తాడికల్ శివారు వంకాయగూడెం గ్రామం వద్ద పత్తి చేనులో అతడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.

గడ్డి కుమార్…. కొద్దిరోజులుగా ఓ యువతితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. వారిద్దరూ సినిమాలు, షికార్లు అంటూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ యువతి కుటుంబీకులే తమ కుమారుడిని హత్య చేశారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

కుమార్ హత్య విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపైకి చేరుకొని ఆందోళన చేశారు. పోలీసుల వాహనాలపై దాడి చేసి అద్దాలు పగలకొట్టారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు సర్ది చెప్పినా విన లేదు. రాష్ట్ర రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు ఆగిపోయాయి.