సీటు గల్లంతు…. బండ్లకు షాక్‌ ఇచ్చిన కాంగ్రెస్

తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ తరపున బండ్ల గణేష్ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఇంటర్వ్యూలు ఇస్తూ వందకు పైగా సీట్లు గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌ పేరులో ఆరు అనే శబ్దం ఉంటుందని కాబట్టి కేసీఆర్‌కు ఆరు సీట్లు, కేటీఆర్‌కు ఆరు సీట్లు చొప్పున టీఆర్‌ఎస్‌కు 12 సీట్లు వస్తాయంటూ వ్యాఖ్యలు చేశారు.

సీటు ఖాయం చేసుకున్న తర్వాతే ఆయన కాంగ్రెస్‌లో చేరినట్టు చెబుతూ వచ్చారు. షాద్‌నగర్ టికెట్ ఇస్తారన్న హామీతోనే బండ్ల గణేష్‌ కాంగ్రెస్‌లో చేరినట్టు వార్తలొచ్చాయి. తాను పుట్టి పెరిగిన షాద్‌నగర్‌లో అయితే ఓట్లు పడతాయని ఆశగా ఎదురుచూశారు బండ్ల గణేష్‌. అయితే 34 మందితో కాంగ్రెస్‌ తొలి జాబితా బయటకు వచ్చింది. ఇందులో షాద్‌నగర్‌ టికెట్‌ను చౌలపల్లి ప్రతాప్‌ రెడ్డికి ఇచ్చేశారు.

2009లో షాద్ నగర్‌ నుంచి గెలిచిన ప్రతాప్ రెడ్డి… 2014లో మాత్రం టీఆర్‌ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ ఆయనకున్న పట్టును దృష్టిలో ఉంచుకుని మరోసారి ప్రతాప్‌ రెడ్డికే టికెట్‌ కేటాయించింది కాంగ్రెస్‌. దీంతో బండ్ల గణేష్‌ ఆశలపై బండ పడినంత పని అయింది.

పరిస్థితి చూస్తుంటే అసలు బండ్ల గణేష్‌కు టికెట్‌ వస్తుందా? రాదా? అన్న అనుమానాన్ని కూడా పలువురు వ్యక్తం చేశారు. షాద్‌నగర్ సీటు ప్రతాప్‌ రెడ్డికి ఇచ్చేసిన నేపథ్యంలో మరొక చోట ఆయనకు టికెట్ ఇస్తారా? ఇస్తే పోటీ చేస్తారా? అసలు పోటీ చేసి గెలుస్తారా? అన్నది చూడాలి.