Telugu Global
NEWS

రంగంలోకి బేరగాళ్లు.... చెట్టు పేరు చెప్పి కాయలమ్ముతున్నారు....

చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటున్నారు. మా కులపోళ్ల ఓట్లు వేయిస్తామంటూ ఎన్నికల కార్యక్షేత్రంలో ఎమ్మెల్యే అభ్యర్థులను ఊరిస్తున్నారు. మా ఊరంతా నా చేతిలోనే ఉంది అని ఊరడిస్తున్నారు. మహిళలకు నేను ఎంత చెబితే అంతా అని ఇంకొందరు వస్తున్నారు. ఇలా ఆయా కులాలకు, వర్గాలకు, వాడలకు, గ్రామాలకు ప్రతినిధులుగా చెప్పుకుంటూ కొందరు రాజకీయ దళారులు తెలంగాణ రాజకీయ వేడిని క్యాష్ చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేల అభ్యర్థులు, ఆశావహుల ఇళ్లు, కార్యాలయాల్లో వాలిపోయి గంపగుత్తగా ఓట్ల పేరిట గ్రామ, పట్టణ […]

రంగంలోకి బేరగాళ్లు.... చెట్టు పేరు చెప్పి కాయలమ్ముతున్నారు....
X

చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటున్నారు. మా కులపోళ్ల ఓట్లు వేయిస్తామంటూ ఎన్నికల కార్యక్షేత్రంలో ఎమ్మెల్యే అభ్యర్థులను ఊరిస్తున్నారు. మా ఊరంతా నా చేతిలోనే ఉంది అని ఊరడిస్తున్నారు. మహిళలకు నేను ఎంత చెబితే అంతా అని ఇంకొందరు వస్తున్నారు. ఇలా ఆయా కులాలకు, వర్గాలకు, వాడలకు, గ్రామాలకు ప్రతినిధులుగా చెప్పుకుంటూ కొందరు రాజకీయ దళారులు తెలంగాణ రాజకీయ వేడిని క్యాష్ చేసుకుంటున్నారు.

ఎమ్మెల్యేల అభ్యర్థులు, ఆశావహుల ఇళ్లు, కార్యాలయాల్లో వాలిపోయి గంపగుత్తగా ఓట్ల పేరిట గ్రామ, పట్టణ నాయకులు అందినంత దండు కుంటున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి వారిని ఏమీ అనలేకపోతున్న నేతలు… సన్నిహితుల వద్ద మాత్రం తమ చేతి చమురు వదులుతోందని గోడు వెళ్ళబోసుకుంటున్నారు.

ముందస్తు ఎన్నికల్లో రాజకీయ బేరగాళ్లు తెలంగాణ వ్యాప్తంగా రంగంలోకి దిగారు. తమకు ఓటు బ్యాంకు ఉందని నమ్మిస్తూ అభ్యర్థులు, ఆశావహుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్, బీఎల్ఎఫ్ అభ్యర్థుల నుంచి మంచిర్యాల, కరీంనగర్, సిరిసిల్ల, వరంగల్ ఉమ్మడి జిల్లా, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు.

ఈ మధ్య మంత్రి కేటీఆర్, వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు…. ఇలాంటి వాళ్ళను హైదరాబాద్ పిలిపించి మరీ ‘సంతృప్తి’ పరిచినట్టు ప్రచారం జరిగింది. డబ్బులు, కార్లు ఇచ్చినట్టు వార్తలొచ్చాయి. దాంతోపాటు కమ్యూనిటీ హాల్స్ కట్టించడం… యువతకు క్రికెట్ కిట్లు, మహిళలకు చీరలు తదితర వాటిని అడిగి మరీ రాజకీయ బేరగాళ్లు తీసుకుంటున్నారు. కుల , వర్గ, గ్రామ ప్రతినిధులుగా చెప్పుకుంటూ గుంపులు, గుంపులుగా వచ్చి ఎడాపెడా ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శ వినిపిస్తోంది. ఓట్ల కోసం ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా అడిగినంత ఇవ్వక తప్పడం లేదట..

తాజాగా పార్టీల పేరు చెప్పి వసూళ్లు చేస్తున్న వారిపై ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టినట్లు సమాచారం. అనుమానమున్న వ్యక్తుల ఫేస్ బుక్, వాట్సాప్ ఖాతాలపైన దృష్టిసారించినట్లు తెలిసింది. హోటళ్ళు, బార్ లు, ఆశావహులు, అభ్యర్థుల గృహాల వద్ద మోహరించి ఎవరెవరు వచ్చి వెళ్తున్నారో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఇలా ఎన్నికల వేళ రాజకీయ బేరగాళ్లు కూడా ఇదో బిజినెస్ గా మార్చి అందినకాడికి దోచుకుంటున్నారు. అయినా రాజకీయ నేతలతో పోల్చుకుంటే వీరు వసూలు చేసేది తక్కువే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

First Published:  9 Oct 2018 7:20 PM GMT
Next Story