హైదరాబాద్ టెస్ట్ టికెట్ ధర రోజుకు 100 రూపాయలు

  • రాజీవ్ స్టేడియం వేదికగా విండీస్ తో తొలిసారిగా టెస్ట్
  • హైదరాబాద్ క్రికెట్ అడ్డా రాజీవ్ స్టేడియం
  • 2010 నుంచి 2017 వరకూ రాజీవ్ స్టేడియంలో నాలుగు టెస్టులు

టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ భారత్ లో…డజన్ల కొద్దీ టెస్ట్ వేదికలు ఉన్నా…దేని ప్రత్యేకత దానిదే. అలాంటి అత్యాధునిక వేదికల్లో హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ప్రముఖంగా కనిపిస్తుంది.

2004లో హైదరాబాద్ క్రికెట్ సంఘం సొంతంగా నిర్మించుకొన్న రాజీవ్ స్టేడియం… టీమిండియా-విండీస్ ఆఖరి టెస్ట్ మ్యాచ్ కు ఆతిథ్యమివ్వటానికి ముస్తాబయ్యింది.

హైదరాబాద్ క్రికెట్ ప్రధాన కేంద్రం….

ప్రపంచంలోనే జనాభాపరంగా రెండో అతిపెద్ద దేశం భారత్ లో క్రికెట్టే…. నంబర్ వన్ గేమ్. ఏటా టెస్ట్, వన్డే సిరీస్ లతో పాటు…. ఐపీఎల్, టీ-20 మ్యాచ్ లు సైతం జరుగుతూనే ఉంటాయి.

దేశవ్యాప్తంగా… బీసీసీఐకి అనుబంధంగా ఉన్న 29 క్రికెట్ సంఘాలకు క్రికెట్ వేదికలు, స్టేడియాలు ఉన్నాయి. అయితే సొంత క్రికెట్ స్టేడియాలు నిర్మించుకొన్న అతికొద్ది క్రికెట్ సంఘాలలో హైదరాబాద్ క్రికెట్ సంఘం కూడా ఉంది.                     

హైదరాబాద్ లో క్రికెట్ అనగానే 2004కు ముందు వరకూ… నగరం నడిబొడ్డునే ఉన్న లాల్ బహదూర్ స్టేడియం మాత్రమే గుర్తుకు వచ్చేది.

2004 నుంచే రాజీవ్ స్టేడియం….

అయితే…హైదరాబాద్ క్రికెట్ సంఘం…దాదాపు 50 కోట్ల రూపాయల వ్యయంతో…నగరశివారులోని ఉప్పల్ లో …సొంతంగానే ఓ అత్యాధునిక స్టేడియాన్ని నిర్మించుకొని… అంతర్జాతీయ మ్యాచ్ లకు ఆతిథ్యమిస్తూ…భారత ప్రధాన టెస్ట్ వేదికల్లో ఒకటిగా నిలిచింది.

39వేల సీటింగ్ సామర్థ్యంతో నిర్మించిన ఈ స్టేడియం 2004 నుంచి అందుబాటులోకి వచ్చింది. 2005 నవంబర్ 16న తొలిసారిగా వన్డేకి ఆతిథ్యమిచ్చింది.

2010లో తొలిసారిగా టెస్ట్ మ్యాచ్….

ఆ తర్వాత…ఐదురోజుల టెస్ట్ మ్యాచ్ కు ఆతిథ్యమివ్వడం కోసం…. మరో ఐదేళ్ల పాటు వేచిచూడాల్సి వచ్చింది. 2010లో తొలిసారిగా టెస్ట్ మ్యాచ్ కు వేదికగా నిలిచిన రాజీవ్ స్టేడియం 2017 అక్టోబర్ లో తొలిసారిగా టీ-20 మ్యాచ్ కు ఆతిథ్యమిచ్చింది.

2010 నుంచి 2017 వరకూ రాజీవ్ స్టేడియంలో నాలుగు టెస్టులు జరిగితే…. ఓ మ్యాచ్ డ్రాగా ముగిస్తే… మిగిలిన మూడుటెస్టుల్లో ఆతిథ్య టీమిండియా భారీ విజయాలు నమోదు చేసింది.

అంతేకాదు…హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్ ల్లో ఎక్కువభాగం మొదటి నాలుగు రోజుల్లోనే ముగియటం విశేషం.

పరుగుల గని…. స్పిన్నర్ల స్వర్గం….

రాజీవ్ స్టేడియం వికెట్ కు… పరుగుల గని, స్పిన్నర్ల అడ్డాగా పేరుంది. రాజీవ్ స్టేడియం పిచ్ పై జరిగిన గత 4 టెస్టుల్లో పేసర్లు 37, స్పిన్నర్లు 75 వికెట్లు సాధించడం చూస్తే…ఇది ఏస్థాయి వికెట్లో మనకు అర్థమవుతుంది.

వెస్టిండీస్ తో జరుగుతున్న ప్రస్తుత రెండుమ్యాచ్ ల సిరీస్ లోని ఆఖరి టెస్టు కు సైతం రాజీవ్ స్టేడియం వేదికగా నిలిచింది.

అక్టోబర్ 12 నుంచి ఐదురోజులపాటు జరిగే ఈమ్యాచ్ కోసం …హైదరాబాద్ క్రికెట్ సంఘం విస్త్రృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది.

అంతేకాదు… జంట నగరాలలోని వివిధ విద్యాలయాలకు చెందిన విద్యార్థులకు… రోజుకు 4వేల మందికి చొప్పున ఉచిత ప్రవేశం కల్పించాలని నిర్ణయించారు.

టికెట్ ధర ఐదురోజులకూ 300 రూపాయలు….

రాజీవ్ స్టేడియంలో 39వేల సీటింగ్ సామర్థ్యం ఉంటే…. ఇందులో పదిశాతం టికెట్లను HCA అనుబంధ సంఘాలు, పోలీసు, ప్రభుత్వశాఖలకు…. కాంప్లిమెంటరీలుగా ఇవ్వనున్నారు.

మిగిలిన 38వేల టికెట్లను క్రికెట్ అభిమానులకు కేటాయించారు. టెస్ట్ మ్యాచ్ కనీస టికెట్ ధర ఐదురోజులకు 300 రూపాయలు కాగా… రోజువారీ టికెట్ ధరను… వంద రూపాయలుగా నిర్ణయించారు.

ఈ మ్యాచ్ కోసం…హైదరాబాద్ క్రికెట్ సంఘం ఓ వైపు భారీస్థాయిలో ఏర్పాట్లు చేస్తే… మరోవైపు… టిట్లీ తుపాను భయపెడుతోంది. ఒకవేళ ఆటకు ఏవిధమైన అంతరాయం లేకున్నా… టీమిండియా దెబ్బకు… కరీబియన్ జట్టు మూడురోజులైనా నిలువగలుగుతుందా? అన్నది అనుమానమే!