దేవిశ్రీప్రసాద్ తో ఎలాంటి ఇబ్బంది లేదు

ఒకప్పుడు త్రివిక్రమ్ సినిమా అంటే ఆ ప్రాజెక్టుకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాల్సిందే. కానీ ఈమధ్య ఈ కాంబినేషన్ రిపీట్ అవ్వడం లేదు. దేవీకి పూర్తిగా దూరం జరిగాడు త్రివిక్రమ్. దీంతో వీళ్లిద్దరికీ పడడం లేదంటూ పుకార్లు వచ్చాయి. ఎట్టకేలకు ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చాడు త్రివిక్రమ్.

“నాలో మార్పు కోసం నేను దేవీకి దూరంగా జరిగాను. దేవికి నాకు మధ్య ఎలాంటి అభిప్రాయబేధాల్లేవు. దేవి ఒకే రకమైన మ్యూజిక్ ఇస్తున్నాడని నేను అతడ్ని దూరంగా పెట్టలేదు. అదే నిజమనుకుంటే దేవి ఇన్ని హిట్స్ ఎలా ఇస్తున్నాడు. ఇది నా జర్నీ. నాలో మార్పు కోసం నేను ప్రయాణిస్తున్నాను. అంతే తప్ప, దేవిశ్రీది తప్పు కాదు.”

ఇలా దేవిశ్రీని వెనకేసుకొచ్చాడు త్రివిక్రమ్. అ..ఆ, అజ్ఞాతవాసి సినిమాలకు దేవిశ్రీ ఎందుకు వర్క్ చేయలేదో కూడా క్లారిటీ ఇచ్చాడు.

“అ..ఆ సినిమా కోసం మాత్రం దేవిశ్రీని కావాలని తీసుకోలేదు. ఎందుకంటే ఆ బడ్జెట్ లో దేవి ఇమడడు. ఆ సినిమాకు దేవి చాలా ఎక్కువ. లెక్కప్రకారం అ..ఆ కు అనిరుధ్ చేయాలి. కానీ బీప్ సాంగ్ వివాదం కారణంగా అతడు దూరమవ్వడంతో మిక్కీ వచ్చాడు. అందుకే అజ్ఞాతవాసి కోసం అనిరుధ్ ను తీసుకున్నాను.”

ఇప్పటికీ దేవిశ్రీప్రసాద్, తను రెగ్యులర్ గా టచ్ లో ఉన్నామని అంటున్నాడు త్రివిక్రమ్. అయితే వెంటనే దేవిశ్రీకి అవకాశం ఇవ్వలేనని స్పష్టంచేశాడు. ఎందుకంటే, అరవింద సమేతకు అనిరుధ్ ను అనుకొని తప్పించానని, అతడితో తను మరోసారి పనిచేయాల్సి ఉందని తెలిపాడు.