మహేష్, బన్నీ, వెంకీ అంతా రెడీ ! కానీ…

మహేష్ బాబు, వెంకటేశ్, అల్లు అర్జున్.. ఇలా హీరోలంతా తనతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారని అంటున్నాడు దర్శకుడు త్రివిక్రమ్. ఎటొచ్చి చేతిలో మంచి కథలు మాత్రం లేవంటున్నాడు. ఏదో ఐడియా వచ్చి బాగుందని, లైన్ రాసుకొని పడుకుంటే, పొద్దున్న లేచేసరికి ఆ లైన్ తనకే నచ్చడం లేదని చెప్పుకొచ్చాడు.

అరవింద సమేత ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన త్రివిక్రమ్.. తన అప్ కమింగ్ మూవీస్ పై క్లారిటీ ఇవ్వలేదు. ఉన్నఫలంగా ఇప్పటికిప్పుడు వెంకీతో సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ కథ మాత్రం సెట్ అవ్వలేదని స్పష్టంచేశాడు త్రివిక్రమ్. కథ కుదిరిన తర్వాతే సెట్స్ పైకి వెళ్తామని అంటున్నాడు.

అటు మహేష్, బన్నీతో సినిమాలపై కూడా క్లారిటీ ఇచ్చాడు. కలిసి సినిమా చేసేందుకు ఎన్నో ఏళ్లుగా తను, మహేష్ ప్రయత్నిస్తూనే ఉన్నామని, కానీ సెట్ అవ్వడం లేదని క్లారిటీ ఇచ్చాడు. అటు బన్నీతో సినిమాపై మాత్రం ఎలాంటి చర్చలు లేవని ప్రకటించాడు త్రివిక్రమ్.

చూస్తుంటే.. తన నెక్ట్స్ మూవీ కోసం త్రివిక్రమ్ కాస్త లాంగ్ గ్యాప్ తీసుకునేలా కనిపిస్తున్నాడు. ఇతర దర్శకుల్లా బయట కథల్ని డీల్ చేయడు త్రివిక్రమ్. తనే స్వయంగా కథ రాసుకొని, దానికి తనే మాటలు రాసుకొని, తనే స్వయంగా డైరక్ట్ చేస్తాడు. అందుకే ఇంత లేట్.