తెలంగాణ నేత‌ల‌కు ద‌స‌రా ద‌డ !

ఎన్నిక‌లు అంటేనే ఓ పండ‌గ‌. ఇప్పుడు పండ‌గ‌ల మ‌ధ్య‌లో ఈ పండుగ వ‌చ్చింది. ద‌స‌రా, దీపావ‌ళి పండుగ‌ల త‌ర్వాత‌నే ఎన్నిక‌లు వ‌చ్చాయి. దీంతో అభ్య‌ర్థులు క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు. పండ‌గ ఖ‌ర్చు మొత్తం త‌మ మీద‌నే జ‌నాలు వేస్తార‌ని వ‌ణుకుతున్నారు. దీనికి త‌గ్గ‌ట్లుగానే కార్య‌క‌ర్త‌లు, జనాల నుంచి ద‌స‌రా దావ‌త్ డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి.

ద‌స‌రా అంటే తెలంగాణ ప‌ల్లెల్లో పెద్ద పండుగ‌. మాంసం, మందు లేనిదే ఇంట్లో పండ‌గ జ‌ర‌గ‌దు. దీంతో ఇప్పుడు ద‌స‌రాకి నేత‌లను కొత్త కొత్త కోర్కెలు కోరుతున్నారు కార్య‌క‌ర్త‌లు. మా ఊళ్లో టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లంతా 500 మంది ఉన్నామ‌ని ఒక‌రు… మా ఊళ్లో మా కులానికి చెందిన వారు మొత్తం 400 మందిమి ఉన్నాం. మాకు నాలుగు నుంచి ఐదు గొర్రెలు ఇస్తే స‌రిపెట్టుకుంటాం. మందు ఇస్తే మ‌రీ మంచిది.

ద‌స‌రా పండుగ మేం మీ పేరు చెప్పి చేసుకుంటాం. పండ‌గ మీ పేరు మీద చేస్తే ఓట్లు గ్యారంటీ. ఎందుకంటే పండ‌గ రోజు తిన్న వారు ఏవ‌రూ మ‌రిచిపోయారు. ప‌క్కాగా ఓటేస్తారు అంటూ కార్య‌క‌ర్త‌లు నేత‌ల ముందు డిమాండ్లు పెట్టారు.

ద‌స‌రా దావ‌త్‌లు ఇప్పుడు నేత‌ల ఖ‌ర్చును మరింత పెంచుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క టీఆర్ఎస్ మాత్ర‌మే క్యాండిడేట్లను ప్ర‌క‌టించింది. నెల‌రోజులుగా వారు ప్రచారం కోసం ఖ‌ర్చు పెడుతున్నారు. దీంతో ఈ నేత‌లు గ్రామాల్లోకి వెళితే వారికి ద‌స‌రా డిమాండ్లు ముందుకొచ్చాయి.

దీంతో చేసేదేమిలేక ఉత్త‌ర తెలంగాణ‌కు చెందిన ఓ బ‌డా ఎమ్మెల్యే….నాలుగు లారీల మేక‌ల‌ను ఆర్డ‌ర్ చేశాడ‌ట‌. ద‌స‌రా పండుగ‌కు గ్రామాల్లో పంచిపెట్టేందుకు… మ‌హారాష్ట్ర నుంచి ద‌స‌రా ముందు రోజు తీసుకురాబోతున్నార‌ని తెలుస్తోంది. మొత్తానికి పండ‌గలు వ‌చ్చి ఖ‌ర్చులను మ‌రింత పెంచుతున్నాయ‌ని నేతలు వాపోతున్నారు.