మొత్తానికి 50 కోట్లు సంపాదించింది

ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న దేవదాస్ ను హిట్ అనిపించడానికి నిర్మాత అశ్వనీదత్ నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే షేర్ వాల్యూస్ చెప్పకుండా, 40 కోట్ల గ్రాస్ అంటూ పోస్టర్లు రిలీజ్ చేసి విమర్శలు పాలయ్యాడు. అయినా తగ్గలేదు ఈ నిర్మాత. తాజాగా తన సినిమాకు 50 కోట్ల గ్రాస్ వచ్చిందంటూ ప్రకటించుకున్నాడు.

అవును.. దేవదాస్ సినిమా 50 కోట్ల గ్రాస్ సాధించింది. షేర్ ఎంత వచ్చిందని మాత్రం అడగొద్దు. గ్రాస్ పరంగా ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. నాని, నాగార్జున కలిసి నటించిన సినిమా ఇది. ఇద్దరు స్టార్లు కలిసి చేసిన సినిమాకు రికార్డు వసూళ్లు రావాల్సింది పోయి, ఇలా చప్పగా థియేటర్లలో సాగుతోంది దేవదాస్.

ఇవాళ్టి నుంచి ఈ సినిమాకు కష్టకాలమే. ఎందుకంటే ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా థియేటర్లలోకి వచ్చింది. సినిమా రిజల్ట్ సంగతి పక్కనపెడితే.. వరుసగా మరో వారం రోజులు ఈ సినిమాదే హంగామా. సో.. మరో వారం రోజుల్లో దేవదాస్ థియేట్రికల్ రన్ పూర్తవుతుంది.

శ్రీరామ్ ఆదిత్య డైరక్ట్ చేసిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. రష్మిక, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించారు.