Telugu Global
Family

నచికేతుడు

Nachiketa story in Telugu: నచికేతుడు చిన్నవాడు. తెలివైనవాడు. అతని తండ్రి గౌతముడు. గౌతముడు "విశ్వజిత్‌" అన్న యజ్ఞం చెయ్యాలనుకున్నారు. యజ్ఞం చెయ్యడానికి సమస్తం దానం చెయ్యాలి. అట్లా దానం చేసే క్రమంలో ఎంతో బలహీనమయిన, నిరుపయోగమయిన ముసలి గోవుల్ని దానం చేశాడు.

Nachiketa story in Telugu
X

Nachiketa story in Telugu

నచికేతుడు చిన్నవాడు. తెలివైనవాడు. అతని తండ్రి గౌతముడు. గౌతముడు "విశ్వజిత్‌" అన్న యజ్ఞం చెయ్యాలనుకున్నారు. యజ్ఞం చెయ్యడానికి సమస్తం దానం చెయ్యాలి. అట్లా దానం చేసే క్రమంలో ఎంతో బలహీనమయిన, నిరుపయోగమయిన ముసలి గోవుల్ని దానం చేశాడు.

స్వర్గ సుఖాల్ని ఆశిస్తూ పనికిరాని ముసలి పశువుల్ని దానమిచ్చే తండ్రిని చూసి నచికేతుడికి నవ్వు వచ్చింది. పైగా అది అనుచితమయిన చర్య అనిపించింది. తన తండ్రిని సమీపించి "నాన్నగారూ! మీరు ఈ యజ్ఞాన్ని నిర్వహించడానికి మీ సమస్తాన్నీ దానం చెయ్యాలి కదా! మీ సంపదలో నేనూ భాగాన్నే కదా! నన్నెందుకు దానం చెయ్యరు?" అన్నాడు.

గౌతముడు యజ్ఞ కార్యాల్లో మునిగి ఆ మాటలు పట్టించుకోలేదు. కాని నిచికేతుడు పట్టిన పట్టు వదలని వాడు. మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న వేశాడు. కొడుకు ప్రశ్న తండ్రి చెవిన పడినా ఏమీ చెప్పకూడదనే గౌతముడు మౌనంగా ఉన్నాడు.

కానీ నచికేతుడు పట్టువదల్లేదు.

"నాన్నగారూ! నేను మీకు సంబంధించిన సంపదలో భాగాన్నే కదా! మరి నన్ను ఎవరికి దానం చేస్తారు?' అని అడిగాడు.

చిరాకు పడిన గౌతముడు "నిన్ను మృత్యుదేవతకు దానంగా ఇస్తాను" అన్నాడు. అన్నాడే కాని మళ్ళీ ఎందుకామాట అన్నానా? అని గౌతముడు బాధపడ్డాడు.

నచికేతుడు "మా నాన్న ఎందుకిలా అన్నాడు? మృత్యుదేవతకు నాతో ఏం లాభం? అని విచికిత్సకులోనయ్యాడు. కానీ నాన్న గారి మాట నెరవేర్చాలి" అని తీర్మానించుకుని మృత్యు దేవత దగ్గరకు బయల్దేరాడు. మృత్యు దేవత అంటే యముడే కదా! కాబట్టి యమపురికి బయల్దేరాడు.

వెళ్ళే సరికి యమపురిలో యముడు లేడు. బ్రహ్మను సందర్శించి రావడానికి వెళ్ళాడు. మూడు రోజులకు కానీ తిరిగి రాలేదు. నచికేతుడు మూడు రోజుల పాటు ఎదురు చూశాడు. మూడు రోజులు గడిచాక యముడు వచ్చాడు. దేదీప్యమానంగా వెలుగుతున్న నచికేతుణ్ణి చూశాడు. మూడు రోజుల నుంచీ నిరాహారుడివై వున్నందుకు మన్నించు. నీకు ఆతిథ్యం యివ్వ లేకపోయినందుకు అన్యథా భావించకు "దానికి పరిహారంగా, మూడు రోజుల పాటు నిన్ను నిరాహారంగా వుంచినందుకు నీకు మూడు వరాలిస్తున్నాను, కోరుకో" అన్నాడు.

నచికేతుడు "యమధర్మరాజా! నువ్వు చెప్పినట్లే మూడు వరాలు కోరుకుంటాను. వీటిల్లో మొదటిది నా తండ్రికి సంబంధించింది. ఆయన నేను వెళ్ళేసరికి ఆగ్రహంతో వుండకుండా, సౌమ్యంగా, ప్రేమగా నన్ను స్వీకరించేలా చేయి" అన్నాడు.

యముడు "నచికేతా! తప్పకుండా మీ నాన్న నిన్ను కోపం లేకుండా ప్రేమతో దగ్గరికి తీసుకునేలా వరమిస్తున్నా" అన్నాడు.

నచికేతుడు "ధన్యవాదాలు. ఇక రెండో కోరిక స్వర్గంలో మృత్యు భయముండదు, వృద్ధాప్యముండదు, భయముండదు, దుఃఖముండదు, ఆకలి దప్పలుండవు. అట్లాంటి స్వర్గాన్ని అందుకునే మార్గం "అగ్ని చయనం" అన్న యజ్ఞం ద్వారా సాధ్యమని అంటారు. నాకు ఆ "అగ్నిచయన" క్రతువు గురించి వివరించు" అన్నాడు. యముడు "తప్పక వివరిస్తాను" అని స్వర్గ ప్రాప్తినిపొందే అగ్నిచయన క్రతువు గురించి వివరించాడు.

నచికేతుడు "నా పై దయతో రెండు వరాలని ఇచ్చినందుకు కృతజ్ఞుణ్ణి. మీకు రుణపడి ఉన్నాను. ఎప్పటి నించో నన్ను వేధిస్తున్న సమస్య వుంది. దానికి పరిష్కారం మీ దగ్గర దొరుకుతుందని నమ్మకంతో వున్నాను" అన్నాడు.

యముడు "తప్పక నాకు వీలయితే చెబుతాను" అన్నాడు.

నచికేతుడు "యమధర్మరాజా! మనిషి చనిపోయిన తరువాత ఏమవుతాడు? శరీరానికి వేరుగా ఆత్మ వున్నదని, శరీరం నశించిపోయినా ఆత్మవుంటుందని కొందరంటారు. కొందరు ఆత్మ లేదంటారు? ఈ విషయానికి సంబంధించిన నిజానిజాల్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇదే మిమ్మల్ని కోరే మూడోవరం" అన్నాడు.

అతని ప్రశ్నతో యముడు నిరుత్తరుడయ్యాడు. "నచికేతా! ఆత్మ చర్చ అతి గహనమయింది. సూక్ష్మమయింది. ఈ విషయంలో దేవతలు కూడా సందిగ్ధంలో పడ్డారు. నీకు ఇతర భౌతికానందాలు, స్వర్గ సుఖాలు ఎన్ని కావాలన్నాయిస్తాను. ఇది తప్ప ఇంకేదయినా వరం కోరుకో" అన్నాడు.

ఎంత చెప్పినా నచికేతుడు పట్టు వదల్లేదు. చివరికి అతని పట్టుదలకు సంతోషించి యముడు "నచికేతా! మనిషికి రెండు మార్గాలున్నాయి. ఒకటి శ్రేయోమార్గం రెండోది ప్రేమోమార్గం. మొదటిది నివృత్తి మార్గం, రెండోది ప్రవృత్తి మార్గం. మనిషికి నిగ్రహం లేకపోతే జనన మరణ చక్రంలో చిక్కుకుంటాడు. నిర్మలమయిన నిగ్రహముంటే జనన మరణ చక్రమనే పునరావృతమయ్యే మార్గం వదిలి అమృతత్వాన్ని అందుకుంటాడు. అట్లా ఆత్మని అన్వేషించే, ఆ అనుభవాన్ని అందుకునే అంతర్ముఖులు ఎక్కడో అరుదుగా వుంటారు.

సృష్టి మొదలయినప్పటి నుండి ఆత్మ మనసుతో, ఇంద్రియాలతో బాహ్యమయిన వస్తువులతో, బాహ్య ప్రపంచంతో పరిచయం కలిగించుకుంటుంది. అంతర్ముఖుడయిన వాడు మేలుకుని వున్నపుడు, నిద్రిస్తున్నపుడు కూడా అన్నిటి పట్ల సాక్షీ భూతుడుగా వుంటాడు. తనని తాను తెలుసుకుంటాడు.

ఆత్మే అన్నిటికీ ఆధారమని గ్రహిస్తాడు. అది తెలుసుకుంటే అన్ని దుఃఖాల నుండి విముక్తుడవుతాడు. అనంత ఆనంద కేంద్రంలో వుంటాడు.

ఆత్మ అనంత వ్యాప్తం. ఆత్మని మాటల్లో వర్ణించలేం. చేతుల్తో తాకలేం. కళ్ళతో చూడలేం. నాలికతో రుచి చూడలేం. వాసన చూడలేం. తర్కానికి ఆత్మ అందదు. అది ఆది మద్యాంత రహితం, రూపరహితం. అది అణువు కన్నా చిన్నది, విశ్వం కన్నా విశాలమైంది. ఈ సత్యాన్ని గ్రహిస్తే మనిషి మృత్యువుని జయిస్తాడు" అన్నాడు.

ఆత్మ గురించి అంతరంగాన్ని అందేలా చెప్పిన యమధర్మ రాజుకు అభివాదం చేసి నచికేతుడు ఇంటి ముఖం పట్టాడు.

– సౌభాగ్య

First Published:  9 Nov 2022 12:56 PM GMT
Next Story