బీజేపీ నేతలకు ప్రవేశం లేదు

బీజేపీ నేతలు మా ఊర్లోకి రావొద్దంటూ ఉత్తరాఖండ్‌లోని అనేక గ్రామాల్లో బోర్డులు పెడుతున్నారు. ఈ ఆందోళన ఉత్తరప్రదేశ్‌కు కూడా పాకింది. యూపీలోని అనేక గ్రామాల్లోనూ ఊరిలోకి వచ్చే దారిలో ఈ బోర్డులు వెలుస్తున్నాయి.

గాంధీ జయంతి రోజున రైతులమైన మేమంతా ప్రశాంతంగా నిరసన తెలియజేస్తుంటే ఢిల్లీ సరిహద్దులో పోలీసులు మాపై దాడి చేశారు. విచక్షణారహితంగా లాఠీచార్జ్‌ చేశారు. రబ్బర్‌ బుల్లెట్లు, టియర్‌ గ్యాస్‌ ఉపయోగించి రైతులపై విరుచుకుపడ్డారు. వాటర్‌ క్యానన్‌లతో మమ్మల్ని చెదరగొట్టారు. మాలో చాలామందికి తీవ్రగాయాలయ్యాయి. అనేకమందిమి ఆసుపత్రుల పాలయ్యాము. మా మీద ఇంత నిరంకుశంగా దాడి చేసిన బీజేపీకి మేమేంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తాం. బీజేపీ నాయకులను మా ఊళ్ళల్లోకి కూడా రానివ్వం. అందుకే బోర్డులు పెట్టాం అంటున్నారు రైతులు.

అయితే బీజేపీ నాయకులు మాత్రం ఆ బోర్టులు తీసేయమని రైతులపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. నయానా భయానా చెప్పి చూస్తున్నారు. మాట వినని గ్రామాలకు విద్యుత్ సరఫరాను ఆపివేస్తున్నారు. అయితే ఆ గ్రామాల్లో ఉన్న చదువుకున్న విద్యార్ధులు ఈ విషయాలను సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేస్తుండడంతో ఈ నిరసనలు చాలా వేగంగా అనేక గ్రామాలకు విస్తరిస్తున్నాయి.