ఇవి అమలైతే…. విద్యార్ధులకు వరమే

అనేక కాలేజీలు, యూనివర్శిటీలు, డీమ్డ్‌ యూనివర్శిటీలు విద్యార్ధుల ఒరిజినల్‌ సర్టిఫికేట్లు తమ వద్ద పెట్టుకుని ఆయా విద్యార్ధులను ఒక ఆట ఆడిస్తుంటాయి, బ్లాక్‌మెయిల్‌ చేస్తుంటాయి. కోర్సు పూర్తి అయి, పై కోర్సులకు వెళ్ళాలనుకున్నా ఫీజుల బకాయిలు ఉన్నాయంటూ ఒరిజినల్స్‌ తిరిగి ఇవ్వవు. ఒక కాలేజీలో చేరాక మరో మంచి కాలేజీలో సీటు వచ్చినా ఒరిజినల్స్‌ తిరిగి ఇవ్వవు. ఒరిజినల్స్‌ కావాలంటే కట్టిన ఫీజును వదులుకోవాల్సిందేనని బేరం పెడతాయి.

ఇలాంటి అరాచకాలకు, అవినీతికి, అవకతవకలకు చెక్‌ పెడుతూ యూజీసీ అన్ని కాలేజీలకు, యూనివర్శిటీలకు వార్నింగ్‌ ఇచ్చింది. అడ్మిషన్‌ సమయంలో విద్యార్ధులనుంచి అసలు ఒరిజినల్‌ సర్టిఫికేట్లే తీసుకోవద్దని, జిరాక్స్‌ కాపీలు మాత్రమే తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే తీసుకుని ఉంటే తిరిగి ఇచ్చేయాలని చెప్పింది.

ఒక విద్యార్ధి ఒక కోర్సులో చేరాక అక్కడనుంచి వెళ్ళిపోవాలనుకున్నా, మరో సంస్థలో చేరాలనుకున్నా అడ్డుకోకూడదని, ఫీజు వాపస్‌ ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీచేసింది. విద్యార్ధి కోర్సులో చేరాక ఆ కోర్సు అడ్మిషన్‌ చివరిరోజుకు 15 రోజుల ముందే విద్యార్ధి వెళ్ళిపోవాలనుకుంటే పూర్తి ఫీజు తిరిగి ఇచ్చేయాలని చెప్పింది. అడ్మిషన్‌ చివరి తేది అయిపోయిన తరువాత 15 రోజుల్లోపు తన అడ్మిషన్‌ను ఉపసంహరించుకుంటే 80 శాతం ఫీజు తిరిగి ఇవ్వాలని, 16 రోజుల నుంచి 30 రోజుల లోపు అడ్మిషన్‌ ఉపసంహరించుకుంటే 50 శాతం ఫీజు తిరిగి ఇచ్చివేయాల్సిందేనని ఆదేశించింది.

యూజీసీ విధించిన ఈ నియమాలను ఏవైనా కాలేజీలు, యూనివర్శిటీలు, డీమ్డ్‌ యూనివర్శిటీలు అమలు చేయకపోతే ఆయా సంస్థలకు పర్మిషన్‌లు ఉపసంహరించుకుంటామని, యూజీసీ నుంచి అందే సహాయాన్ని ఆపేస్తామని చెప్పింది.