వంగవీటి రాధాతో విజయసాయిరెడ్డి చర్చలు…. ఓ కొలిక్కి వచ్చినట్టే

వైసీపీ అధినేత జగన్ ఈసారి ప్రతి అసెంబ్లీ సీటుపైనా లోతుగా లెక్కలేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల విజయవాడలో కొన్ని మార్పులు చేశారు. బ్రాహ్మణులకు రెండుసీట్లు ఇస్తామన్న హామీ మేరకు విజయవాడ సెంట్రల్‌కు మల్లాది విష్ణును ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఇక్కడున్న బ్రాహ్మణ ఓటింగ్‌ కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు.

అయితే అప్పటి వరకు వంగవీటి రాధా సెంట్రల్‌ నియోజకవర్గాన్ని ఆశిస్తూ వచ్చారు. మల్లాది విష్ణుకు సెంట్రల్ అప్పగించిన వైసీపీ…. రాధాకు పలు ఆప్షన్లు ఇచ్చింది. గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా లేదా మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాల్సిందిగా సూచించింది.

అయినప్పటికీ హఠాత్తుగా తనను సెంట్రల్ నుంచి తప్పించారన్న అసంతృప్తితో రాధా ఉన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నేరుగా రాధా ఇంటికి వెళ్లారు. మొగల్రాజపురంలోని రాధా ఇంటికి వెళ్లిన విజయసాయిరెడ్డి కాసేపు మాట్లాడారు.

అనంతరం రాధాను వెంటబెట్టుకుని ఒక హోటల్‌కు వెళ్లారు. అక్కడే దాదాపు రెండుగంటల పాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని పార్టీ న్యాయం చేస్తుందని విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో విజయవాడ సెంట్రల్‌ను మల్లాది విష్ణుకు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. జిల్లాలో మరే సీటు నుంచి పోటీ చేస్తానన్నా టికెట్ కేటాయించేందుకు పార్టీ సిద్దంగా ఉందని రాధాకు విజయసాయిరెడ్డి వివరించారు.

విజయవాడ తూర్పు, ఆవనిగడ్డ, లేదా మచిలీపట్నం పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా సూచించారు. ఈసారి తప్పనిసరిగా అధికారంలోకి రాబోతున్నామని … అధికారంలోకి వచ్చాక మంచి అవకాశాలు ఉంటాయని విజయసాయిరెడ్డి వివరించారు. విజయసాయిరెడ్డితో సుధీర్ఘ చర్చల తర్వాత రాధా కాస్త మెత్తబడినట్టుగానే ఉన్నారని చెబుతున్నారు. విజయసాయిరెడ్డి ప్రతిపాదనలపై అనుచరులతో చర్చించి రెండు రోజుల్లో నిర్ణయం చెబుతానని రాధా చెప్పినట్టు సమాచారం.