Telugu Global
Family

సూట్‌ కేసు

 ఒక వ్యక్తి మరణశయ్యపై వున్నాడు. కుటుంబం, తల్లి, తండ్రి, అన్న దమ్ములు, భార్యా బిడ్డలు అందరూ మనసులో మెదిలారు. అను నిత్యం తనని కలిసే మిత్రులు, కళకళలాడే ప్రపంచం అన్నీ కళ్ళలో కదిలాయి. కానీ తను మరణించబోతున్నానన్న విషయం అతనికి తెలిసిపోయింది. కళ్ళలో నీళ్ళు తిరిగాయి.           అంతలో లీలగా ఎవరో తనని సమీపిస్తున్నట్లు అనిపించింది. చూస్తే దేవుడు. చిత్రమేమిటంటే దేవుడి చేతిలో ఒక సూట్‌కేసు కనిపించింది. దేవుడి సూట్‌కేసు చూసి అతను ఆశ్చర్యపోయాడు. అంతలో దేవుడు […]

ఒక వ్యక్తి మరణశయ్యపై వున్నాడు. కుటుంబం, తల్లి, తండ్రి, అన్న దమ్ములు, భార్యా బిడ్డలు అందరూ మనసులో మెదిలారు. అను నిత్యం తనని కలిసే మిత్రులు, కళకళలాడే ప్రపంచం అన్నీ కళ్ళలో కదిలాయి. కానీ తను మరణించబోతున్నానన్న విషయం అతనికి తెలిసిపోయింది. కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

అంతలో లీలగా ఎవరో తనని సమీపిస్తున్నట్లు అనిపించింది. చూస్తే దేవుడు. చిత్రమేమిటంటే దేవుడి చేతిలో ఒక సూట్‌కేసు కనిపించింది. దేవుడి సూట్‌కేసు చూసి అతను ఆశ్చర్యపోయాడు. అంతలో దేవుడు అతన్ని సమీపించి “నాయనా! నీకు సమయం సమీపించింది. ఇక వెళదామా?” అన్నాడు.

మనిషి సహజ లక్షణంగా అతను “స్వామీ! నాకు చాలా ప్లాన్లు ఉన్నాయి. ఇంత తొందరగా వెళ్ళడానికి మనస్కరించడం లేదు” అన్నాడు.

“అది వీలు కాదు బాబూ! సిద్ధపడు” అన్నాడు దేవుడు.

మనిషి ఉత్సుకతతో “స్వామీ! మీ సూట్‌కేసులో ఏమున్నాయి?” అన్నాడు.

దేవుడు “అందులో నీకు సంబంధించినవన్నీ ఉన్నాయి” అన్నాడు. దాంతో ఆ వ్యక్తికి మరింత ఆతృత కలిగింది. “నాకు సంబంధించినవా? ఆశ్చర్యంగా వుందే. బహుశా నా డబ్బు, బట్టలు అనుకుంటాను” అన్నాడు.

దేవుడు “అవి నీకు సంబంధించినవి కావు. అవి భూమికి సంబంధించినవి” అన్నాడు.

ఆ వ్యక్తి “లేకుంటే అవి నా జ్ఞాపకాలా?”

“అవి నీవి కాదు, అవి కాలానికి సంబంధించినవి”

“లేకుంటే నా నైపుణ్యాలా?”

“అవి నీ పరిసరాలకు సంబంధించినవి”

“మరి నా స్నేహితులు, కుటుంబం”

“వాళ్ళు నీ వాళ్ళు కారు, దారిలో తటస్థించిన వాళ్ళు”

“నా భార్యా కొడుకు?”

“వాళ్ళు నీ వాళ్ళు కాదు, నీ హృదయానికి సంబంధించిన వాళ్ళు”

“లేకుంటే నా శరీరము?”

“అది నీది కాదు, ధూళికి సంబంధించింది”

“ఐతే మరి నా ఆత్మ?”

“అది నీది కాదు, అది నాది”. అతను ఆయోమయంలో మునిగాడు. దేవుడు సూట్‌కేసు తీసి చూపాడు. అది ఖాళీగా వుంది. ఆ వ్యక్తి కన్నీళ్ళు పెట్టుకుని “నాదంటూ ఏమీ లేదా?” అన్నాడు. దేవుడు “అవును నిజం. నువ్వు జీవించిన క్షణం మాత్రమే నీది. జీవితం క్షణ క్షణం, క్షణికం. అందువల్లే నీకు అందిన క్షణాన్ని ఆనందించు. ప్రపంచంలో ఉన్న దేదీ నీది కాదు.” ఇప్పుడు జీవించు, జీవితాన్ని జీవించు, సంతోషంగా వుండడం మరచిపోవద్దు. తెలుసుకోవాల్సిన విషయమదొక్కటే.

నువ్వు ఇక్కడ వున్న భౌతిక విషయాల్ని మరచినపుడే అక్కడికి రాగలవు.

ఎందుకంటే దేన్నీ నువ్వు తీసుకుపోలేవు” అన్నాడు.

– సౌభాగ్య

First Published:  12 Oct 2018 8:21 PM GMT
Next Story