Telugu Global
NEWS

వేల కోట్లు ఢిల్లీలోని ఒక బడా వ్యక్తికి చేరవేసిన సీఎం రమేష్!

ఐటీ అధికారుల సోదాల్లో టీడీపీ ఎంపీ, చంద్రబాబుకు బినామీగా భావిస్తున్న సీఎం రమేష్ లీలలు బయటపడుతున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల కాంట్రాక్టులు చేజెక్కించుకున్న సీఎం రమేష్‌ కంపెనీ… బిల్లులు పాస్ కాగానే ఆ డబ్బును నగదు రూపంలో తీసుకెళ్లడం ఐటీ అధికారులను నివ్వెరపరిచింది. సాధారణంగా ప్రభుత్వ బిల్లులు ఆన్‌లైన్‌లో లేదంటే చెక్కు రూపంలో జరుగుతాయి. కానీ సీఎం రమేష్ విషయంలో మాత్రం అంతా నగదు రూపంలోనే సాగింది. 18 వందల కోట్ల విలువైన […]

వేల కోట్లు ఢిల్లీలోని ఒక బడా వ్యక్తికి చేరవేసిన సీఎం రమేష్!
X

ఐటీ అధికారుల సోదాల్లో టీడీపీ ఎంపీ, చంద్రబాబుకు బినామీగా భావిస్తున్న సీఎం రమేష్ లీలలు బయటపడుతున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల కాంట్రాక్టులు చేజెక్కించుకున్న సీఎం రమేష్‌ కంపెనీ… బిల్లులు పాస్ కాగానే ఆ డబ్బును నగదు రూపంలో తీసుకెళ్లడం ఐటీ అధికారులను నివ్వెరపరిచింది.

సాధారణంగా ప్రభుత్వ బిల్లులు ఆన్‌లైన్‌లో లేదంటే చెక్కు రూపంలో జరుగుతాయి. కానీ సీఎం రమేష్ విషయంలో మాత్రం అంతా నగదు రూపంలోనే సాగింది. 18 వందల కోట్ల విలువైన ఒక ప్రాజెక్టుతో పాటు 900 కోట్ల విలువైన మరో ప్రాజెక్టు విషయంలో బిల్లుల డబ్బును మొత్తం నగదు రూపంలోనే సీఎం రమేష్ పట్టుకెళ్లారు.

ఇలా వచ్చిన వేల కోట్ల రూపాయలను తిరిగి బ్యాంకుల్లో జమ చేయలేదు. దాన్ని నేరుగా ఢిల్లీలోని ఒక బడా వ్యక్తికి చేరవేసినట్టు ఐటీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఏపీ ప్రభుత్వ కాంట్రాక్టు పనుల కింద తీసుకున్న వేల కోట్ల రూపాయలను సీఎం రమేష్ కంపెనీ ఎక్కడా రికార్డుల్లో చూపలేదు. దీంతో ఐటీ అధికారులు ఆ వేల కోట్ల నగదు ఎక్కడకు మళ్లించారన్న దానిపైనే లోతుగా ప్రశ్నిస్తున్నారు.

ఢిల్లీకి వెళ్లిన ఆ భారీ నగదు అటు నుంచి విదేశాలకైనా, లేదంటే తిరిగి టీడీపీ పెద్దల కంపెనీల్లోకి అయినా మళ్లించి ఉంటారని ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. రిత్విక్‌ సంస్థతో పాటు దానికి అనుబంధంగా ఆరు కంపెనీలను తెరిచారు. ఇందులో కేవలం ఒక కంపెనీ ద్వారా రెండు వేల కోట్ల రూపాయల నగదు లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు.

మరోవైపు సీఎం రమేష్ తన ఇంట్లోనే డిజిటల్‌ లాకర్లను ఏర్పాటు చేసుకోవడం చూసి ఐటీ అధికారులు ఆశ్చర్యపోయారు. వాటిని కోడ్‌ ద్వారా కాకుండా ఫింగర్ ఫ్రింట్‌తో తెరిచేలా ఏర్పాటు చేసుకున్నారు. దీంతో లాకర్లను తెరిచేందుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు సీఎం రమేష్‌ను పిలిపించారు.

అలా హైదరాబాద్‌ చేరుకున్న సీఎం రమేష్… తన ఇంటి వద్దకు రాగానే లాకర్ల గురించి మాట్లాడారు. తన బట్టలను ఎవరూ ముట్టుకోకూడదన్న ఉద్దేశంతో కప్‌బోర్డుకు ఫింగర్ ప్రింట్ సిస్టం పెట్టుకున్నానని చెప్పుకొచ్చారు. కానీ సీఎం రమేష్ వేలిముద్రల సాయంతో లాకర్లను ఓపెన్ చేయగా అందులో ఏపీలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్ల వివరాలు, వాటి అంచనాల పెంపు వివరాలతో కూడిన ఫైళ్లను ఐటీ అధికారులు గుర్తించారు. రెండో లాకర్‌లో రమేశ్‌కు చెందిన 3 బ్యాంకు ఖాతాల వివరాలు, చెక్‌బుక్‌లు, 2 పెన్‌డ్రైవ్‌లు, ఐటీ రిటర్నులకు సంబంధించిన కాపీలు లభ్యమయ్యాయి.

సీఎం రమేష్ వ్యవహారంలో ఏపీలో కాంట్రాక్టుల ద్వారా తీసుకున్న వేల కోట్ల నగదును ఎటు మళ్లించారన్న దానిపైనే ఐటీ అధికారులు ప్రధానంగా దృష్టిసారించారు.

First Published:  13 Oct 2018 10:50 PM GMT
Next Story