మొత్తానికి రామ్ గోపాల్ వర్మకు ఈ చంద్రబాబు నాయుడి అడ్రెస్ దొరికింది

చంద్రబాబులానే ఇంకో వ్యక్తి అచ్చుగుద్దినట్టు వున్నారంటూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ఓ వీడియో…. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దృష్టిలో పడింది. ఆ వీడియో అలా చూశాడో లేదో అతని ఆచూకి పట్టిస్తే అక్షరాల లక్ష రూపాయలు ఇస్తాను అంటూ ప్రకటించాడు రామ్ గోపాల్ వర్మ.

రామ్‌గోపాల్‌ వర్మ “లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌” సినిమాని ఈ నెల 18న ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. అందులో చంద్రబాబు పాత్ర కోసం, చంద్రబాబు పోలిన వ్యక్తి…. అదీ ఈ వీడియోలోని వ్యక్తి అయితే బావుంటుందని రామ్‌గోపాల్‌ వర్మ ఆలోచన. ఈ నేపథ్యంలో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాలో చంద్రబాబు పాత్ర, సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న వీడియోలోని చంద్రబాబు లాంటి వ్యక్తే పోషిస్తే అది ఒక పెద్ద సంచలనంగా మారుతుంది.

స్టార్లతో సినిమాలు చేయడమే కాదు, మామూలు జనాల్ని కూడా తీసుకొచ్చి స్టార్లను చేయడం వర్మకి చాలా సులభం. ఇదిలా ఉంటే ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ లో పని చేసే ఒక వ్యక్తి రామ్ గోపాల్ వర్మకి అతని ఆచూకి పట్టుకొచ్చి ఇచ్చాడు. అయితే రామ్ గోపాల్ వర్మ ఇచ్చే ఆ లక్ష రూపాయల బహుమతిని కొండగట్టు ప్రమాద బాధితుల సహాయార్ధం నాలుగు పేద కుటుంబాలకు అందజేయాలని రామ్ గోపాల్ వర్మను కోరాడు.