Telugu Global
NEWS

షకీలా సినిమాలో ఎయిడ్స్‌ సందేశంలా త్రివిక్రమ్ సినిమా....

రాయలసీమ ప్రాంతంపై ఎంత నీచంగా సినిమాలు తీసినా అక్కడి నాయకులు ఏమాత్రం స్పందించకపోవడంతో ఇటీవల చిత్ర పరిశ్రమ మరింత డోస్ పెంచింది. ముఖ్యంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శీను లాంటి వారు రాయలసీమ మీద పదేపదే నెగిటివ్‌గా చిత్రాలు తీస్తూనే ఉన్నారు. వరుసగా ప్లాప్‌లు ఎదుర్కొంటున్న త్రివిక్రమ్ ఇలా అయితే బయటపడలేనని భావించారో ఏమో గానీ మరోసారి సీమ మీద సినిమా తీశారు. ”ఈ నేల కత్తిపట్టమంటోంది”, ”మీ డీఎన్‌ఏ లోనే వైలెన్స్ ఉంది” వంటి […]

షకీలా సినిమాలో ఎయిడ్స్‌ సందేశంలా త్రివిక్రమ్ సినిమా....
X

రాయలసీమ ప్రాంతంపై ఎంత నీచంగా సినిమాలు తీసినా అక్కడి నాయకులు ఏమాత్రం స్పందించకపోవడంతో ఇటీవల చిత్ర పరిశ్రమ మరింత డోస్ పెంచింది. ముఖ్యంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శీను లాంటి వారు రాయలసీమ మీద పదేపదే నెగిటివ్‌గా చిత్రాలు తీస్తూనే ఉన్నారు. వరుసగా ప్లాప్‌లు ఎదుర్కొంటున్న త్రివిక్రమ్ ఇలా అయితే బయటపడలేనని భావించారో ఏమో గానీ మరోసారి సీమ మీద సినిమా తీశారు.

”ఈ నేల కత్తిపట్టమంటోంది”, ”మీ డీఎన్‌ఏ లోనే వైలెన్స్ ఉంది” వంటి అసహజమైన డైలాగులు సినిమాలో చెప్పించడం ద్వారా రాయలసీమ అంటే నరుక్కోవడం తప్ప ఏమీ ఉండదన్నట్టు చిత్రీకరించారు. అయితే ఇంత జరిగినా రాయలసీమ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు మాత్రం ఒక్కరూ స్పందించలేదు గానీ విద్యార్థి సంఘాలు మాత్రం తమ గడ్డ కోసం గళమెత్తాయి.

హైదరాబాద్‌ సోమాజీగూడలో ప్రెస్‌ మీట్ నిర్వహించి త్రివిక్రమ్‌కు రాయలసీమ గురించి వివరించారు. అతడు తీస్తున్న సినిమాల తీరును ఎండగట్టారు. రాయలసీమ విద్యార్థి సమాఖ్యనాయకుడు కృష్ణ మాట్లాడుతూ… త్రివిక్రమ్‌ తమ వెంట రావాలని రాయలసీమ మొత్తం చూపిస్తామని, ఎక్కడైనా సరే అరవింద సమేత సినిమాలో చూపిన పరిస్థితులు ఒక్కశాతమైనా ఉన్నాయేమో గమనించాలన్నారు. రాయలసీమలో ఫ్యాక్షన్‌ భూతం ఉందన్నట్టు తీసిన సమరసింహారెడ్డి సినిమా విడుదలైన సమయంలో హైదరాబాద్‌లో రాయలసీమ వాసులకు కనీసం అద్దె ఇళ్లులు దొరకలేదని వ్యాఖ్యానించారు.

రాయలసీమపై ఇతర ప్రాంతాల వారికి లేనిపోని అపోహలను సృష్టించింది ఈ సినిమావాళ్లేనని మండిపడ్డారు. బాలకృష్ణ తొడకొడితే రైలు వెనక్కు వెళ్లడం, మీసం తిప్పితే తలలు తెగిపోవడం ఎక్కడైనా జరుగుతాయా? అని ప్రశ్నించారు. వరుస ప్లాప్‌లు వచ్చిన ప్రతిసారీ హిట్‌ కోసం రాయలసీమను నీచంగా చిత్రీకరించి సినిమాలు తీయడం సంస్కారమేనా అని ప్రశ్నించారు.

అరవింద సమేత చిత్రంలో ఈ నేల కత్తిపట్టమంటోంది అని డైలాగ్ ఉందని… ఈ ప్రపంచంలో ఏ నేల అయినా కత్తి పట్టమని తమ ప్రాంత వాసులకు చెబుతుందా ? ఆ డైలాగ్‌ రాసినోడికి తలకాయ ఉందా? అని రాయలసీమ విద్యార్థులు ప్రశ్నించారు. రాయలసీమ డీఎన్‌ఏ లోనే వైలెన్స్ ఉందన్న డైలాగ్‌పై వారు మండిపడ్డారు. రాయలసీమ డీఎన్‌ఏ గురించి త్రివిక్రమ్‌కు ఎలా తెలిసిందని ప్రశ్నించారు. రాయలసీమ డీఎన్‌ఏతో త్రివిక్రమ్‌కు ఏమైనా సంబంధం ఉందా? అని నిలదీశారు. స్వచ్చమైన క్రియేటివిటి చచ్చిపోయినప్పుడే ఇలాంటి చెత్త డైలాగులతో నెట్టుకొస్తారని మండిపడ్డారు.

రాయలసీమను కించపరిచేలా సినిమాలు తీయడం ఆఖరిలో సందేశాత్మక చిత్రమని చెప్పడం అలవాటుగా మారిందన్నారు. షకీలాతో సినిమా తీసి ఆఖరుల్లో ఇలా చేస్తే ఎయిడ్స్‌ వస్తుందని సందేశం ఇచ్చినట్టుగా త్రివిక్రమ్‌ సినిమా ఉందని రాయలసీమ విద్యార్థులు ఎద్దేవా చేశారు. అన్నమయ్య, వేమన, తొలి స్వాతంత్ర్య సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి వారు పుట్టిన గడ్డ రాయలసీమ అని.. చరిత్రపై ఏమాత్రం అవగాహన లేని సినిమా వాళ్లు కాసులు ఏరుకునేందుకు ఇలాంటి సినిమాలు తీస్తున్నారని మండిపడ్డారు.

తెలుగు చిత్రపరిశ్రమ పురుడుపోసుకున్నదే రాయలసీమకు చెందిన మహనీయుల ద్వారా అన్న విషయమైనా త్రివిక్రమ్‌కు తెలుసా అని ప్రశ్నించారు. చిత్రపరిశ్రమను ఆక్రమించిన పెత్తందార్లు ఇప్పుడు అదే రాయలసీమపై దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ గురించి సినిమా తీసిన త్రివిక్రమ్‌కు… విజయవాడలో కులపోరాటం గురించి సినిమా తీసే దమ్ము ఉందా? డబ్బుకోసం ఏమైనా చేసే విష సంస్కృతి ఉన్న ప్రాంతం గురించి సినిమా తీసే ధైర్య ఉందా? అని ప్రశ్నించారు.

తాము పుట్టినప్పటి నుంచి రాయలసీమలో నీళ్లు తాగుతున్నామని… కానీ ఎన్నడూ తమకు పూనకం రాలేదన్నారు. కానీ సినిమాలో మాత్రం హీరోకు రాయలసీమ నీరు తాగగానే పూనకం ఎలా వస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఇలాంటి సన్నివేశాలు తీసే డైరెక్టర్లకు కామన్‌సెన్స్ ఉండదా? అని నిలదీశారు. అరవింద సమేత చిత్రంలోని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ ఫోన్ స్వీచ్చాఫ్ చేసుకుని ఎక్కడో బ్యాంకాక్‌లో ఉంటే సరిపోదన్నారు.

First Published:  16 Oct 2018 3:00 AM GMT
Next Story