క్రికెట్ బాల్స్ పై సరికొత్త వివాదం

  • ఎస్జీ బాల్ వద్దు… కుకాబురానే ముద్దు
  • ఇటు విరాట్ కొహ్లీ…అటు మహ్మద్ అజారుద్దీన్
  • ప్రపంచమంతా ఒకే బ్రాండ్ బాల్స్ వాడాలంటున్న కొహ్లీ
  • భారత క్రికెటర్ల అభ్యంతరాలపై అజార్ గరంగరం

క్రికెట్ బాల్స్ పై మరోసారి వివాదం రాజుకొంది. భారత్ లో గత పాతిక సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న ఎస్జీ బ్రాండ్ బాల్స్…. పట్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీతో సహా పలువురు టెస్ట్ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే… మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ మాత్రం… క్రికెటర్ల అభ్యంతరాలలో అర్ధంలేదని కొట్టి పడేశాడు.

బ్యాటు… బాలు కలిస్తేనే క్రికెట్….

క్రికెట్ అనగానే….. బ్యాటు…బంతి మాత్రమే గుర్తుకు వస్తాయి. బ్యాటు లేదా, బంతి లేని క్రికెట్ ను ఊహించడం అసాధ్యం.

మూడు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన క్రికెట్…. మూడు రకాల ఫార్మాట్లలో… మూడు వేర్వేరు రంగుల బంతులను ఉపయోగిస్తున్నారు.

మూడు ఫార్మాట్లు… మూడురకాల బాల్స్

ఐదురోజులపాటు జరిగే…సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో….యాపిల్ రంగు బాల్స్ తో పాటు…డే-నైట్ టెస్ట్ మ్యాచ్ ల్లో …గులాబీ రంగుబంతులను ఉపయోగిస్తున్నారు. అదే…ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ , ఇన్ స్టంట్ వన్డే క్రికెట్లో మాత్రం….తెలుపు రంగు బాల్స్ ను మాత్రమే వాడుతూ వస్తున్నారు.

క్రికెట్ బాల్స్ లో సైతం రకరకాల బ్రాండ్ల బాల్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, భారత్ దేశాల వాతావరణం, పరిస్థితులకు అనుగుణంగా…ఆయా దేశాలలోని క్రీడాపరికరాల సంస్థలు… ఐసీసీ నిర్ధేశిత ప్రమాణాల మేరకు బంతులను తయారు చేస్తూ వస్తున్నాయి.

కంగారూ బ్రాడ్… కూకా బురా…

ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ తో పాటు…కంగారూ గడ్డపై జరిగే టెస్ట్ మ్యాచ్ లు, వన్డే సిరీస్ లు, డే- నైట్ టెస్టుల్లో…మేడిన్ ఆస్ట్రేలియా క్రికెట్ బ్రాండ్…కుకాబురా బాల్స్ ను విస్త్రుతంగా వాడుతున్నారు.

అంతేకాదు…ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో జరిగే వన్డే, టీ-20 ఫార్మాట్లను కుకాబురా బ్రాండ్ బాల్స్ తోనే నిర్వహిస్తున్నారు.

భారత్ లో ఎస్జీ బ్రాండ్ బాల్….

ఇదే…ఇంగ్లండ్ లో జరిగే టెస్టుమ్యాచ్ ల్లో డ్యూక్ బ్రాండ్ బాల్స్ ను, భారత దేశవాళీ క్రికెట్ తో పాటు…టెస్టుమ్యాచ్ ల్లో…. SG  కమ్ సాన్స్ పెరిల్స్ గ్రీన్ ల్యాండ్స్ బ్రాండ్ బాల్స్ ను వినియోగిస్తున్నారు.

అయితే…గత పాతిక సంవత్సరాలుగా…భారత్ లో వినియోగిస్తున్న  SG బ్రాండ్ బాల్స్ నాణ్యత పై…కెప్టెన్ విరాట్ కొహ్లీ, బౌలర్ల త్రయం అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

భారత క్రికెటర్ల వాదన….

ప్రపంచ వ్యాప్తంగా జరిగే టెస్టుల్లో…డ్యూక్ బ్రాండ్ బాల్స్ ను వాడితేనే బాగుంటుందని… విరాట్ కొహ్లీ గట్టిగా చెబుతున్నాడు. నాణ్యత లోపించిన SG బ్రాండ్ బాల్స్ ను తరచూ మార్చడం వల్ల…ఆటలో విలువైన సమయం వృథాకావడమే కాదు..ఆటగాళ్ల ఏకాగ్రత సైతం దెబ్బ తింటోందంటూ కొహ్లీ అసహనం వ్యక్తం చేశాడు.                               

మరోవైపు…మొదటి ఐదు లేదా ఆరు ఓవర్ల ఆటకే SG బాల్స్ ఆకారం మారిపోతోందని….బంతి పాతబడినా…కాస్త మెత్తబడినా…బౌలర్లకూ ఏవిధంగానూ ఉపయోగపడదంటూ…పేసర్ కుల్దీప్ యాదవ్, స్పిన్నర్లు అశ్విన్, కుల్దీప్ యాదవ్ వాపోతున్నారు.

అజర్ అభ్యంతరం…. 

అదే…డ్యూక్ బ్రాండ్ బాల్స్ ను వాడితే…ఆట 90 ఓవర్ల వరకూ బంతి నాణ్యత ఒకేలా ఉంటుందని…బౌలర్లకు బంతి ఏదోవిధంగా అనువుగా ఉంటుందని చెబుతున్నారు.

మరోవైపు…టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ మాత్రం….విరాట్ కొహ్లీ అండ్ కో అభ్యంతరాల్లో పసలేదని…ఇలాంటి అర్థంలేని అభ్యంతరాలను తాను ఎప్పుడూ చూడలేదని చెప్పాడు.

భారత క్రికెట్లో …గత 25 సంవత్సరాలుగా వాడుతున్న… SG బ్రాండ్ బాల్స్ పై ఇప్పుడు కొత్తగా అభ్యంతరం ఏమిటని అజర్ నిలదీశాడు. భారత వాతావరణం, పిచ్ పరిస్థితులకు అనుగుణంగా SG బాల్స్ ను ఉపయోగిస్తున్న విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించాడు.

ప్రపంచ మంతా ఒకేరకం బ్రాండ్ బంతులను వాడాలని కొహ్లీ అనటంలో అర్థమేలేదని అజర్ తేల్చి చెప్పాడు.

రాజ్ కోట వేదికగా వెస్టిండీస్ తో ముగిసిన తొలిటెస్టులో ఆరు వికెట్లు పడగొట్టిన కుల్దీప్ యాదవ్, హైదరాబాద్ టెస్టులో 10 వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్…ఇద్దరూ SG బ్రాండ్ బాల్ తోనే రాణించిన వాస్తవాన్ని మరచిపోయి… నాణ్యతలేదంటూ విమర్శించడం… వారి అవివేకానికి నిదర్శనమని అజర్ చెప్పాడు.

ఎస్జీ బ్రాండ్ రికార్డే మెరుగు…..

ఓ బ్యాట్స్ మన్ …సెంచరీ బాదిన తర్వాత…బ్యాటులో ఏమాత్రం పసలేదని చెప్పినట్లుగా ఉందని….ఉమేశ్, కుల్దీప్ లకు చురక అంటించాడు.

ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్లో ఉపయోగించిన డ్యూక్ బాల్ తో….52 మంది బౌలర్లు మాత్రమే 5 వికెట్ల రికార్డులు సాధించారని… అదే… భారత దేశవాళీ క్రికెట్లో మాత్రం…SG బాల్స్  ఉపయోగించిన బౌలర్లు ఏకంగా 58 సార్లు.. ఐదుకు పైగా వికెట్లు పడగొట్టిన రికార్డులను అజర్ ఉదహరించాడు.

ఒకవేళ..SG బ్రాండ్ బాల్స్ లో నాణ్యత లోపించినా….ఏవైనా మార్పులు అవసరమైనా….ఆ విషయాలను …బ్రాండ్ మేకర్లకు తెలపాలని అజర్ సూచించాడు. మొత్తం మీద…ఏదో ఒక వివాదం లేకపోతే….అది జెంటిల్మన్ గేమ్ క్రికెట్టే కాదని ప్రత్యేకంగా చెప్పాలా మరి.