తుపాను బాధితులకోసం వైసీపీ కోటి విరాళం

శ్రీకాకుళం జిల్లాను, ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన తిత్లీ బాధితుల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించడం అభినందనీయం. తమ పార్టీ తరఫున తుఫాన్ బాధితుల కోసం కోటి రూపాయలతో సహాయ కార్యక్రమాలను నిర్వహించనున్నట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ నేత పిన్నెల్లి ఈ విషయాన్ని ప్రకటించారు.

ఒకవైపు తుఫాన్ బాధితుల కోసం ప్రభుత్వ చర్యలు ఏ మాత్రం సరిగా లేవని విమర్శించిన ఈ నేత…. తమ పార్టీ తరఫున అందిస్తున్న సాయాన్ని ప్రకటించారు. ఇప్పటి వరకూ ఈ తుపాన్ బాధితుల కోసం ఈ స్థాయిలో సహాయాన్ని ప్రకటించిన వారు లేరు. కొంతమంది పెద్ద మనసుతో స్పందించారు. వారందరిలో కెల్లా అత్యధిక సాయాన్ని అందించింది మాత్రం వైసీపీ మాత్రమే.

అయితే ఇది తొలి సారి కాదు అనే విషయాన్ని గుర్తించాలి. ఇది వరకూ కేరళకు వరద సాయం సమయంలో కూడా వైసీపీ ఇదే రీతిన స్పందించింది. కేరళకు కూడా కోటి రూపాయల సాయాన్ని తన పార్టీ తరఫు నుంచి అందించాడు జగన్ మోహన్ రెడ్డి.

దీనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇదే సమయంలో ఏపీలోని ఇతర రాజకీయ పార్టీల విషయానికి వస్తే.. అటు కేరళ విపత్తు సమయంలో అయినా, ఇటు తిత్లీ సమయంలో అయినా ఎవ్వరూ స్పందించలేదు. తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు కుటుంబం కానీ రూపాయి కూడా ఇవ్వలేదు. పవన్ కల్యాణ్ కథ కూడా అంతే. ఒక్క వైసీపీ మాత్రమే రెండు సార్లూ పెద్ద మనసుతో స్పందించింది.