Telugu Global
NEWS

ఏమండోయ్... "గంటా"నాదం విన్నారా?

నారాయణ విద్యాసంస్థలు ఇచ్చే యాడ్స్‌కు ఆశపడి ప్రధాన మీడియా పెద్దగా ప్రచారం చేయకపోయినా… ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యావ్యవస్థను ధ్వంసం చేసిన కార్పొరేట్ విద్యా వ్యవస్థకు పితామహుడు ఎవరంటే చదువురాని వాడు కూడా సమాధానం చెబుతాడు. టీడీపీ మంత్రి నారాయణ కార్పొరేట్‌ కాలేజీల దెబ్బకు ప్రభుత్వ విద్యావ్యవస్థ సర్వనాశనం అయిందని అందరికీ తెలిసిందే. సర్పంచ్‌గా కూడా గెలవకుండానే నేరుగా మంత్రి అయ్యేంతగా చంద్రబాబుతో బంధం పెనవేసుకుని లక్షలకు లక్షలు ఫీజులు విద్యార్థుల నుంచి వసూలు చేస్తూ పిల్లాడిని […]

ఏమండోయ్... గంటానాదం విన్నారా?
X

నారాయణ విద్యాసంస్థలు ఇచ్చే యాడ్స్‌కు ఆశపడి ప్రధాన మీడియా పెద్దగా ప్రచారం చేయకపోయినా… ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యావ్యవస్థను ధ్వంసం చేసిన కార్పొరేట్ విద్యా వ్యవస్థకు పితామహుడు ఎవరంటే చదువురాని వాడు కూడా సమాధానం చెబుతాడు.

టీడీపీ మంత్రి నారాయణ కార్పొరేట్‌ కాలేజీల దెబ్బకు ప్రభుత్వ విద్యావ్యవస్థ సర్వనాశనం అయిందని అందరికీ తెలిసిందే. సర్పంచ్‌గా కూడా గెలవకుండానే నేరుగా మంత్రి అయ్యేంతగా చంద్రబాబుతో బంధం పెనవేసుకుని లక్షలకు లక్షలు ఫీజులు విద్యార్థుల నుంచి వసూలు చేస్తూ పిల్లాడిని ఇంటర్‌ చదివించాలంటేనే ఎకరం పొలం అమ్ముకునే దుస్థితి నారాయణ కాలేజీల వల్లే వచ్చిందని జగమెరిగిన సత్యమే.

ఇప్పుడు ఏపీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు… ఈ నారాయణకు స్వయాన వియ్యంకుడు అన్న సంగతీ అందరికీ తెలుసు. వియ్యంకుడు విద్యాశాఖమంత్రి అయ్యాక నారాయణ కాలేజీలు ఇంకెంతగా రెచ్చిపోతున్నాయో కూడా కళ్లకు కనిపిస్తున్న దృశ్యమే. అయితే మంత్రి గంటా గారు మాత్రం కార్పొరేట్‌ విద్యావ్యవస్థపై ఆసక్తికరంగా స్పందించారు.

గత ప్రభుత్వాలు కార్పొరేట్ విద్యావ్యవస్థకు పెద్దపీట వేయడం వల్లే విద్యా శాఖ భ్రష్టుపట్టిందని వ్యాఖ్యానించారు. కార్పొరేట్ స్కూల్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేస్తున్నది టీడీపీ ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు. నారాయణకు వియ్యంకుడైన గంటా శ్రీనివాస్ కార్పొరేట్ విద్యపై మాట్లాడడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కార్పొరేట్ విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రేషనైజేషన్ పేరుతో వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసింది ఈ నాలుగేళ్లలోనే కదా!.

వందల సంఖ్యలో నారాయణ కాలేజీలు అనుమతులు లేకుండా నడుస్తున్నా ప్రశ్నించకుండా ఉన్నది ఈ గంటా ఆధ్వర్యంలోని విద్యావ్యవస్థే కదా!. నారాయణ కాలేజీల్లో వందల మంది విద్యార్థులు టార్చర్ భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం దానిపై మాట్లాడేందుకు కూడా ఇష్టపడని ప్రభుత్వం ఇదేగా!. ఏ అర్హత ఉందని హఠాత్తుగా నారాయణ కాలేజీల యజమానికి చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారో వివరణ కూడా ఇవ్వలేనిది ఈ ప్రభుత్వమే కదా!.

నాలుగేళ్లుగా కార్పొరేట్ విద్యావ్యవస్థ మూడు పువ్వులకు పదహారు కాయలుగా విరాజిల్లేలా సాయపడుతూ… ప్రభుత్వ స్కూల్‌లో టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా ఏళ్ల తరబడి దాటవేస్తున్న గంటా శ్రీనివాస్ కూడా కార్పొరేట్ విద్యావ్యవస్థ.. చీ.. చీ అంటే జనం ఏమనుకోవాలని భావిస్తున్నారు.

First Published:  16 Oct 2018 1:00 AM GMT
Next Story