ఓటమి భయంతోనే యరపతినేని నియోజకవర్గం మారుతున్నాడా?

గుంటూరు జిల్లాలో ఇప్పుడు కొత్త ప్రచారం సాగుతోంది. గురజాల వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న కాసు మహేష్‌ ఆ నియోజకవర్గాన్ని వదిలేసి నరసరావుపేటకు వెళ్లిపోవాలనుకుంటున్నారు అన్నది సదరు ప్రచారం. తొలుత ఎవరో పనిపాటలేని వారు చేస్తున్న ప్రచారంగానే కాసు మహేష్‌ వర్గం భావించింది. కానీ ఈ ప్రచారం పక్కాగా నియోజవర్గంలోని ప్రతి ఒక్కరికీ తెలిసేలా జరుగుతుండడంతో వైసీపీ శ్రేణులు అప్రమత్తమయ్యాయి.

ఈ ప్రచారం వెనుక ఎవరున్నారు అన్న దానిపై ఆరా తీశారు. అలా ఆరా తీయగా ఈ ప్రచారం వెనుక మైనింగ్ డాన్, టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ ఉన్నట్టు తేలింది. యరపతినేని వ్యవహారం నచ్చని టీడీపీ నేతలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. వారు చెబుతున్న సమాచారం ప్రకారం… గురజాల ప్రాంతంలో వేల కోట్ల మైనింగ్‌ని నాలుగేళ్లుగా యదేచ్చగా సాగించి, హైకోర్టు నుంచి నోటీసులు కూడా అందుకున్న యరపతినేని శ్రీనివాస్‌ ఇటీవల ఒక ప్రముఖ సంస్థ ద్వారా సర్వే చేయించుకున్నారు. సర్వేలో యరపతినేని గెలుపు దాదాపు అసాధ్యమని తేలింది.

అనతికాలంలో వేలకోట్లు సంపాదించడం, ఎక్కడికి వెళ్లినా సీఎం స్థాయిలో కాన్వాయ్‌ని మెయింటెయిన్‌ చేయడం, దాదాపు 75 కోట్లు ఖర్చు పెట్టి కుమారుడి పెళ్లి చేయడం వంటివి చూసిన నియోజకవర్గ ప్రజలు యరపతినేనిని తమలో ఒక వ్యక్తిగా చూడలేకపోతున్నారని స్పష్టమైంది.

పైగా సంపాదనకే సమయమంతా వెచ్చించడంతో ప్రజలకు, యరపతినేతికి మధ్య గ్యాప్‌ బాగా పెరిగింది. అన్నింటికి మించి వైసీపీ ఇన్‌చార్జ్‌గా కాసు మహేష్ వచ్చిన తర్వాత యరపతినేనికి గట్టి సవాళ్లు ఎదురవుతున్నాయి.

కాసు కుటుంబానికి ప్రజల్లో మంచి సానుకూలత ఉండడం, మహేష్ తరుచూ నియోజకవర్గంలో పర్యటనలు చేస్తుండడంతో వైసీపీ బాగానే పుంజుకుంది. యరపతినేని అక్రమాలపై కాసు మహేష్ గళమెత్తుతున్న తీరు కూడా నియోజకవర్గంలోని విద్యావంతులు, ఉద్యోగుల్లో సానుకూలతను తెస్తోంది. కాసు మహేష్ ను ఇన్‌చార్జ్‌గా నియమిస్తే జంగా కృష్ణమూర్తి వైసీపీ నుంచి బయటకు వస్తారని యరపతినేని ఆలోచన చేశారు. కానీ అలా జరక్కపోగా మహేష్, జంగా కృష్ణమూర్తి కలిసి పనిచేస్తుండడం యరపతినేనికి మరింత ఇబ్బందిగా మారింది.

తనపై తాను చేయించుకున్న సర్వే రిపోర్టు తర్వాతే యరపతినేని శ్రీనివాస్‌ తన ఎత్తులకు పదును పెట్టారని చెబుతున్నారు. గురజాల నుంచి కాసు మహేష్‌ తనకు ప్రత్యర్థిగా నిలిస్తే గెలవడం కష్టమని భావించే యరపతినేని ఇలా చాప కింద నీరులా కాసు మహేష్ నరసరావుపేటకు వెళ్లిపోతున్నారని ప్రచారం చేయిస్తున్నారని చెబుతున్నారు.

ఇలా చేయడం ద్వారా కాసు మహేష్ నాయకత్వంలో ఈసారి యరపతినేనిని పడదోస్తామన్న ధీమాతో ధైర్యంగా పనిచేస్తున్న వైసీపీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని చెల్లాచెదురు చేయడమే యరపతినేని ప్రధాన ఉద్దేశమంటున్నారు.

కాసు మహేష్‌ నియోజకవర్గం మారుతున్నారన్న ప్రచారం జరిగితే ప్రజల్లో తన నాయకత్వానికి తిరుగులేదన్న భావన కూడా ఏర్పడుతుందని యరపతినేని భావిస్తున్నారు. ఈ ప్రచారాన్ని తొలుత లైట్ తీసుకున్న కాసు మహేష్ వర్గం ఇప్పుడు దాన్ని తిప్పికొట్టేందుకు ఎదురుదాడి మొదలుపెట్టింది.

హేమాహేమీలనే ఢీకొన్న కాసు కుటుంబం … యరపతినేనిని చూసి పారిపోవడమా? ఇది నమ్మశక్యమేనా? అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గాలు వదిలి పారిపోవడానికి అది నారా వారి ఫ్యామిలీ కాదని… కాసు ఫ్యామిలీ అని గుర్తించుకోవాలంటున్నారు. నిజంగా యరపతినేనికి అంత సీనే ఉంటే… పిడుగురాళ్ల పట్టణంలో పట్టున్న ముస్లిం నాయకుడు ఉస్మాన్‌ మేస్త్రీ, గురజాలలో సీనియర్‌ నాయకుడిగా ఉన్న యెనుమల మురళీధర్‌లు కాసు మహేష్ సమక్షంలో వైసీపీలోకి ఎందుకు చేరుతారని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.

మరోవైపు సర్వే రిపోర్టు తర్వాత యరపతినేని శ్రీనివాస్ గుంటూరు-2 నుంచి పోటీ చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఈ విషయాన్ని చంద్రబాబు వద్ద కూడా ప్రస్తావించారంటున్నారు. చంద్రబాబుతో ఉన్న బలమైన ఆర్థిక సంబంధాల కారణంగా యరపతినేని విజ్ఞప్తిని చంద్రబాబు మన్నించినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.