పవన్‌ కల్యాణ్‌కు వ్యతిరేకంగా కిడారి భార్య ధర్నా

ఇటీవల మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు భార్య ధర్నాకు దిగారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆమె విశాఖ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహం ఎదుట ధర్నాకు దిగారు. ఆమెకు పలువురు టీడీపీ మహిళా నాయకులు సంఘీభావం తెలిపారు.

జనసేన కవాతులో మాట్లాడిన పవన్‌ కల్యాణ్… నేతల అవినీతి వల్లే మావోయిస్టులు పుట్టుకొస్తున్నారని వ్యాఖ్యానించారు. కిడారిని హత్య చేసింది గోదావరి జిల్లా నుంచి మావోయిస్టుల్లోకి వెళ్లిన ఆడపడుచేనని…. ఆమె ఎందుకు అటువైపు వెళ్లిందో ఆలోచించుకోవాలని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై కిడారి భార్యతో పాటు మాజీ ఎమ్మెల్యే సోమా భార్య నిరసన తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ మావోయిస్టులను సమర్ధించడం మానుకోవాలని కిడారి భార్య పరమేశ్వరి డిమాండ్ చేశారు. తన భర్త హత్య జరిగి నెల కూడా కాలేదని అప్పుడే హత్యను సమర్ధించేలా, మావోయిస్టులను వెనకేసుకొచ్చేలా పవన్ కల్యాణ్ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. బాధితులమైన తమకు ధైర్యం చెప్పాల్సిందిపోయి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

మావోయిస్టులకు అనుకూలంగా చేసిన ప్రకటనను పవన్‌ కల్యాణ్ ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్యే సోమా భార్య డిమాండ్ చేశారు. నిజాయితీ గల నేతలు హత్యకు గురైతే వారిని కూడా విమర్శించడం సరికాదన్నారు. పవన్‌ కల్యాణ్ శవరాజకీయాలను మానుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.