ప్రార్థ‌న‌

ప్రార్థ‌న ప్ర‌భావం అపూర్వ‌మైంది. ప్రార్థ‌న నిష్క‌ల్మ‌షంగా ఉండాలి. ప్ర‌యోజ‌నాల్ని ఆశించింది ఎప్పుడూ ప్రార్థ‌న కాదు. గుళ్లూ గోపురాలు సంద‌ర్శిస్తూ ఉంటారు. ముడుపులు చెల్లిస్తూ ఉంటారు. మ‌న‌సులో ఉన్న కోరిక‌ల‌న్నిట్నీ భ‌గ‌వంతుని ముందు పెట్టి ‘స్వామీ! నా కోరిక‌ల్ని తీరిస్తే నీకు నేను ఫ‌లానా స‌మ‌ర్పించుకుంటాను. వాటా ఇస్తాను’ అని మొక్కుకుంటారు. బేర‌సారాలు చేస్తారు.
వ్యాపార లావాదేవీలు ప్రాపంచికమైన‌వి. ఆధ్యాత్మిక విష‌యాల‌తో వాటికి సంబంధం లేదు. కానీ మామూలు మ‌నుషులెవ‌రూ ఇందుకు ఒప్పుకోరు. కాంక్ష‌ల‌తో కైవ్య‌లానికి ముడిపెడ‌తారు.
ఒక గురువు శిష్యుడు ఒక పెద్ద అర‌ణ్యం గుండా వెళుతున్నారు. అది చాలా ద‌ట్ట‌మైన అర‌ణ్యం. ఆకాశాన్నంటే చెట్లు. కొమ్మ‌లు విశాలంగా వ్యాపించి దాదాపు గాఢాంధ‌కారం అల‌ముకున్న‌ట్లు ఉంది. గురువు న‌డుస్తున్నాడు శిష్యుడు అనుస‌రిస్తున్నాడు.
గురువు మార్గ‌మ‌ధ్యంలో ఆగి ‘ఇది ప్ర‌శాంత స‌మ‌యం. నిర్మ‌ల హృద‌యంతో భ‌గ‌వంతుణ్ణి ప్రార్థ‌న చేద్దాం’ అని ప‌రిస‌రాల్ని శుభ్రం చేసి నేల మీద కూచుని ధ్యాన‌ముగ్ధుడు కాబోతూ శిష్యుణ్ణి చూశాడు. శిష్యుడు అదేమీప‌ట్ట‌న‌ట్లు నిల్చునే ఉన్నాడు.
గురువు ‘నాయ‌నా! నువ్వు ప్రార్ధ‌న చెయ్య‌వా!’ అన్నాడు.
శిష్యుడు ‘గురువు గారూ మీరు ప్రార్ధ‌న చేసుకోద‌ల‌చుకుంటే చేసుకోండి. నాక‌యితే ప్రార్థ‌న చేయాల‌నిపించ‌డం లేదు, పైగా ప‌రిస‌రాలు, చీక‌టి చూస్తే నాకు భ‌య‌భ‌యంగా ఉంది. అందుక‌ని ప్రార్థ‌న నేను చెయ్య‌ను’ అన్నాడు.
గురువు శిష్యుణ్ణి నిర్బంధించ‌కుండా కాసేపు ధ్యానం చేసి భ‌గ‌వంతుణ్ణి హృద‌య‌పూర్వ‌కంగా ప్రార్థ‌న చేసి క‌ళ్లు తెరిచాడు. శిష్యుడు దిక్కులు చూస్తున్నాడు.
చీక‌టి ప‌డిపోయింది. గురువు ‘ఈ రాత్రికి ఈ చెట్టుకిందే విశ్రాంతి తీసుకుందాం’ అని చెట్లు కింద తెచ్చుకున్న కంబ‌డి ప‌రిచాడు. శిష్యుడి భ‌యం రెట్టింప‌యింది.
‘ గురువు గారూ… పులి వ‌చ్చి న‌న్ను తినేస్తే’ అన్నాడు. గురువు ‘నీ కోసం ప్రార్థ‌న చేస్తాను’ అన్నాడు. గురువు చాద‌స్తానికి విసుక్కుని శిష్యుడు ‘నేను చెట్టెక్కి ప‌డుకుంటాను. కింద ఉండే ధైర్యం నాకు లేదు. మీరు కింద‌నే ప‌డుకోండి’ అన్నాడు. శిష్యుడు చెట్టెక్కాడు.
అంత‌లో ఒక పులి ఎక్క‌డి నుంచో వ‌చ్చింది. అది చెట్టును స‌మీపించి గురువును వాస‌న చూసి త‌న దారంటే త‌ను వెళ్లిపోయింది. గురువు నిర్భ‌యంగా, నిశ్చ‌లంగా కూచున్నాడు. చెట్టెక్కిన శిష్యుడికి చెమ‌ట‌లు ప‌ట్టాయి. గురువు ప్ర‌శాంతంగా నిద్ర‌పోయాడు. శిష్యుడు భ‌యంతో స‌గం నిద్ర‌పోయాడు.
తెల్ల‌వారింది. గురు శిష్యులు మ‌ళ్లీ ప్ర‌యాణం ప్రారంభించారు.
అంత‌లో అడ‌విలో నించి పులి గాండ్రిపు విన‌ప‌డింది. వెంట‌నే గురువు ప‌రిగెట్ట‌డం మొద‌లుపెట్టాడు. శిష్యుడు విస్తుపోయాడు. ‘గురువు గారూ పులి అరుపుకే భ‌య‌ప‌డి ప‌రిగెడుతున్నారు. నిన్న పులి మిమ్మ‌ల్ని తాకినా క‌ద‌ల‌కుండా కూర్చున్నారు. ఆశ్చ‌ర్యంగా ఉందే’ అన్నాడు.
దానికి గురువు అద్భుత‌మైన స‌మాధాన‌మిచ్చాడు.
‘నేను నిన్న ప్రార్ధిస్తున్న‌ప్పుడు దేవుడు నాతో బాటు ఉన్నాడు.
ఇప్పుడు నువ్వు నాతో బాటు ఉన్నావు’

–సౌభాగ్య‌