యూత్ ఒలింపిక్స్ కాంస్య విజేతగా కూలికొడుకు

  • యూత్ ఒలింపిక్స్ లో చిత్రవేల్ కు కాంస్యం
  • ట్రిపుల్ జంప్ లో ప్రవీణ్ చిత్రవేల్ కు పతకం

భారత క్రీడారంగంలో… నవతరం క్రీడాకారులు సంచలన విజయాలతో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. క్రీడలు ఏవైనా పట్టుమని రెండు పదులైన రాకుండానే ప్రపంచస్థాయిలో విజయాలు నమోదు చేస్తూ.. నేటితరం కుర్రాళ్లా… మజాకానా… అనిపించుకొంటున్నారు. అంతేకాదు… పేదరికంతో నిరంతర పోరాటం చేస్తున్న కూలీల పిల్లలు సైతం ఒలింపిక్స్ లో పతకాలు సాధిస్తూ దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నారు.

అర్జెంటీనా లోని బ్యూనోస్ ఏర్స్ లో జరుగుతున్న 2018 యువజన ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో భారత్ కు రెండో పతకం అందించిన ప్రవీణ్ చిత్రవేల్… ఓ కూలికొడుకు అంటే ఆశ్చర్యంలేదు. ట్రిపుల్ జంప్ లో 15.68 మీటర్ల రికార్డుతో కాంస్య పతకం సాధించిన ప్రవీణ్… తమిళనాడులోని తంజావూర్ జిల్లా నుంచి… భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ లోకి దూసుకొచ్చాడు. బాల్యం నుంచే పేదరికంతో
పోరాడుతున్న ప్రవీణ్ అమ్మానాన్నలు…. కూలీపనులు చేస్తూ తమ కుటుంబాన్ని పోషించుకొంటూ వస్తున్నారు. ప్రవీణ్ కు బాల్యం నుంచి ఆటలంటే ఇష్టం. ప్రస్తుతం కర్ణాటకలోని మంగళూరులో… స్పోర్ట్స్ కోటా కింద సీటు సంపాదించి… బీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఖేలో ఇండియా పథకం ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపుతెచ్చుకొన్న ప్రవీణ్… బంగారు పతకం సైతం సంపాదించాడు.

అథ్లెటిక్స్ శిక్షకురాలు ఇందిరా సురేశ్ శిక్షణలో రాటు దేలిన ప్రవీణ్ నాగర్ కోయిల్ కేంద్రంలో శిక్షణ కొనసాగిస్తున్నాడు. 7వ తరగతి నుంచే అథ్లెటిక్స్ లో శిక్షణ తీసుకొంటూ జాతీయ స్థాయి అథ్లెట్ గా ఎదిగిన ప్రవీణ్ చిత్రవేల్ కుటుంబ ఆర్థికపరిస్థితి … ప్రస్తుత యూత్ ఒలింపిక్స్ లో సాధించిన కాంస్య పతకంతో కాస్తయినా మెరుగుపడాలని కోరుకొందాం. 2018 యువజన ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో భారత్ సాధించిన మొత్తం రెండు పతకాలలో ప్రవీణ్ చిత్రవేల్ సాధించిన పతకం ఒకటి కావడం విశేషం.