లీకైన టాక్సీవాలా.. రిపేర్లతో మన ముందుకు

గీతగోవిందం లీక్ అయిన టైమ్ లోనే, విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమా కూడా లీక్ అయింది. ఒకే హార్డ్ డిస్క్ లో ఈ రెండు సినిమాలు ఉండడంతో పైరసీ అనేది ఆటోమేటిగ్గా జరిగిపోయింది. బాధాకరమైన విషయం ఏంటంటే.. గీతగోవిందం పార్టులు పార్టులుగా విడుదలైతే.. టాక్సీవాలా మొత్తం ఒకే ఫైల్ కింద నెట్ లో ప్రత్యక్షమైంది.

అప్పట్లో యుద్ధప్రాతిపదికన నెట్ నుంచి టాక్సీవాలా సినిమాను తొలిగించారు. ఇప్పుడా సినిమాకు చిన్నచిన్న మార్పులు చేసి విడుదలకు సిద్ధంచేశారు. వచ్చేనెల 16న థియేటర్లలోకి రానుంది టాక్సీవాలా సినిమా. ఈ సినిమా రన్ టైమ్ ను కాస్త తగ్గించారు. సెకండాఫ్ లో కొన్ని డైలాగ్ వెర్షన్లు తీసేసి, కామెడీ బిట్స్ యాడ్ చేశారు. ఇలాంటి చిన్న చిన్న మార్పులతో టాక్సీవాలా విడుదలకు సిద్ధమైంది.

పీఆర్వో ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సమర్పిస్తున్నాయి. రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమాకు కథ అందించడంతో పాటు దర్శకత్వం వహించాడు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.

గతంలో ఓసారి విడుదల చేయాలనే ఉద్దేశంతో సినిమా ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. తర్వాత ఆపేశారు. వచ్చే వారం నుంచి టాక్సీవాలాకు సంబంధించి ఫ్రెష్ గా మరోసారి ప్రచారం చేపట్టబోతున్నారు. ఇప్పటికే టీజర్ విడుదలైంది కాబట్టి, ట్రయిలర్ లాంచ్ చేస్తారు.