షాకింగ్: అర్జున్ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు

మీ-టూ మూమెంట్ లో మరో బడా హీరో పేరు బయటకొచ్చింది. తెలుగు-తమిళ-కన్నడ భాషల్లో 150 సినిమాలు పూర్తిచేసుకున్న సీనియర్ నటుడు అర్జున్ పై ఓ కన్నడ హీరోయిన్ తీవ్ర ఆరోపణలు చేసింది. అర్జున్ ప్రతిష్టాత్మక 150వ సినిమా కురుక్షేత్రంలో తనకు ఆ చేదు అనుభవం ఎదురైనట్టు ప్రకటించింది

కురుక్షేత్రం సినిమాలో అర్జున్ సరసన హీరోయిన్ గా నటించింది కన్నడ బ్యూటీ శృతి హరిహరన్. సినిమాలో అర్జున్ కు భార్యగా ఆమె నటించింది. ఈ సినిమాలో ఓ రొమాంటిక్ సన్నివేశం తెరకెక్కిస్తున్న టైమ్ లో అర్జున్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తోంది శృతి. ఆ సన్నివేశం తెరకెక్కిస్తున్న టైమ్ లో తన వెనక భాగం మొత్తాన్ని అర్జున తన చేతులతో తడిమేశాడని చెప్పుకొచ్చింది.

“అర్జున్ సినిమాలు చూసి పెరిగాను నేను. అలాంటి వ్యక్తి సరసన హీరోయిన్ ఛాన్స్ అనగానే పొంగిపోయాను. ఆ సినిమాలో అతడి భార్యగా నటించాను. ఓ సీన్ లో మేమిద్దం కౌగిలించుకోవాలి. రెండు డైలాగ్స్ చెప్పి ఆ పని చేయాలి. అయితే అర్జున్ మాత్రం అంతకుమించి ప్రవర్తించాడు. డైలాగ్ చెప్పిన వెంటనే నేను ఊహించని విధంగా నన్ను హత్తుకున్నాడు. తన రెండు చేతులతో నా వెనక భాగం మొత్తాన్ని కిందకు మీదకు తడిమాడు.”

తనకు జరిగిన కాస్టింగ్ కౌచ్ అనుభవాల్ని ఇలా వివరిస్తూ.. ట్విట్టర్ లో 4 పేజీల పోస్ట్ పెట్టింది శృతి. తనను కిందామీద తడిమేయడమే కాకుండా, సన్నివేశానికి ముందు ఫోర్-ప్లేగా ఈ తడిమే సీన్ పెడితే బాగుంటుందని దర్శకుడికి చెప్పడం తనకింకా బాధేసిందని చెప్పుకొచ్చింది శృతి.

తన కెరీర్ లో ఎన్నో కాస్టింగ్ కౌచ్ అనుభవాల్ని చూశానని చెప్పుకొచ్చిన శృతి, అర్జున్ లాంటి బిహేవియర్ ను మాత్రం ఊహించలేదంది. సీన్ చేయడానికి ముందు రిహార్సల్స్ చేశామని, ఆ టైమ్ లో సైలెంట్ గా ఉన్న అర్జున్.. కెమెరా ఆన్ చేసిన వెంటనే విచిత్రంగా ప్రవర్తించాడని ఆరోపించింది. తను అసౌకర్యానికి గురైన విషయాన్ని దర్శకుడు కూడా గమనించాడని, కురుక్షేత్రం ముందు, కురుక్షేత్రం తర్వాత ఏ హీరో తనతో అలా బిహేవ్ చేయలేదని చెప్పుకొచ్చింది.

యూనిట్ లో 50 మంది ముందు అర్జున్ అలా తనను వెనక నుంచి తడిమేసరికి తట్టుకోలేకపోయానని అంటోంది శృతి. కానీ సినిమాకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రొఫెషనల్ గా వ్యవహరించానని, ఇప్పుడు మీ-టూ మూమెంట్ చూసి అప్పటి చేదు జ్ఞాపకాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో పోస్ట్ పెడుతున్నానని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతానికైతే శృతి హరిహరన్ ఆరోపణలపై అర్జున్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. కాస్టింగ్ కౌచ్ కు సంబంధించి సౌత్ నుంచి ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయి. శ్రీరెడ్డి సైతం కొంతమందిపై ఈ తరహా ఆరోపణలు చేసింది. కానీ అర్జున్ లాంటి బడా స్టార్ పేరు బయటకు రావడం ఇదే ఫస్ట్ టైం.