భారత నవతరం అథ్లెట్ల సరికొత్త చరిత్ర….

  • మొన్న కామన్వెల్త్ గేమ్స్ లో…
  • నిన్న ఏషియాడ్ లో…
  • నేడు యూత్ ఒలింపిక్స్ లో…

అర్జెంటీనా రాజధాని బ్యునోస్ ఏర్స్ వేదికగా ముగిసిన 2018 యువజన ఒలింపిక్స్ లో భారత బృందం పతకాల మోత మోగించింది. ఖేలో ఇండియా ద్వారా వెలుగులోకి వచ్చిన భారత యువఆథ్లెట్లు కామన్వెల్త్ గేమ్స్, ఆసియాక్రీడల్లో మాత్రమే కాదు… యూత్ ఒలింపిక్స్ లోనూ సత్తా చాటుకొన్నారు.

కుర్రాకారు … టాప్ గేరు…
ప్రపంచంలోనే అత్యధిక యువజన జనాభా ఉన్న ఏకైక దేశం భారత్. జాతికి, రేపటితరానికి వెన్నెముకలాంటి నవతరాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఖేలో ఇండియా పథకం అంచనాలకు మించి సత్ఫలితాలను ఇవ్వటం మొదలు పెట్టింది. 16 ఏళ్ల ప్రాయంలోనే భారత కుర్రకారు ప్రపంచ, ఆసియా స్థాయిలో బంగారు పతకాలు సాధించగలమని చాటుకొంటూ వస్తున్నారు.

గోల్డ్ కోస్ట్ టు బ్యునోస్ ఏర్స్
ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో ముగిసిన 2018 కామన్వెల్త్ గేమ్స్, జకార్తా వేదికగా ముగిసిన ఆసియా క్రీడల్లో పతకాల పంట పండించిన భారత యువఅథ్లెట్లు…. అర్జెంటీనాలోని బ్యునోస్ ఏర్స్ వేదికగా ముగిసిన 2018 యువజన ఒలింపిక్స్ లో సైతం పతకాల మోతతో సరికొత్త రికార్డు నెలకొల్పారు. గతంలో ఎన్నడూలేని విధంగా దేశానికి 3 స్వర్ణాలతో సహా మొత్తం 13 పతకాలు అందించడం ద్వారా గర్వకారణంగా నిలిచారు.

2010 లో 8 పతకాల నుంచి 13 పతకాలకు….
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 18 ఏళ్ల లోపు వయసున్న నవతరం క్రీడాకారుల కోసం యూత్ ఒలింపిక్స్ ను 2010 నుంచి మాత్రమే… అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం నిర్వహిస్తూ వస్తోంది. ప్రారంభ యువజన ఒలింపిక్స్ లో భారత అథ్లెట్లు ఐదు క్రీడాంశాలలో ఎనిమిది పతకాలు మాత్రమే సాధించగలిగారు. ఆ తర్వాత నాలుగేళ్ళకు జరిగిన 2014 గేమ్స్ లో భారత్ రెండంటే రెండు పతకాలు మాత్రమే సంపాదించింది. బాక్సింగ్ లో వికాస్ కిషన్, వెయిట్ లిఫ్టింగ్ లో రాగాల వెంకట రాహుల్ పతకాలు సాధించి భారత్ ఉనికిని కాపాడగలిగారు.

ఖేలో ఇండియా ఫలాలు….
2014 యూత్ ఒలింపిక్స్ లో రెండంటే రెండు పతకాలు మాత్రమే సాధించిన భారత్… 2018 ఒలింపిక్స్ లో మాత్రం మూడు స్వర్ణాలు, 9 రజతాలు, ఓ కాంస్యంతో సహా మొత్తం 13 పతకాలతో సంచలనం సృష్టించింది. భారత అథ్లెట్ల ఈ ఘనత వెనుక… ఖేలో ఇండియా పథకం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు చెందిన.. ప్రతిభావంతులైన అథ్లెట్లను గుర్తించి.. నెలవారీ ఉపకార వేతనాలతో పాటు… అత్యాధునిక శిక్షణ అందచేసిన కారణంగానే…. మను బాకర్, జెర్మీ లాల్ రినుంగా, సౌరవ్ చౌధరి లాంటి నవతరం అథ్లెట్లు వెలుగులోకి రాగలిగారు. 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్, ఆసియాక్రీడల్లో భారత్ పతకాల సంఖ్య అనూహ్యంగా పెరగటం వెనుక ఖేలో ఇండియా పథకం ద్వారా వచ్చిన యువఅథ్లెట్ల కష్టం, ప్రభుత్వ ప్రోత్సాహం ఎంతగానో దాగున్నాయి.

46 మంది అథ్లెట్లు- 13 పతకాలు…
బ్యునోస్ ఏర్స్ వేదికగా జరిగిన 2018 యూత్ ఒలింపిక్స్ లో మొత్తం 46 మంది అథ్లెట్ల బృందంతో 13 రకాల క్రీడల్లో పోటీకి దిగిన భారత్… అంచనాలకు మించి పతకాలు సంపాదించింది. ఇందులో మూడు బంగారు, తొమ్మిది వెండి, ఒక కాంస్య పతకం ఉన్నాయి. బాలుర 62 కిలోల వెయిట్ లిఫ్టింగ్ లో మిజోరం కుర్రాడు జెర్మీ లాల్ రినుంగా బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. యువజన ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన భారత తొలి క్రీడాకారుడిగా రికార్డుల్లో చేరాడు. బాలికల 10 మీటర్ల ఏర్ పిస్టల్ షూటింగ్ లో మను బాకర్, బాలుర 10 మీటర్ల ఏర్ పిస్టల్ షూటింగ్ లో సౌరవ్ చౌధరి స్వర్ణభేరి మోగించారు.

వెండికొండలు….
ఇక… బాలుర 10 మీటర్ల ఏర్ రైఫిల్ షూటింగ్ లో తుషార్ మానే, బాలికల 10 మీటర్ల ఏర్ రైఫిల్ విభాగంలో మేహులీ ఘోష్, బాలికల 44 కిలోల జూడోలో తబాబీ దేవి, బాలుర బ్యాడ్మింటన్ సింగిల్స్ లో లక్ష్య సేన్, బాలికల 43 కిలోల కుస్తీలో సిమ్రన్, బాలుర విలువిద్య వ్యక్తగత విభాగంలో ఆకాశ్ మాలిక్, 5 కిలోమీటర్ల నడకలో సూరజ్ పన్వర్ రజత పతకాలు అందించారు. బాలుర, బాలికల హాకీ విభాగాలలో సైతం భారతజట్టు రజత పతకాలు సాధించాయి. ఇక.. బాలుర ట్రిపుల్ జంప్ లో ప్రవీణ్ చిత్రవేల్ కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

టార్గెట్ 2020 ఒలింపిక్స్ ….
మొత్తం మీద… భారత బృందం 13 క్రీడల్లో పతకాలు సాధించడం విశేషం. హాకీ, జూడో, షూటింగ్ క్రీడల్లో తొలిసారిగా భారత అథ్లెట్లు పతకాలు సంపాదించారు. జకార్తా వేదికగా ముగిసిన 2018 ఆసియాక్రీడల్లో భారత్ 69 పతకాలతో అత్యుత్తమ ఫలితాలు సాధించడమే కాదు…యువజన ఒలింపిక్స్ లో సైతం అదేస్థాయి ఫలితాలు సాధించడమూ… శుభసూచకం మాత్రమే కాదు… మరో రెండేళ్లలో జరుగబోయే టోక్యో ఒలింపిక్స్ లో పతకాల సాధనకు నాంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.