టీఆర్ఎస్‌కు క‌ర్నాట‌క సెంటిమెంట్ భ‌యం ! 

రాజ‌కీయాలంటేనే ర‌క‌ర‌కాల సెంటిమెంట్లు ఉంటాయి. ఈ సెంటిమెంట్లు నేత‌ల‌కు భ‌యాలు పుట్టిస్తుంటాయి. తాజాగా గులాబీ ద‌ళానికి ఇప్పుడొక సెంటిమెంట్ నిద్ర‌ప‌ట్టనివ్వ‌డం లేదు. క‌ర్నాట‌క మ‌న పొరుగు రాష్ట్రం. అంతేకాదు. అక్క‌డ ఇటీవ‌లే ఎన్నిక‌లు జ‌రిగాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ లాగే కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి సిద్ధరామ‌య్య ప్ర‌జా ఆక‌ర్ష‌క ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టారు. ఎన్నిక‌ల ముందు ప‌లు హామీలు ఇచ్చారు. లింగాయ‌త్‌ను మ‌తానిగా గుర్తిస్తూ హ‌డావుడి చేశారు. ఈ హ‌డావుడి ఒక  ఎత్తు. ఎన్నిక‌ల ముందు చేసిన ఈ ఎత్తుగ‌డ‌లు కాంగ్రెస్‌కు క‌లిసిరాలేదు అని ఆ త‌ర్వాత ఫ‌లితాలు రుజువు చేశాయి.

సిద్ధ‌రామ‌య్య వేసిన ఈ ఎత్తుగ‌డే కాదు. ఇంకో ప్లాన్ కూడా వ‌ర్క్‌వుట్ కాలేదు. కాంగ్రెస్ సంక్షేమ ప‌థ‌కాలు చూసి జ‌నం ఓట్లే స్తార‌ని ఆయ‌న న‌మ్మారు.  2013 క‌ర్నాక‌ట‌లో కాంగ్రెస్ 122 సీట్లు గెలిచి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన త‌మ‌కు మ‌ళ్లీ ఓటేస్తార‌ని కాంగ్రెస్ నేత‌లు అతివిశ్వాసంతో ముందుకెళ్లారు. గ‌త ఏడాది మేలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో 122 మంది సిట్టింగ్‌లో 104 మందికి టికెట్లు ఇచ్చారు,  ఎన్నిక‌ల త‌ర్వాత చూస్తే వీరిలో కేవ‌లం 45 మంది మాత్ర‌మే గెలిచారు,  అంటే దాదాపు 60 మంది ఓడిపోయారు. మొత్తం 224 సీట్లలో కాంగ్రెస్ కేవ‌లం 78 సీట్ల‌లో విజ‌యం సాధించింది.

క‌ర్నాట‌క లెక్క‌లు చూసిన టీఆర్ఎస్ నేత‌లు ఇక్క‌డ లెక్క‌లు వేస్తున్నారు. 105 మంది అభ్యర్థుల‌కు ఒకేసారి టికెట్లు ప్ర‌కటించారు. ఇందులో ఇద్ద‌రు సిట్టింగ్‌ల‌ను మాత్ర‌మే మార్చారు. కేసీఆర్‌కు ఉన్న చ‌రిష్మానే గెలిపిస్తుంద‌నే ధీమాతో సిట్టింగ్‌ల‌కు టికెట్లు ప్ర‌క‌టించారు. అయితే వీరిపై గ్రౌండ్ లెవ‌ల్లో ఎలాంటి స్పందన వ‌స్తుంద‌నేది ఇప్పుడు ఆస‌క్తి రేపుతోంది. ఓ వైపు అస‌మ్మ‌తి స్వ‌రం… మ‌రోవైపు సిట్టింగ్‌ల‌పై వ్య‌తిరేక‌త త‌మ కొంప ముంచుతుంద‌ని కొంద‌రు గులాబీ నేత‌లు భ‌యప‌డుతున్నారు. సిట్టింగ్‌ల‌పై వ్య‌తిరేకత చ‌ల్లార‌క‌పోవ‌డంతో ఆదివారం టీఆర్ఎస్ నేత‌ల‌తో మీటింగ్ ఏర్పాటు చేశార‌ని…ఇందులో కేసీఆర్ దిశానిర్దేశం చేస్తార‌ని అంటున్నారు.