Telugu Global
NEWS

బీజేపీతో చంద్రబాబు కటీఫ్‌ ఉత్తుత్తిదేనా?

నాలుగేళ్లు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంతో చెట్టా పట్టాల్‌ వేసుకొని తిరగడమే కాక, తన మంత్రి వర్గంలో కూడా బీజేపీ మంత్రులకు చోటిచ్చిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నప్పటికీ…. ఆయన ఇప్పటికీ కేంద్రంలోని కొందరు ముఖ్యులతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో గుప్పుమంటోంది. ప్రధాని నరేంద్రమోదీపై యుద్ధం చేస్తున్నట్లుగా చంద్రబాబు చెప్పుకుంటున్నా… లోపాయకారీగా ఒక ఒప్పందం ప్రకారమే ఇదంతా జరుగుతోందనే వాదన బలంగా వినిపిస్తోంది. చంద్రబాబుకు బినామీగా అనుమానాలు వ్యక్తం అవుతున్న […]

బీజేపీతో చంద్రబాబు కటీఫ్‌ ఉత్తుత్తిదేనా?
X

నాలుగేళ్లు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంతో చెట్టా పట్టాల్‌ వేసుకొని తిరగడమే కాక, తన మంత్రి వర్గంలో కూడా బీజేపీ మంత్రులకు చోటిచ్చిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నప్పటికీ…. ఆయన ఇప్పటికీ కేంద్రంలోని కొందరు ముఖ్యులతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో గుప్పుమంటోంది.

ప్రధాని నరేంద్రమోదీపై యుద్ధం చేస్తున్నట్లుగా చంద్రబాబు చెప్పుకుంటున్నా… లోపాయకారీగా ఒక ఒప్పందం ప్రకారమే ఇదంతా జరుగుతోందనే వాదన బలంగా వినిపిస్తోంది. చంద్రబాబుకు బినామీగా అనుమానాలు వ్యక్తం అవుతున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌పై ఆదాయపు పన్ను, ఈడీ శాఖల అధికారులు నిర్వహించిన దాడులు కూడా అంత నిఖార్సయినవిగా భావించడానికి వీల్లేదనే వినిపిస్తోంది.

తనపై దాడులు జరిగిన తరువాత కూడా రమేష్‌ విమర్శకులపై ఒంటి కాలితో దాడి చేస్తున్నారంటేనే ఆయన తాలూకు అక్రమాలు ఇప్పటికీ బయట పడలేదనే ధైర్యమే ఆయన్ను అలా మాట్లాడిస్తోందని అంటున్నారు. గత నాలుగున్నరేళ్ళుగా ఏపీలో జరిగిన అవినీతి, అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. వివిధ పథకాల కింద జరిగిన నిధుల దుర్వినియోగం అంతా ఇంతా కాదు.

రాజధాని నిర్మాణంకోసం భూ సమీకరణ మొదలు, సింగపూర్‌ ఒప్పందాలు, నీటి పారుదల ప్రాజెక్టుల్లో వ్యయ అంచనాల పెంపు, అవినీతి…. ఇలాంటివెన్నో ఉన్నాయి. తమతో దూరమైనందుకు నిజంగా చంద్రబాబుపై బీజేపీకి గాని, ప్రధానికి గాని కక్ష ఉంటే వాటిపై విచారణలకు ఆదేశించి ఉండొచ్చు. లేదా కొన్ని కీలక శాఖల్లో జరిగిన ముడుపుల బాగోతంపై ఆయా మంత్రులపైనా, ఉన్నతాధికారులపైనా ఐటీ దాడులు జరిగి ఉండోచ్చు. ఎన్నికలపుడు టీడీపీకి నిధులు తరలించే కేంద్రాల విషయం కూడా ఐటీ వారికి తెలియదనుకోవడానికి వీల్లేదు. అలాంటి మూలాలపై దాడి చేసే పరిస్థితే అసలు కనిపించడంలేదు. రమేష్‌పై జరిగిన ఐటీ దాడి కూడా ఒక అవగాహన మేరకే జరిగిందనే అనుమానాలున్నాయి. కేంద్రంలో ఐటీ, ఈడీ శాఖలకు ఆధ్వర్యం వహించే ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో చంద్రబాబుకు పూర్వాశ్రమం నుంచీ మంచి సావాసం ఉంది. నితిన్‌ గడ్కరీతో బాబు బంధమైతే వివరించనలవి కాదని అందరూ అంగీకరిస్తారు.

ఇక మరో ప్రధాన శాఖ అయిన హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అయితే చంద్రబాబును తమకు పాత మిత్రుడని పార్లమెంటు సాక్షిగా వెల్లడించారు. ఇక బీజేపీ నేతలను ఇప్పటికీ ప్రభావితం చేయగలుగుతున్న ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అండదండలు బాబుకు ఎల్లప్పుడూ ఉన్నాయి. వారంతా కూడా చంద్రబాబుకు సమస్యలొచ్చినపుడు లోపాయికారీగా తోడ్పాటునందించే వారేనన్న విషయం అందరికీ తెలిసిందే.

ఓ పారిశ్రామిక వేత్త పాత్ర

వాస్తవానికి చంద్రబాబు ఎన్టీయే ప్రభుత్వం నుంచి వైదొలిగిన కొంతకాలానికి నరేంద్రమోడీ తనపై ఏవైనా తీవ్రమైన చర్యలు తీసుకుంటారేమోనని, లేదా విచారణలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తనకూ, తన కుమారుడు లోకేష్‌కు భయం పట్టుకుంది. దేశంలోని కార్పొరేట్‌ రంగాన్ని శాసిస్తూ ఉండటమే కాక, తెలుగు రాష్ట్రాల్లో మీడియా మొఘల్‌గా పేరొందిన ప్రముఖునితో దగ్గరి సంబంధాలున్న పారిశ్రామిక వేత్త ఒకరు మోదీ వద్దకు రాయబారం వెళ్ళి…. ఎన్నికల తరువాత అవసరమైనపుడు చంద్రబాబు బీజేపీకే మద్దతు నిప్పించేలా చేసే బాధ్యత తనదే…. అని చెప్పి వచ్చారని తెలిసింది.

పైగా రాష్ట్రంలో నాలుగేళ్ళ తరువాత కూడా అభివృద్ధి పెద్దగా ఏమీ జరక్కపోవడంతో చంద్రబాబు బీజేపీ నుంచి దూరమయ్యారని, వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ఆ నింద ఎన్డీయేపై వేయడం కోసమే అలా చేయాల్సి వచ్చిందని ఆ పారిశ్రామికవేత్త మోదీకి నచ్చ జెప్పారట.

దాంతో మోదీ కొంత సర్దుకున్నారని సమాచారం. అందుకే ఇపుడు జరుగుతున్న ఐటీ దాడులు ఏమంత ‘సీరియస్‌’ కాదని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి.

పైగా రమేష్‌పై విడిగా ఐటీ దాడి నిర్వహించి, చంద్రబాబుకు ఆర్థిక లావాదేవీల్లో సన్నిహితులైన ఇతరులను అప్రమత్తం చేశారని, తదుపరి ఇక ఏ టీడీపీ నేతలు లేదా ముఖ్యులపై దాడులు జరిగినా ఒరిగేదేమీ ఉండదని వైఎస్సార్‌సీపీ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. అందుకే చంద్రబాబుది బీజేపీతో ఉత్తుత్తి కటీఫ్‌ అని అనుకోవాల్సి వస్తోంది.

First Published:  22 Oct 2018 8:07 AM GMT
Next Story